ప్రభుత్వ స్థలం కబ్జా

15 Jun, 2020 09:35 IST|Sakshi
టెక్కలిలో అయ్యప్పనగర్, జాతీయ రహదారికి మధ్యలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం

గత ప్రభుత్వ హయాంలోనే 70 సెంట్లు ఆక్రమణ 

హైవేకు ఆనుకుని ఉండటంతో ఇళ్ల నిర్మాణాలు 

ఇటీవల అధికారుల భూ సర్వేలో బయట పడిన బండారం 

టెక్కలి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో రాజకీయ పరపతితో చేసిన భూకబ్జాలు ఇప్పుడిప్పుడే బయట పడుతుండటంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో ఇటువంటి భూ బాగోతం బట్టబయలైంది. దీంతో ఏం చేయాలో తెలియక అన్ని కోణాల్లో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని పక్కాగా కబ్జా చేసిన వ్యవహారం బయట పడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.


అధికారులు హెచ్చరించినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేస్తున్న దృశ్యం  
 

సర్వే నంబర్‌ 477లో పోరంబోకు స్థలం కబ్జా... 
డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో అయ్యప్పనగర్, జాతీయ రహదారికి మధ్యలో సర్వే నంబరు 477లో 70 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఇదే స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో ఆక్రమించేశారు. అప్పట్లో ఓ బడా నేత రాజకీయ పెత్తనానికి భయపడి అధికారులు అటు వైపు దృష్టి సారించలేదు. తాజాగా ఇటీవల సర్వేయర్‌ అధికారులు ఆ ప్రాంతంలో ఈటీఎస్‌ మెషిన్‌తో సర్వే చేశారు. దీంతో పోరంబోకు స్థలం కబ్జాకు గురైందని గుర్తించారు. ఇంతలో కబ్జాదారులు ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై ఆ స్థలాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆయా స్థలంలో కొంత మంది వ్యక్తులు నిర్మాణాలకు తెగబడ్డారు. దీంతో అధికారులు ఆయా నిర్మాణాలను నిలుపుదల చేశారు. అయితే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికంగా గత పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ స్థలంలో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేపడితే స్థలాన్ని రక్షించుకోవచ్చునని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వార్తలు