ఒకే ఒరలో మూడు కత్తులు!

12 Oct, 2018 06:54 IST|Sakshi

దుర్గం’ టీడీపీలో తారస్థాయికి చేరిన వర్గపోరు 

దీపక్, మెట్టు వర్గాలను అణగదొక్కుతున్న మంత్రి కాలవ 

మంత్రిపై బహిరంగ విమర్శలకు దిగిన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి  

కాలవ ఓటమే లక్ష్యంగా మెట్టు, దీపక్‌ పావులు 

సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాయదుర్గం టీడీపీలో అసమ్మతిపోరు తారస్థాయికి చేరింది. మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మధ్య నెలకొన్న వర్గపోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ‘నున్వా–నేనా’ అంటూ పరస్పరం కత్తులు దూస్తున్నారు. ఓ వైపు మెట్టు.. మరోవైపు దీపక్‌ కాలవ కంట్లో నలుసులా మారారు. దీపక్‌రెడ్డి అసలు టీడీపీ వ్యక్తే కాదు అని మంత్రి కాలవ.. తాను లేకపోతే ఎమ్మెల్యేగా కాలవ గెలిచేవాడే కాదని దీపక్‌రెడ్డి దూషణలకు దిగుతున్నారు. వీరివద్దరి వైఖరితో ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి తిరిగి తెరపైకి వచ్చి కాలవకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో ‘దుర్గం’ టీడీపీలో పార్టీ కేడర్‌ మూడు ముక్కలైంది. 

అనూహ్యంగా దుర్గంపై కాలవ జెండా 
రాయదుర్గం నియోజకవర్గానికి మంత్రి కాలవ శ్రీనివాసులు స్థానికేతరుడు. శింగనమల నియోజకవర్గానికి చెందిన కాలవ 1999లో ఎంపీగా గెలుపొందారు. తర్వాత రెండుసార్లు ఓడిపోయారు. దీంతో గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. చీఫ్‌ విప్‌గా కొనసాగి ఆపై మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ‘దుర్గం’ టీడీపీకి మెట్టు గోవిందరెడ్డి నాయకుడిగా ఉండేవారు. 2009లో కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత టీడీపీ బలహీనపడింది. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. ఆపై జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు రాజీనామాతో 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో దీపక్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అప్పటి నుండి ‘దుర్గం’ టీడీపీ మెట్టు, దీపక్‌రెడ్డి వర్గాలుగా చీలిపోయింది. 2014 ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఇద్దరికీ కాకుండా కాలవ శ్రీనివాసులకు టీడీపీ అధిష్టానం టిక్కెట్టు కేటాయించింది. కాలవ విజయం సాధించారు. 

మెట్టు, దీపక్‌ వర్గాలను పక్కనపెట్టి మంత్రి 
కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గానికి పూర్తి కొత్త కావడంతో మెట్టు, దీపక్‌రెడ్డితో సంబంధం లేకుండా తనకంటూ ఓ వర్గం ఏర్పరుచుకోవాలని భావించారు. టీడీపీలో ఇక వర్గాలు లేవని, కాలవ వర్గం ఒకటే ఉంటుందని, ఎవ్వరి వద్దకు వెళ్లొద్దనే మెసేజ్‌ను కేడర్‌లోకి పంపారు. అయితే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో దీపక్, మెట్టు సహకారంతో గెలిచిన వాళ్లు... వారిని వదులుకునేందుకు అయిష్టత చూపారు. కాలవకు వద్దకూ వెళుతూ పాత నేతలను కూడా కలుస్తూ వచ్చారు. ఇది కాలవకు నచ్చలేదు. దీపక్‌రెడ్డి వద్దకు వెళ్లే నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. కాంట్రాక్టులు, ఇతర విషయాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. డీ. హీరేహాల్‌ ఎంపీపీ పుష్పావతి, ఉస్మాన్, రంగప్పతో పాటు పలువురు నేతలు కాలవ వైఖరిని విభేదించి దీపక్‌ వెంటే నడుస్తూ వచ్చారు.  

దీపక్‌పై అవినీతి ఆరోపణలు 
ఎంతగా ప్రయత్నించినా దీపక్‌రెడ్డి అనుచరులు తనవైపు రాకపోవడంతో.. కాలవ శ్రీనివాసులు పథకం ప్రకారం ముందుకు సాగారు. దీపక్‌రెడ్డి అవినీతి పరుడని అంతర్గతంగా పార్టీ శ్రేణులకు చెబుతూ వచ్చినట్లు తెలుస్తోంది. దీపక్‌రెడ్డిపై బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, దాడి చేశారని సెక్షన్‌ 506, 447, 341 కింద మారణాయుధాలు ఉన్నాయని సెక్షన్‌ 148 కింద మాదాపూర్, హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కాలవ వాదనలకు బలం చేకూరింది. దీంతో దీపక్, కాలవను లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, కాలవ అవినీతిపై బహిరంగంగా మాట్లాడుతూ వచ్చారు.

 గుమ్మఘట్ట జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్‌ పూలనాగరాజు కాలవ వర్గంలో చేరారు. దీంతో దీపక్, మెట్టు ఏకమయ్యారు. పైకి దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరి లక్ష్యం ‘కాలవ’ కావడంతో ఆయనకు వ్యతిరేకంగా తమ వర్గాన్ని బలపరుచుకున్నారు. ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసినా వ్యతిరేకవర్గాన్ని కాలవ తనవైపు తిప్పుకోలేకపోయారు. పార్టీ నిర్వహించిన సర్వేలు కూడా టీడీపీ ఓటమి ఖాయమని వచ్చింది. ఈ పరిస్థితుల్లో దుర్గం నుండి బరిలోకి దిగితే దీపక్, మెట్టు పూర్తిగా సహకరించరని, ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డారు. 

ఏకమైన దీపక్, మెట్టు 
కాలవ చర్యలను గమనించిన దీపక్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014కు ముందు స్థానికసంస్థల ఎన్నికల్లో ఎవరు పార్టీ కోసం పనిచేశారో..? ఎవరి అండతో గెలిచావో గుర్తుంచుకోవాలని మంత్రికి సూచించారు. వైఖరి మారకుంటే కాలవ చిట్టా విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలు వచ్చే ఎన్నికల్లో కాలవకు టిక్కెట్టు దక్కకుండా చేయాలని దీపక్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాలవకు కాకుండా మెట్టు, దీపక్‌రెడ్డిలో ఎవరికి వచ్చినా పరస్పరం సహకరించుకోవాలని అంతర్గతంగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇది కాలవకు పూర్తిగా మింగుడుపడటం లేదు. 

నాలుగేళ్లలో కాలవకు భారీగా లబ్ధి 
కాలవ శ్రీనివాసులు నాలుగేళ్లలో ఆర్థికంగా బాగా లబ్ధిపొందారు. నీరు–చెట్టు, హైవే పనులు, హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ, ఇతర అభివృద్ధి పనుల్లో బాగా లబ్ధిపొందారు. తాజాగా బీటీపీ పనులు కూడా దక్కాయి. ఈ ఒక్క పనిలోనే రూ. 50 కోట్ల దాకా కాలవకు అందుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రూ.దాదాపు వందకోట్లు కాలవ ఖాతాలో జమ అవుతుందని ఆయన వ్యతిరేక వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాలవ గుట్టు విప్పుతా అని దీపక్‌ చేసిన ఆరోపణల వెనుక ఈ అవినీతి తతంగమే ఉంటుందని తెలుస్తోంది. ఏదిఏమైనా పార్టీని మూడు వర్గాలతో అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీ పరిస్థితి మరింత దిగజారిందనేది పరిశీలకు అభిప్రాయం.

గుంతకల్లు వైపు చూసినా.. 
వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం టికెట్‌ను తన అల్లుడు దీపక్‌రెడ్డికి ఇప్పించుకోవాలనే యోచనలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు మెట్టు గోవిందరెడ్డి వర్గం కూడా సహకరించని పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో దుర్గం కాకుండా గుంతకల్లు టిక్కెట్టు దక్కించుకోవాలని పార్టీ పెద్దల ద్వారా మంత్రి కాలవ లాబీయింగ్‌ చేస్తున్నారు. అయితే ఇక్కడ జితేంద్రగౌడ్‌ కాకుండా మాజీ ఎమ్మెల్యే మధూసూదన్‌గుప్తాకు టిక్కెట్టు ఇప్పించాలని జేసీ ప్రయత్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు తెలిసింది. దీంతో తిరిగి ఎంపీగా వెళ్లాలనే యోచన కూడా చేశారు. అదీ కుదరకపోవడంతో తిరిగి ‘దుర్గం’ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందువల్లే అసమ్మతిని అణగదొక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలపై ఎక్కడా దీపక్‌రెడ్డి ఫొటో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. 

మరిన్ని వార్తలు