కళా దూకుడుకు కళ్లెం!

11 Oct, 2018 07:32 IST|Sakshi

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఒక దెబ్బకు రెండు పిట్టలు... అన్నట్లు ఒకేసారి రెండు ప్రయోజనాలు ఆశించి టీడీపీలో ఒక వర్గం చేసిన ‘పోస్టర్లు’ యుద్ధం కథ ఇప్పుడు అడ్డం తిరిగింది. ‘స్థానిక నాయకత్వం ముద్దు... వలస నాయకత్వం వద్దు’ అనే నినాదంతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళావెంకటరావు దూకుడుకు అడ్డుకట్ట వేయడం ఒక ఎత్తు అయితే, ఈ నెపాన్ని ప్రత్యర్థి పార్టీ నాయకులపై నెట్టేసి టీడీపీ పట్ల సానుకూల వైఖరి కలిగించాలనేదీ మరో ఎత్తు! ఈ పోస్టర్లు అంటించినవారెవ్వరైనా సరే చర్యలు తీసుకోవాలంటూ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులిచ్చి హడావుడి చేసిందీ టీడీపీ నాయకులే! సీసీ కెమెరాల ఫుటేజీ పుణ్యమాని అసలు విషయం బట్టబయలైంది! అనుమానితులను అదుపులోకి తీసుకున్నా కేసు నమోదుకు తర్జనభర్జన పడటం ఇప్పుడు పోలీసుల వంతు అయ్యింది! 

ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తూ ఇటీవల కాలంలో మంత్రి కిమిడి కళావెంకటరావు కాస్త దూకుడుగానే వెళ్తున్నారు. తద్వారా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ, తన సొంతూరున్న రాజాం నియోజకవర్గంలోనూ పట్టు సాధించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇది సహజంగానే సొంతపార్టీలోని ప్రత్యర్థులకు గుబులురేపింది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌ను పార్టీలోకి తీసుకురావడమే గాక ఏకంగా రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జిగా చేయడంలో కళా పాత్ర ఉందని ప్రతిభాభారతి లోలోన రగిలిపోతున్నారు. 

అమరావతిలో అధినేత చంద్రబాబు ముందు మాత్రం ‘తమ్ముడు (కొండ్రు)తో కలిసి పనిచేసుకుంటాం’ అని ఆమె చెప్పినప్పటికీ నియోజకవర్గంలో ఆమె పట్టు పూర్తిగా తగ్గిపోతోంది. ఇప్పటికే రాజాంలో కళా వర్గం ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్న ఆమె మంత్రి అచ్చెన్న గ్రూపులోకి చేరిపోయారు. కింజరాపు కుటుంబంతో కళా వైరం సుదీర్ఘకాలంగా ఉన్నదే. జడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, ఆమె భర్త టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ వర్గం ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళాకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయంలో గతంలో పలుమార్లు రుజువైంది. ఇటీవల పొన్నాడ పంచాయతీ పరిధిలోని ముద్దాడపేట ఇసుక ర్యాంపు రద్దు అవడానికీ కళాయే కారణమని బాబ్జీ వర్గం గట్టిగా నమ్ముతోంది. మంత్రి అచ్చెన్న మద్దతుతో ర్యాంపు అనుమతులు తెచ్చుకుంటే జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రద్దు చేయించారనే మిసతో అప్పటి నుంచీ కళాపై కారాలుమిరియాలు నూరుతున్నారు. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే పోరు...
కళావెంకటరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నూ ఉన్నారు. ఆయనే లక్ష్యంగా పోస్టర్లు వెలవడం, వాటి వెనుక సొంత పార్టీలోనే కొంతమంది ప్రోత్సాహం ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘స్థానిక నాయకత్వం ముద్దు... వలస నాయకత్వం వద్దు’ అనే నినాదాలతో ముద్రించిన పోస్టర్లు ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గంలో వెలిశాయి. ముఖ్యంగా జాతీయ రహదారి వెంబడి రణస్థలం మండలంలోని కోష్ట, పతివాడిపాలెం, పైడిభీమవరంతో పాటు లావేరు మండలంలోనూ ఇవి గోడలపై కనిపించాయి. వాటితో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగింది.

 దీంతో ఆ పోస్టర్లు అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎచ్చెర్ల, రణస్థలం పోలీసు స్టేషన్లలో ఎచ్చెర్ల ఎంపీపీ బీవీ రమణారెడ్డి, రణస్థలం ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. అసలు ఈ పోస్టర్ల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవ్వరో తెలుసుకోవడానికి కళా వర్గం కూడా క్షేత్రస్థాయిలో ఆరాతీసింది. ఈ వ్యవహారంలో చౌదరి బాబ్జీ అనుచరుల పాత్ర ఉండే ఉంటుందనే సందేహాలు వచ్చాయి. అయితే ఈ నెపాన్ని ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై నెట్టేసేందుకు టీడీపీ నేతలే తప్పుడు ప్రచారాన్నీ ప్రారంభించారు. కానీ ఆ పప్పులు ఉడకలేదు. 

తమ్మినేని సంతోష్‌ పాత్ర...
ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌కు బంధువునంటూ తమ్మినేని సంతోష్‌ అనే వ్యక్తి జిల్లాలోని పలు ఇసుక ర్యాంపులను కొల్లగొడుతున్న సంగతి బహిరంగ రహస్యమే. గుంటూరు మాఫియాతో కలిసి దూసి ర్యాంపులో సుదీర్ఘకాలం ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఇతనిదే కీలక పాత్ర! ఇటీవల వంశధార నదిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన 25 లారీలు, నాలుగు జేసీబీలు అడ్డంగా దొరికిపోయిన వ్యవహారంలోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. నిఘా వర్గాల విచారణలోనూ ఇది రుజువైనట్లు తెలిసింది. అయితే 6వ తేదీన పోస్టర్లు అంటింపు బాధ్యతను సంతోషే తన భుజాలపై వేసుకున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిలకపాలెం టోల్‌గేట్‌తో పాటు జాతీయ రహదారిపైనున్న సీసీ కెమెరాలలో రికార్డయిన ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దాని ఆధారంగా శ్రీకాకుళానికి చెందిన కొంతమంది యువకులను ఎచ్చెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారిని విచారిస్తే సంతోష్‌ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. 

అవినాష్‌తో స్నేహసంబంధాలు
చౌదరి బాబ్జీ కుమారుడు అవినాష్, తోటపాలెం ఎంపీటీసీ సభ్యుడు గురు జగపతిబాబులకు తమ్మినేని సంతోష్‌ స్నేహితుడు. ఈ స్నేహంతోనే అవినాష్, సంతోష్‌ ఇద్దరూ కలిసి గతంలో దూసి ఆర్‌ఎస్‌ వద్ద ర్యాంపు నిర్వహణకు ఏర్పాట్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ‘సాక్షి’ కథనాలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం నిరసనలతో అధికారులు ఆఖరి నిమిషంలో ఆ ర్యాంపును అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్నేహంతోనే సంతోష్‌ ఈ పోస్టర్ల అంటింపు బాధ్యత అప్పగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం సంతోష్‌ పరారీలోనే ఉన్నాడు.

 కేవలం పోస్టర్లు అతికించిన కుర్రాళ్లను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అవినాష్, సంతోష్‌ పేర్లను ఏవిధంగా ఇరికిస్తారంటూ బాబ్జీ వర్గీయుల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై జేఆర్‌ పురం (రణస్థలం) సీఐ వి.రామకృష్ణను సంప్రదించగా... ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇంతవరకూ నిందితులు ఎవ్వరనేదీ నిర్ధారించలేదన్నారు. ఏదిఏమైనా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నున్న కళావెంకటరావుకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించడం, దీనివెనుక సొంత పార్టీ వారి హస్తం ఉండటం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు