ఆక్రమించి.. ఆపై దౌర్జన్యం

27 Jun, 2018 12:40 IST|Sakshi
నంద్యాల ఆర్‌డీఓ కార్యాలయం వద్ద పురుగు మందు తాగిన వెంకటలక్ష్మి , టీడీపీ నాయకుడి దాడిలో గాయపడిన పాండురంగ, భరత్‌

టీడీపీ నేత భూ ఆక్రమణ   న్యాయం చేయని అధికారులు

ఆర్‌డీఓ కార్యాలయం వద్ద బాధితురాలి ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం

బాధితురాలి కుమారుడు, అల్లుడిపై టీడీపీ నేత దాడి నంద్యాలలో ఘటన

నంద్యాల: అధికారం ఉందన్న అహంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా వారి  భూ దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. విలువైన స్థలం కనిపిస్తే చాలు అది తమదే అన్నట్లుగా కబ్జాలకు దిగుతున్నారు. ఓ పేదరాలి భూమి ఆక్రమణకు గురికావడంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో విసిగి వేజారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం  నంద్యాల ఆర్‌డీఓ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. నంద్యాల మండల పరిధిలోని చాపిరేవుల గ్రామంలో పెద్దరంగయ్య, వెంకటలక్ష్మి దంపతులు  25, 26 సర్వేనెంబర్‌లో ఉన్న 3.20 ఎకరాల పొలాన్ని 1985 నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా వారి వద్ద ఉన్నాయి. ఈ పొలాన్ని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు భూపాల్‌రెడ్డి కబ్జా చేశారు. దీంతో బాధితులు మూడేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ భూమి కర్నూలు, కడప జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో మంచి డిమాండ్‌ ఉంది.  దీంతో వారు దిక్కుతోచక నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు. డీఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించగా.. పొలానికి చెందిన డాక్యుమెంట్‌ తీసుకు రావాలని సూచించారు. అయితే.. సమస్య ఆర్‌డీఓకు వివరిస్తేనే న్యాయం జరుగుతుందని భావించిన బాధితురాలు మంగళవారం ఆర్‌డీఓ కార్యాయానికి చేరుకుంది. అధికారులు ఎంతకు రాకపోవడంతో తనవెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన భూపాల్‌రెడ్డి వైపే అధికారులు,  పోలీసులు మాట్లాడుతున్నారని, తమకు న్యాయం జరగదనే ఉద్దేశంతోనే పురుగు మందు తాగానని బాధితురాలు చెప్పింది. తాను మరణించాకైనా కుటుంబ సభ్యులకైనా పొలం దక్కేలా చూడాలని, తన ఇద్దరు కుమారులు పాండురంగ, స్వాములు అవిటితనంతో బాధపడుతున్నారని, అధికారులు న్యాయం చేయాలని కోరింది. వెంకటలక్ష్మిని అధికారులు, స్థానికులు వెంటనే ఆటోలో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతోంది.

కుమారుడు, అల్లుడిపై దాడి..
బాధితురాలు కుమారుడు పాండురంగ, అల్లుడు భరత్‌ మంగళవారం పొలం వద్దకు వెళ్లగా అక్కడే నీరు–చెట్టు పనులు చేస్తున్న టీడీపీ నాయకుడు భూపాల్‌రెడ్డి వారి అనుచరులతో ఎదురుపడ్డారు. తమ స్థలం ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించినందుకు భూపాల్‌రెడ్డి తన అనుచరులు ఏడుగురితో కలిసి తీవ్రంగా కొట్టారని బాధితులు నంద్యాల తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. 

అధికారం ఉందనే కబ్జాలు చేస్తున్నారు
గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి అధికారం ఉందని మా స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, అర్జీలు ఇచ్చినా ఎవరూ న్యాయం చేయలేదు. అధికార పార్టీ నాయకుడి వైపే అందరూ మాట్లాడుతున్నారు. మాకు న్యాయం జరగదని మా అమ్మ వెంకటలక్ష్మి పురుగు మందు తాగింది. నా తమ్ముళ్లు ఇద్దరూ అవిటివాళ్లు. అధికారులు స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలి.    
లక్ష్మీదేవి, బాధితురాలి కుమార్తె

>
మరిన్ని వార్తలు