భూ దందా.!

18 Feb, 2019 12:09 IST|Sakshi
ఉదయగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో టీడీపీ నేతల సందడి(ఫైల్‌)

ఉదయగిరిలో తెలుగు తమ్ముళ్ల ఆక్రమణల జోరు

ఎన్నికల సమయంలో భూపంపిణీ

పచ్చనేతల బినామీల పేర్లతో భూముల పంపకాలు

వారం రోజులుగా రెవెన్యూ  కార్యాలయంలో నేతల హడావుడి

తహసీల్దార్‌కు బంపర్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్న నాయకులు

నాయకులు చెప్పిన పేర్లతోనే భూమిని కేటాయించాలనీ ఎమ్మెల్యే ఆదేశం

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను ఉదయగిరి అధికార పార్టీనేతలు పాటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వ భూములకు అధికార ముద్ర వేయించుకుని బినామీల ద్వారా సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజులుగా ఉదయగిరి తహసీల్దార్‌ కార్యాలయంలోనే టీడీపీ నేతలు తిష్ట వేసి కాజేసిన భూములను
భూ పంపిణీలో పట్టాలు పొందేందుకు పేర్లు నమోదు చేయిస్తున్నారు.

సాక్షి, నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆదేశాలతో పాటు అధికారపార్టీ నేతలు ఇచ్చే తాయిలాలకు ఆశపడిన రెవెన్యూ అధికారులు సైతం నాయకుల బినామీల పేర్లు జాబితాలో నమోదు చేయిస్తున్నారు. ఉదయగిరి ప్రాంతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో పాటు గత కాంగ్రెస్‌ పాలకుల సహకారంతో సాగునీటి వసతి కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయి త్వరలోనే రైతులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి. స్థానిక టీడీపీ నేతలు నాలుగున్నరేళ్లలో  ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జాలకు పాల్పడ్డారు. రెవెన్యూ అధికారులు సహకారంతో అడంగల్‌లో పేర్లు నమోదు చేయించుకుని దర్జాగా ఆక్రమణలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది కబ్జా చేసిన భూములకు అధికార ముద్ర వేయించుకుని సొంతం చేసుకునేందుకు భూపంపిణీ కార్యక్రమాన్ని వాడుకుంటున్నారు. వారం రోజులుగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తిష్టవేసి అధికారపార్టీ నేతలు రెవెన్యూ రికార్డులలో బినామీ పేర్లు నమోదుతోపాటు భూపంపిణీ లబ్ధిదారుల జాబితాలో కూడా ఆ పేర్లు నమోదయ్యేలా చేసుకుంటున్నారు.

అధికారులపై ఎమ్మెల్యే బొల్లినేని ఒత్తిడి
కొండాయపాళెం, గన్నేపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను టీడీపీ నేత మన్నెటి వెంకటరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో  ఆక్రమణలు చేశారు. ఆ నేత భూకబ్జా విషయం గతంలో పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో çస్పందించిన కలెక్టర్‌ టీడీపీ నాయకుడి భూకబ్జాపై నివేదిక కోరారు. ఈ క్రమంలో ఆయా భూములను కూడా భూ పంపిణీ జాబితాలో చేర్పించేందుకు సదరు నేత గత వారం రోజులుగా కుస్తీ పడుతున్నారు. ఆ భూముల కబ్జా విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో  స్థానిక తహసీల్దార్‌ మాత్రం ఆ భూములను భూపంపిణీ జాబితాలో చేర్చేందుకు ససేమిరా అనడంతో రూ.1.5 లక్షల నగదు ఆఫర్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ నేత ఆఫర్‌ను తహసీల్దార్‌ తిరస్కరించడంతో స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ద్వారా రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఎలాగైనా సదరు నేత చెప్పిన భూముల జాబితా భూపంపిణీ లిస్టులో చేర్చమని ఎమ్మెల్యే ఆదేశాలివ్వడంతో రెవెన్యూ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. రెండు రోజులుగా తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారపార్టీనేత కూర్చోని ఎలాగైనా తాము సూచించిన పేర్లు జాబితాలో చేర్చాలంటూ పట్టుబట్టడంతో రెవెన్యూ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.

ఆ భూములు చేర్చేది లేదు
టీడీపీ నేతలు సూచించిన భూములు భూపంపిణీ జాబితాలో చేర్చం. అర్హులైన వారికే భూముల పంపిణీ చేస్తాం. భూపంపిణీ జాబితాలో అనర్హులకు చోటు కల్పించం. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి మాపై లేదు. – శ్రీరామకృష్ణ, తహసీల్దార్, ఉదయగిరి

400 ఎకరాలలో బినామీ పేర్లు
ఉదయగిరి మండలంలో దాదాపు 800 ఎకరాల అనాదీనం, సీజేఎఫ్‌ఎస్‌ భూములను దాదాపు 470 మందికి పంపిణీ చేసేలా భూపంపిణీ జాబితా తయారు చేశారు. అందులో దాదాపు 400 ఎకరాల భూములు స్థానిక టీడీపీ నేతలకు సంబంధించిన బినామీ పేర్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మండలంలోని కొండాయపాళెం, ఆర్లపడియ, గన్నేపల్లి, అప్పసముద్రం, బండగానిపల్లె, పుల్లాయపల్లి, జి.చెరువుపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో భూపంపిణీ కోసం లబ్ధిదారుల జాబితా తయారు చేస్తున్నారు. ఆయా రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను ఆక్రమణ చేసిన నేతలు భూపంపిణీ జాబితాలో తమ బినామీల పేర్లు నమోదు చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.  ఉదయగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్, మండల టీడీపీ అధ్యక్షుడు మన్నేటి వెంకటరెడ్డి సారథ్యంలో ఉదయగిరికి చెందిన మైనార్టీ నేతతోపాటు మండల స్థాయి నేతలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరికొందరు కలిసి సుమారు 400 ఎకరాల భూములు తమకు చెందిన బినామీలవే జాబితాలో చేర్చినట్లు ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు