టీడీపీలో తెరపైకి మరో వివాదం

21 Jun, 2018 11:01 IST|Sakshi

జిల్లా టీడీపీలో తెరపైకి మరో వివాదం

ముదురుతున్న అంతర్గత విభేదాలు

నగర అధ్యక్షుడు కోటంరెడ్డికి  ‘ఆనం జయ’తో చెక్‌ పెట్టే యత్నం 

సోమిరెడ్డి, నారాయణ, బీదతో పాటు అనేక మందికి జోడు పదవులు

రాజకీయ సమీకరణాలతో కొత్తకొత్త ఎత్తుగడలు

రేగుతున్న అసమ్మతి కుంపటి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  జిల్లా అధికార పార్టీలో రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. ఇప్పటికే అలకలు, అసంతృప్తులతో, నియోజక వర్గాల్లో నేతలు, కార్యకర్తల మధ్య పెరిగిన దూరం, అంతర్గత విభేదాలతో సతమవుతున్న తరుణంలో తాజాగా ‘జోడు పదవుల’ జగడం తెరపైకి వచ్చింది. ఓ వర్గం టీడీపీ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హవాకు చెక్‌ పెట్టేందుకు జోడు పదవుల వివాదాన్ని రగిల్చారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా ఆనం జయకుమార్‌రెడ్డిని నియమించటానికి కసరత్తు పూర్తయింది. అయితే ఇదే తరుణంలో జిల్లాలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మొదలుకొని కీలక నేతలు అనేక మంది జోడు పదవుల సవారీ చేస్తున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

గురువారం జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న క్రమంలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.  జిల్లా టీడీపీలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు మరి కొంత మంది నేతలు జోడు పదవుల సవారీ చేస్తున్నారు. అటు పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు ఇటు అధికారిక పదవుల్లోనూ ఉన్నారు. నాలుగేళ్ల అధికారిక పాలన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాపై దృష్టి సారించారు. అది కూడా పార్టీలో అంతర్గత విభేదాలు తార స్థాయికి చేరటం, నిత్యం నియోజకవర్గాల్లో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు, పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్యలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల కర్తవ్యబోధ చేస్తున్నారు.

 ఈ క్రమంలో అనేక మంది నేతలు నేరుగా చంద్రబాబు నాయుడు వద్ద పార్టీలో ప్రాధాన్యం, ఇతర అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వేదికపైనే నేతల తీరును తూర్పార బట్టారు. పార్టీ ప్రాధాన్యం లేదనే కారణంతో పార్టీ మారటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆనం కుటుంబంలో చీలిక తీసుకు వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం జయకుమార్‌రెడ్డిని నగర టీడీపీ అధ్యక్ష  పదవిని ఆఫర్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం జయకుమార్‌రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని కలిశారు. మరికొద్ది రోజుల్లో జయకుమార్‌రెడ్డిని నగర అ«ధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.

కోటంరెడ్డినే ఎందుకు తప్పిస్తున్నాంటే...
నగర టీడీపీలో లెక్కకు మించి గ్రూప్‌లు ఉన్నాయి. నెల్లూరురూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డికి రూరల్‌లోని గ్రామాలతో పాటు నగరంలో సగం డివిజన్లు నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. నగరంపై మంత్రులు సోమిరెడ్డి, నారాయణ ఎవరికి వారుగానే పట్టు సాధించటానికి కొంత కాలంగా వర్గ రాజకీయలను కొనసాగిస్తున్నారు. వీరిలో పాటు నుడా చైర్మన్‌ కోటంరెడ్డి కూడా నగరంలో పట్టు కోసం కసరత్తు చేస్తున్నారు. వీరందరి పోరుతో ప్రాధాన్యం విషయంలో నేతల మధ్య తరచూ బేధాభిప్రాయాలు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆనం కుటంబానికి పార్టీ పరంగా ప్రాధాన్యం ఇస్తే నగరంలో పార్టీ పరిస్థితి కొంత మెరుగు అవుతుందనేది ముఖ్యుల ఆలోచన. 

దీంతో మాజీ మంత్రి ఆదాల, మరి కొందరు నేతలు ఆనం జయకుమార్‌రెడ్డి పేరు తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఆనం వివేకానందరెడ్డి మరణించక ముందు వరకు కూడా ఆనం కుటంబానికే నగర అధ్యక్ష పగ్గాలు అప్పగించటానికి ప్రయత్నాలు సాగాయి. అయితే ఆనం కుటుంబానికి వాస్తవంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చి దానిని నిలుపుకోకపోవటంతో ఆనం వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ క్రమంలో ఆనం సోదరుల్లో ఒకరినైనా పార్టీలో కొనసాగేలా చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని హడావుడి చేస్తున్నారు. దీంతో జోడు పదవుల వ్యవహరం పేరుతో 2011 నుంచి నగర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మార్చాలని నిర్ణయించారు. గత ఏడాది ఆయనకు నుడా చైర్మన్‌ పదవి రావటంతో దాన్ని కారణంగా చూపుతున్నారు.

 అయితే కోటంరెడ్డి వర్గీయులు పార్టీ మాట శిరోధార్యం అని చెబుతున్నప్పటికీ నియామకాన్ని ముందు నుంచే వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు మంత్రులకు రాష్ట్ర పార్టీ పదవులు, ఎమ్మెల్సీగా ఉన్న బీద రవిచంద్రకు జిల్లా పగ్గాలు కొనసాగిస్తుండగా నగర అధ్యక్షుడినే ఎందుకు మార్చాలనుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నారు. అయితే అంతర్లీనంగా ‘ఆనం’కు కాకుండా పార్టీలో సీనియర్‌ నేత మరొకరిని ఎంపిక చేస్తే బాగుంటుదనే డిమాండ్‌ బలంగా వినిపిస్తున్నారు. మొత్తం మీద పదవులు ఖరారు దశ నుంచే అధికార పార్టీలో వివాదాలు కొనసాగటం విశేషం.

మరిన్ని వార్తలు