మీరు చెబితే సీఎం మాట వింటారు..

15 Oct, 2018 09:17 IST|Sakshi

మాటల యుద్ధానికి తెర

అసంతృప్తి నేత కన్నబాబు మరోసారి ఆగ్రహం

ఆదాల ఇన్‌చార్జిగా ఉంటే పార్టీకి తీవ్ర నష్టమంటూ బొల్లినేని ఎదుట వ్యాఖ్యలు

నా పరిస్థితే రేపు మీకు వస్తుందని హెచ్చరిక

ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అందరం పాటించాలన్న బొల్లినేని

 సీఎంఓకు ఫిర్యాదు చేసిన ఆదాల

ఆత్మకూరు అధికార పార్టీలో మరోసారి చిచ్చురేగింది. అసంతృప్తి నేత కన్నబాబు మరోసారి పార్టీ నేతల తీరుపై ఓ ప్రైవేట్‌ పంక్షన్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో మరోసారి ఆత్మకూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ సీఎంఓకు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం మరింత ముదిరింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నబాబు అవకాశం దొరికినప్పుడుల్లా పార్టీ వేదికలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆదివారం చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలో టీడీపీ నేత కుమార్తె వివాహ వేడుకలకు కన్నబాబు హాజరయ్యారు. అదే వివాçహానికి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య హాజరయ్యారు. వీరిరువురు ఎదురుపడిన క్రమంలో కన్నబాబు కృష్ణయ్య ఎదుట తన ఆక్రోశం వెళ్లగక్కారు. తనకు సహకరించాలని బొల్లినేని కృష్ణయ్య కన్నబాబును కోరగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వ్యవహర శైలిపై కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ‘ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తాత్కాలిక ఇన్‌చార్జిగా ఉండి ఆయన పెత్తనం కొనసాగితే చివరికి నా మాదిరిగానే మీరు అవుతారు’ అని బొల్లినేని ఎదుట కన్నబాబు పేర్కొన్నారు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గ నేతలు పెత్తనం చేస్తే క్యాడర్‌ ఇబ్బంది పడుతుందని కన్నబాబు మాట్లాడగా రెడ్డి సామాజికవర్గ నేతను సీఎం ఇక్కడ ఇన్‌చార్జిగా నియమిస్తే ఆయన్ను తొలగించాలని చెప్పడానికి నేను ఎవర్ని.. ఇది కరెక్ట్‌ కాదు.. అందరం కలసి సీఎం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలే తప్ప తీసివేయమని చెప్పే అధికారం తనకు లేదన్నారు. మీరు చెబితే సీఎం మాట వింటారు మీరే మాట్లాడాలని మీరే దీనికి సరైన వ్యక్తి అని కన్నబాబు పేర్కొన్నారు. నేను ఎలా చెబుతానని, నాకు ఎలాంటి అధికారం లేనప్పుడు నేను ఏం చేస్తాను ఇది కరెక్ట్‌ కాదని బొల్లినేని కృష్ణయ్య బుదలిచ్చారు. ఈ క్రమంలో ఇరువురు తొలుత ప్రత్యేకంగా గదిలో సమావేశమై చర్చించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కన్నబాబు వ్యవహారంపై ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్టీ సీఎంఓకు కన్నబాబు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇన్‌చార్జి నుంచి తప్పించిన తర్వాత
కన్నబాబు 2014 ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో తర్వాత ఇన్‌చార్జిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీలోకి మాజీ మంత్రి ఆనం చేరిన క్రమంలో ఆయన్ను ఇన్‌చార్జిగా నియమించి కన్నబాబును తప్పించారు. తదనంతరం మారిన సమీకరణాలలో కన్నబాబు ఇన్‌చార్జి పదవిని ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం తాత్కాలిక ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించింది. దీంతో కన్నబాబు పార్టీని కాపాడండి అంటూ నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు దిగారు. తదనంతరం పార్టీ నేతలు దీక్ష విరమింపజేశారు.

 తర్వాత కన్నబాబును పట్టించుకోలేదు. దీనికి అనుగుణంగా మాజీ మంత్రి ఆదాల బొల్లినేని కృష్ణయ్యను తెరపైకి తీసుకొచ్చారు. రెండు పర్యాయాలు సీఎంను కలిసిన తర్వాత ఆయన పార్టీలో అధికారికంగా చేరకుండా పార్టీ సభ్యత్వం తీసుకోకుండా కార్యక్రమాల్లో పాల్గొనటం, అన్ని మండలాల్లో శ్రేణుల్ని కలుస్తున్నారు. ఈ క్రమంలో సహజంగానే అసంతృప్తి నేతగా ఉన్న కన్నబాబు వెళ్లగక్కిన ఆక్రోశం వెలుగులోకి రావటంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర దీనిపై దృష్టి సారించి జరిగిన పరిణామాలను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అలాగే ఆదాలతో బీద సమావేశమయ్యారు. 

మరిన్ని వార్తలు