అబద్ధపు హామీలతో మోసగిస్తున్న బాబు

6 Jul, 2018 08:33 IST|Sakshi

మైదుకూరు టౌన్‌ :  రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు విమర్శించారు. గురువారం మైదుకూరులో పాతూరుకు చెందిన కూశెట్టి రాయుడు తన అనుచరులతో కలిసి  వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రజలను ఎలా మోసం చేయాలి.. వారి ఓట్లు ఎలా సంపాదించాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతారన్నారు. అయితే ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. ముఖ్యంగా కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పిన బాబు కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభంను అణగదొక్కే కుట్రకు పాల్పడటం దారుణమన్నామరు. అంతేకాకుండా ముద్రగడ వైఎస్‌ జగన్‌కు మద్దతు పలుకుతున్నారంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. చంద్రబాబుకు కాపులను బీసీలలో చేర్చాలనే చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్లపాటు కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉండికూడా సాధించలేదన్నారు.

కేవలం కాపులను మోసం చేసేందుకే నాడు ఆ మాటలు మాట్లాడాడన్నారు. వైఎస్సార్‌ జిల్లా భవిష్యత్తుకోసం నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉక్కు పరిశ్రమ స్థాపించి జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చూస్తే అప్పట్లో చంద్రబాబు ఆటంకాలు కల్పించారన్నారు. నేడు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో 11 రోజుల పాటు ఉక్కు దీక్ష పేరుతో దొంగదీక్ష.. వంచన దీక్ష చేయించారని ధ్వజమెత్తారు. జిల్లాలో అనేక ప్రాజెక్టు వైఎస్‌ హయాంలోనే చేపట్టారని,  అయితే నేడు అధికార పార్టీ ఆ పనులు ఏమాత్రం చేపట్టకుండా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగం మాట పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మాత్రం రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి ఇచ్చి తన కుటుంబానికి ఓ ఉద్యోగం సంపాదించాడని ఎద్దేవా చేశారు.

అంతేకాకుండా వేలకోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎస్‌. రఘురామిరెడ్డి మాట్లాడుతూ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ టీడీపీ ప్రభుత్వం అన్నారు.  ఆ పార్టీ అధినేత, పార్టీలోని నాయకులు కేవలం ప్రజాధనాన్ని ఎలా లూటీ చేయాలి.. వారికి ఎలాంటి మాయమాటలు చెప్పాలి అని మాత్రమే ఆలోచిస్తారు తప్ప ప్రజల అవసరాలు.. వారి బాగోగులు ఈ ప్రభుత్వానికి పట్టవని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి జ్వాలా నరసింహ శర్మ, శ్రీమన్నారాయణరెడ్డి, లింగన్న, గోశెట్టి లక్షుమయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు