టీడీపీలో 'మినీ' వార్‌

3 Jun, 2018 11:08 IST|Sakshi

చీరాలలో గందరగోళంగా ఆ పార్టీ పరిస్థితి

జిల్లాలో ఎక్కడా లేని విధంగా రెండు మినీ మహానాడులు నిర్వహణ

విస్తుపోతున్న పార్టీ క్యాడర్‌

పార్టీ పదవులు దక్కక అసహనంలో ఆమంచి అనుచరులు

చీరాల: నియోజకవర్గ కేంద్రం చీరాలలో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాటగా మారింది. ఒకప్పుడు పార్టీకి బలమైన పునాదులుండగా ప్రస్తుతం చీలికలు.. పేలికలుగా మారింది. ఎమ్మెల్యే ఆమంచి వైపు ఒకవర్గం ఉండగా మాజీమంత్రి పాలేటి రామారావు మరో వర్గాన్ని నడిపిస్తున్నారు. మూడో వర్గానికి ఎమ్మెల్సీ పోతుల సునీత సారధ్యం వహిస్తోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇటీవల చీరాల నియోజకవర్గంలోనే రెండు మినీ మహానాడులు జరిగాయంటే పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

టీడీపీలోకి ఎమ్మెల్యే ఆమంచి చేరిన తర్వాత మున్సిపల్‌ చైర్మన్‌తో పాటు కొందరు మున్సిపల్‌ కౌన్సిలర్లు చేరినప్పటికీ పాలేటి రామారావు వర్గీయులు మాత్రం ఆమంచితో కలవలేదు. ఆమంచి కూడా మొదటి నుంచి వస్తున్న తన సొంత క్యాడర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారే కానీ టీడీపీలో ఉన్న మాజీ నాయకులు, సీనియర్‌ నేతలను తన వర్గంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయలేకపోయారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆమంచి మధ్య వర్గ పోరును కూడా జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలు పరిష్కరించలేకపోయారు. దీంతో చీరాల టీడీపీ మూడు ముక్కలాటగా మారింది.  

పోరు.. హోరు..
చీరాల నియోజకవర్గలో పోటా పోటీ కార్యక్రమాలు జరగడం ఆనవాయితీగా మారింది. ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతి, మినీ మహానాడు వంటి అంశాలే దీనికి ఉదాహరణ. ఈనెల 16వ తేదీన ఎమ్మెల్యే ఆమంచి ఆధ్వర్యంలో మినీ మహానాడును ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్లోని ఓపెన్‌ థియేటర్‌లో మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యేకు పోటీగా మాజీమంత్రి పాలేటీ వర్గీయుడైన ఎంపీపీ గవిని శ్రీనివాస్‌ స్థానిక ఐఎంఏ హాలులో మినీ మహానాడు నిర్వహించారు. అలానే ఎమ్మెల్యే ఇంటింటి తెలుగుదేశం, దళితతేజం కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాల బూత్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. పాలేటి కూడా తమ వర్గీయులతో దళిత తేజం, ఇంటింటి టీడీపీ నిర్వహించి వార్డులు, బూత్‌ కమిటీలను కూడా పోటీగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కమిటీలను, పట్టణంలోని వార్డుల కమిటీలను కూడా పాలేటి నియమించారంటే టీడీపీలో పోరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలను పాలేటి నిర్వహించడం వి«శేషం. 

తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేతలు
పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కౌన్సిలర్లు, సీనియర్‌ క్యాడర్‌ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. మరో 8 నెలల్లో టీడీపీ పాలన పూర్తి కానుంది. దీంతో మళ్లీ అధికారంలోకి వస్తుందో.. రాదో అనే మీమాంసలో నాయకులున్నారు. ఇప్పటి వరకు ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు ఎంపిక జరగకపోవడం, మున్సిపల్‌ కౌన్సిల్‌ పదవీకాలం ముగుస్తున్నా కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక జరగకపోవం గమనార్హం. చివరకు పార్టీ రాష్ట్ర, జిల్లా పదవులతో పాటుగా ఇతర నామమాత్రపు పోస్టులు చీరాల్లో ఎవ్వరికి దక్కకపోవడంతో పార్టీలో తామెందుకు కొనసాగుతాన్నామనే అంతర్మధనం మొదలైంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 9 ఏళ్లు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా ఎలాంటి గుర్తింపు లేకపోవడం, నామినేటెడ్‌ పోస్టులు కల్పించకపోవడంతో తాము అధికారంలో ఉన్నామా....? లేక ప్రతిపక్షంలో ఉన్నామా...? అని పార్టీ సీనియర్‌ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరికొందరైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నారు. 

మరిన్ని వార్తలు