ఆ ముగ్గురు రాష్ట్రాభివృద్ధికి ఆటంకం

2 Feb, 2020 13:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించే సంక్షేమ పథకాలు, పాలన చూసే పెద్ద ఎత్తున పార్టీలోకి చేరుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఉదయం పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి  చేరికలు కొనసాగాయి. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్.. నియోజకవర్గంలోని టీడీపీ మాజీ కార్పొరేటర్లు మంటి కోటేశ్వరరావు, అయితా కిషోర్,మహ్మద్ అబ్దుల్ రఫీ, దేవినేని నెహ్రూ అనుచరులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వృద్ధులకు తాను తోడుగా ఉంటానంటూ.. ఇంటి వద్దకే పింఛన్‌ వచ్చేలా భరోసా ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. చంద్రబాబు చేసే ఉద్యమం చిత్తశుద్ధి లేనిదని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌, కన్నా లక్ష్మీ నారాయణ, చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలుగా మారారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఆ తర్వాత దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ చేపట్టిన అభివృద్ధి పనులు చూసే పార్టీలో చేరుతున్నారన్నారు. దివంగత సీనియర్‌ నాయకుడు దేవినేని రాజశేఖర్‌(నెహ్రు)తో పని చేసిన వారు పార్టీలోకి చేరడం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు