నారాయణా.. అంతా మీ ఇష్టమేనా?

31 Dec, 2018 09:30 IST|Sakshi

మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాలదే పెత్తనమా?

సీనియర్‌ కార్యకర్తలకు కనీస విలువ లేదా

ఇళ్ల పట్టాల నుంచి అభివృద్ధి పనుల వరకు అన్ని మీకేనా..

నెల్లూరు రూరల్‌ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు

రూరల్‌ టీడీపీ కార్యకర్తలతో కిలారి వెంకటస్వామినాయుడు సమావేశం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు కనీస విలువ లేదా.. ఎవరి మనోభావాలతో మీకు పనిలేదా.. మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇద్దరి మాట మినహా మిగిలిన వారిని కనీసం పట్టించుకోరా’ అంటూ రూరల్‌ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం నగరంలోని కిలారి తిరుపతినాయుడు కల్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రూరల్‌ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామి నాయుడు సమావేశం నిర్వహించారు. సమావేశానికి 130 మంది వరకు సీనియర్‌ టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీనియర్‌ కార్యకర్తలు మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలకు సంబంధం లేకుండా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరులకే అన్ని పనులు, పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు మొదలుకొని అభివృద్ధి పనుల కాంట్రాక్ట్‌ వరకు  ఆదాల అనుచరుడు, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి పార్టీ వ్యక్తులకు కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. 

అలాగే మంత్రి నారాయణకు నియోజకవర్గంలో పట్టుమని 10 మందితో పరిచయాలు ఉండవు. అయితే ఆయన నెల్లూరు రూరల్‌ అభ్యర్థిని నిర్ణయిస్తారు. పనిచేసుకోమని చెబుతారు. ఇలా అయితే పాత వారందరూ పార్టీని వీడిపోవటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల్లో పాతవారికి చోటు దక్కలేదని, నీరు–చెట్టు పనులు కూడా పాతవర్గంలో ఒక్కరికీ ఇవ్వలేదని, మంత్రి నారాయణ అన్నీ అతనికి కావల్సిన వారికి, మాజీ మంత్రి ఆదాల తనకు కావల్సిన వారికే ఇస్తుంటే కార్యకర్తలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటారని ప్రశ్నించారు. 

మా పరిస్థితేంటి?
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ను మంత్రి నారాయణ ప్రకటించడానికి అంతా సిద్ధం చేస్తుంటే మాలాంటి వారి పరిస్థితి ఏంటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కిలారి వెంకటస్వామి నాయుడు మండిపడ్డారు. 135 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. వారిలో ఒక్కరైనా టీడీపీ కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నించారు. పింఛన్లు మొదలుకొని రేషన్‌ డిపోల వరకు ఒక్కదానిలో కూడా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రూరల్‌ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై మొదట తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేస్తామని, అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. అలాగే సభ ముగింపు సమయంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి హాజయ్యారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నేతలు పాముల రమణయ్య, కార్పొరేటర్‌ మన్నెం పెంచలయ్య, నేతలు రామమూర్తి, బద్దేపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్, ఉరందుల సురేంద్రబాబు, జానా గిరిబాబు, ఎస్‌కే ఆసీఫ్, రాఘవప్పనాయుడు, సుబ్బరాజు, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు