వెంటాడుతున్న పాపాలు

2 Jul, 2020 08:37 IST|Sakshi

వ్యవసాయ కార్యాలయాల చుట్టూ టీడీపీ నేతల ప్రదక్షిణలు

సబ్సిడీ ట్రాక్టర్ల గోల్‌మాల్‌లో పేర్లు లేకుండా చేసుకునేందుకు తాపత్రయం

కలికిరిలో జన్మభూమి కమిటీ సభ్యుడిపై కేసు నమోదుతో అలెర్టు

టీడీపీ ఎమ్మెల్సీ చర్చోపచర్చలు

చిత్తూరు అగ్రికల్చర్‌: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు దక్కాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లను జిల్లాలోని టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు యథేచ్ఛగా దోచుకున్నారు. దీనిపై గత నెల 16న సాక్షిలో ‘ట్రాక్టర్లు మింగేశారు’ అనే కథనంతో వార్త ప్రచురితమైంది. ఈ కథనంలో ఓ ఎమ్మెల్సీ కూడా రెండు ట్రాక్టర్లను మంజూరు చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై వాస్తవ నివేదిక రూపొందించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కలికిరిలో ట్రాక్టర్‌ను అక్రమంగా మంజూరు చేసుకున్న జన్మభూమి కమిటీ సభ్యుడిపై వ్యవసాయశాఖాధికారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి రానున్నాయి. కాగా టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు బుధవారం జిల్లా వ్యవసాయ కార్యాలయానికి చేరుకొని మంతనాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

ఏకపక్షంగా స్వాహా..
ప్రభుత్వ పథకాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షంగా స్వాహా చేశారు. 2015–16 ఏడాదిలో ఆర్‌కేవీవై కింద జిల్లాలోని రైతు సంఘాలకు 75 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను మంజూరు చేసింది. ఒక రైతు సంఘానికి ఒక యూనిట్‌ కింద ట్రాక్టర్, రోటోవేటర్, విత్తనాలు వేసే మడకలు తదితరాలను మంజూరు చేసింది. ఒక యూనిట్‌ విలువ రూ.8.60 లక్షలకు రాయితీ కింద రూ.6.02 లక్షలు ప్రభుత్వం అందించగా, మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించారు. ఈ విధానం ద్వారా జిల్లాలోని మొత్తం 470 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా రైతురథం పథకం ద్వారా ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షలు సబ్సిడీతో మొత్తం 1,047 ట్రాక్టర్లను మంజూరు చేసింది. వీటిని మంజూరు చేయడంలో జన్మభూమి కమిటీలు కీలకపాత్ర పోషించాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ట్రాక్టర్లను అర్హతతో ప్రామాణికం కాకుండా అక్రమంగా దోచుకున్నారు. ఆర్‌కేవీవై పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతు సంఘాలకు అందాలి్సన ట్రాక్టర్లను టీడీపీ నాయకులే దక్కించుకున్నారు. అదేవిధంగా రైతురథం పథకం కింద కూడా ట్రాక్టర్లను బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారు. 

టీడీపీ నేతపై కేసు నమోదు..
సబ్సిడీ ట్రాక్టర్ల మంజూరులో చోటు చేసుకున్న అక్రమాలపై వ్యవసాయశాఖాధికారుల విచారణలో అసలు రంగు బయటపడింది. ఇందులో భాగంగా కలికిరి మండలం కె.కొత్తపల్లెలోని ఏసుప్రభు రైతుమిత్ర సంçఘానికి అందాలి్స న ట్రాక్టర్‌ను టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు మున్నాఫ్‌ సాహెబ్‌ మంజూరు చేసుకుని, తర్వాత  విక్రయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై గత నెల 22న వ్యవసాయ అధికారిణి హేమలత పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.

టీడీపీ నేతల్లో గుబులు..
గత ప్రభుత్వ హయంలో అక్రమంగా మంజూరు చేసుకున్న ట్రాక్టర్లపై విచారణ ప్రారంభం  కావడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. అప్పట్లో మంజూరైన ట్రాక్టర్లను దాదాపు రైతుల ముసుగులో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేజిక్కించుకున్నారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోనే ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణను ముమ్మరం చేయడంతో ప్రస్తుతం పలువురు టీడీపీ నాయకులు వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నారు. అక్రమంగా దోచుకున్న ట్రాక్టర్ల జాబితాలో తమ పేర్లు లేకుండా చూసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చర్చనీయాంశమైన ఎమ్మెల్సీ రాక..
ట్రాక్టర్ల అక్రమ దోపిడీలో ఓ ఎమ్మెల్సీ ఏకంగా రెండు ట్రాక్టర్లను మంజూరు చేసుకుని క్వారీల్లో, వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకుంటున్నట్లు ‘సాక్షి’లో వార్తాకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన దాదాపు అరగంట పాటు ఉండి పలువురు అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీనే నేరుగా జిల్లా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.   

మరిన్ని వార్తలు