భూమంతర్‌... ఖాళీ

11 Aug, 2018 14:02 IST|Sakshi

పేట్రేగుతున్న అధికార పార్టీ    నేతలు

ప్రభుత్వ, ప్రైవేటు, పోరంబోకు. ఏ భూమినీ వదలని వైనం

ఖాళీ జాగా కనిపిస్తే చాలు అధికార పార్టీ నాయకులు కబ్జాచేస్తున్నారు. ప్రభుత్వ, అటవీ, బంజరు, చెరువు, ఈనాం ఇలా భూములు ఏవైనా సరే హాంఫట్‌ చేసేస్తున్నారు. పేదల భూములను సైతం హస్తగతం చేసుకుంటున్నారు. ఎకరాలకొద్దీ స్వాధీనం చేసుకుని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. కొందరైతే అటవీ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అడ్డొచ్చిన అధికారులను అడ్డగోలుగా బదిలీ చేయిస్తున్నారు. రికార్డుల్లో ఏమాత్రం లొసుగులు ఉన్నా ప్రైవేటు భూములను సైతం ఆక్రమించేస్తున్నారు. ఇచ్చింది తీసుకుని స్థలం ఖాళీచేయాలంటూ హెచ్చరిస్తున్నారు. మాట వినకుంటే రౌడీమూకలు, పోలీసులను రంగంలోకి దింపి బెదిరిస్తున్నారు. కొత్త రికార్డులను సృష్టించి కోర్టులపాలు చేస్తున్నారు. కేసులు కోర్టుల్లో ఉండగానే ఆ భూములను అడ్డగోలుగా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థాయి ప్రజాప్రజాప్రతినిధుల వరకూ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి భూ రాబందులుగా మారుతున్నారు.

సాక్షి, అమరావతిబ్యూరో: ఈనాం.. పోరంబోకు.. చెరువు భూములైనా, శ్మశాన స్థలమైనా, అటవీ భూములైనా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా భూకబ్జాలకు తెరలేపారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అధికారపార్టీ అండతో ఆక్రమణదారులు పాగావేసినా అధికారులెవరూ అటువైపు చూసిన పాపాన పోలేదంటే జిల్లాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. బాధితులు ఎవరైనా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. పైగా పోలీసు ఉన్నతాధికారులే ఎంతో కొంతకు విక్రయించాలంటూ బాధితులను బెదిరిస్తున్నారు. కుదరకపోతే మధ్యవర్తులుగా మారి రాజీకి యత్నానికి దిగుతున్నారు. దీంతో ఖాళీ స్థలం ఉన్న యాజమానులు హడలిపోతున్న దుస్థితి జిల్లావ్యాప్తంగా నెలకొంది.

అన్ని ప్రాంతాల్లో భూ దందా...
జిల్లాలోని మచిలీపట్నం,  పెడన, కైకలూరు, నందిగామ, పెనమలూరు, జగ్గయ్యపేట, పామర్రు, తిరువూరు, విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్‌ తదితర నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల కబ్జాల పర్వం కొనసాగుతోంది.  అధికార అండతో స్థానిక నాయకులు భూ కబ్జాలకు బరితెగించారు. ప్రభుత్వ భూములుకానీ, పేదలకు పంచిన భూములుకానీ దేనిని వదలడం లేదు. ఖాళీగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్థలం జోలికి  ఎవరు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. తరువాత నకిలీ పత్రాలతో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. విజయవాడ నగర శివారైన గొల్లపూడిలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త శంకర్‌యాదవ్‌కు చెందిన 873 చదరపు గజాల స్థలాన్ని స్థానిక గ్రామ సర్పంచ్, టీడీపీ నేత చిరుగుపాటి నాగరాజు ఆక్రమించాడు. రూ. 4 కోట్ల విలువైన ఆ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు చూపించి ఇది తనదే అనడంతో అసలైన యజమాని అవాక్కయ్యారు. పాయకాపురం లక్ష్మీనగర్‌లోనూ తప్పుడు వీలునామా సృష్టించి రూ. 10 కోట్లపైనే విలువచేసే భూమిని టీడీపీ కార్పొరేటర్‌ నందెపు జగదీష్‌ కబ్జా చేశాడు. కంచికకచర్లలోని కంచలమ్మ చెరువు స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నేతలు ఆ భూమిని లక్షల రూపాయలకు విక్రయించేశారు.

పెడన పట్టణంలో టీడీపీ నాయకుడు పురపాలక సంఘానికి చెందిన 18 సెంట్లు ఆక్రమించి అనధికార లేఅవుట్‌ వేశాడు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని మొగల్రాజపురం బాపనయ్యవీధి చివరకొండ అంచున కొండపోరం బోకు స్థలాలను సైతం స్థానిక అధికార పార్టీ అక్రమార్కులు ఆక్రమించి విక్రయించుకున్నారు. తిరువూరు మండలంలోని ఆంజనేయపురం, చిట్టేల, కాకర్ల, చౌటపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ రిజర్వే అటవీ భూమి సుమారు 200 ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారు. మచిలీపట్నంలో సైతం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో చెరువు కబ్జా చేసి ప్లాట్లుగా వేసి విక్రయించుకున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకటనరసింహాపురంలో సామాజిక ప్లాట్లను స్థానిక టీడీపీ నేత కబ్జా చేశాడు. 2.96 ఎకరాలు స్వాహా చేశారు. కలిదిండి మండలం భాస్కరరావుపేట శివారు పొలి మేర వద్ద 3.50 ఎకరాల పోరంబోకు భూమి విలువ రూ.2 కోట్లకుపైగానే ధర ఉంటుంది. ఈ భూమిని స్థానిక టీడీపీ నేతలు ఆక్రమించారు.   ఇలా జిల్లాలో టీడీపీ నేతల కబ్జా పర్వానికి అంతేలేకుండా పోయింది. కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది.

మరిన్ని వార్తలు