నోటి మాట... దోపిడీ బాట

16 Oct, 2018 08:41 IST|Sakshi

జిల్లాలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు

అక్రమాలకు రాచబాట వేస్తున్న అధికారులు

లిఖితపూర్వక అనుమతుల్లేకుండా ఇసుక ర్యాంపులు ఏర్పాటు 

కుమ్మక్కై దోచుకుంటున్న వైనం 

అధికారుల సమక్షంలో తవ్వకాలు 

తెరవెనక అధికార పార్టీ నేతలు 

ఆ మధ్య  సఖినేటిపల్లి బాడిరేవులో అనధికారికంగా ఇసుక ర్యాంపును ప్రారంభించారు. యూనిట్‌ ఇసుకను రూ.1500 నుంచి 2వేల వరకు విక్రయించారు. రోజుకు 200 నుంచి 300 ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తరలించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీస్తే కలెక్టర్‌ మౌఖిక ఆదేశాలతో ర్యాంపు నడుపుతున్నట్టు రెవెన్యూ అధికారులు  సెలవిచ్చారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇసుక అక్రమాలకు అధికా రులే తెరలేపుతున్నారా? అడ్డగోలు సంపాదనకు అధికారులే రాచబాట వేస్తున్నారా? ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌ ప్రకారం అధికారులు నడుచుకుంటున్నారా? తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారా? మౌఖికం పేరుతో ఇసుకను అడ్డగోలుగా తరలించేస్తున్నారా? జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. జిల్లాలో అనేక చోట్ల అనధికారికంగా గోదావరిని గుల్ల చేసేస్తున్నా రు. కలెక్టర్, సబ్‌ కలెక్టర్, ఆర్డీఓ మౌఖిక ఆదేశాలని చెప్పి ఇసుకను మింగేస్తున్నారన్న విమర్శలున్నాయి. సఖినేటిపల్లి బాడుగ, బోడసకుర్రు, వెదుళ్లపల్లి...ఇలా ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమాలు జరిగిపోతున్నాయి. నేతలు సూ త్రధారులుగా, అధికారులు పాత్రధారులై ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. అభివృద్ధి పనులకు, గృహ అవసరాలకోసమని ఇసుకను తోడేస్తున్నారు.

 నిజంగా అవసరమైతే పర్యావరణ ఇబ్బందుల్లేని చోట అధికారిక ఉత్తర్వులతో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయాలి. కానీ, అవసరాల ముసుగులో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చడం కోసం మౌఖిక ఆదేశాల పేరుతో ఇష్టారీతిన ర్యాంపులు నడుపుతున్నారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఇప్పుడు మౌఖిక ఆదేశాల ట్రెండ్‌ నడుస్తోంది. అనుమతుల్లేకుండా అడ్డగోలు తవ్వకాలు జరపడం చూశాం... ఒకచోట అనుమతులు తీసుకుని మరోచోట తవ్వకాలు జరపడం విన్నాం... నిర్దేశిత విస్తీర్ణంతో అనుమతి తీసుకుని అంతకుమించిన విస్తీర్ణంలో తవ్వకాలు జరిపిన దాఖలాలున్నాయి. కానీ, మౌఖిక ఆదేశాలని ఎటువంటి ఉత్తర్వుల్లేకుండా అధికారులే అక్రమ తవ్వకాలకు తెరలేపడం విచిత్రంగా ఉంది. ఉచితమని చెప్పి అధికారుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇష్టమొచ్చిన రేటుకు ఇసుక విక్రయించి జేబులను నింపుకుంటున్నారు.

 ఇటీవల అల్లవరం మండలం బోడసకుర్రు వద్ద వైనతేయ నదిపై ఉన్న వంతెన పక్కనే ఇసుక దందాకు పాల్పడ్డారు. మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును ఈ దందాపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎట్టకేలకు అధికారులు  స్పందించి మూడు రోజుల కిందట ఈ అనధికార ర్యాంప్‌ మూసవేశారు. సీసీ రోడ్లు, గృహ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరిట కలెక్టర్‌ అనుమతి ఇచ్చారంటూ ఈ ఇసుక తవ్వకాలకు తెరదీశారు. కలెక్టర్‌ ఉత్తర్వులు, ఆదేశాలు అని చెప్పి ఆర్డీవో ద్వారా అల్లవరం ఎమ్మార్వో ఈ తవ్వకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. దీనిపై కలెక్టర్‌ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారని ‘సాక్షి’  తహసీల్దార్‌ను వివరణ కోరినప్పుడు లిఖిత పూర్వకంగా ఇవ్వలేదని.., మౌఖికంగా ఆదేశించారని  చెప్పుకొచ్చారు. దీంతో  ఇసుక అక్రమ దందాకు అధికార టీపీపీ నేతల హస్తం ఉందన్న వాస్తవం వెలుగు చూసింది.

ఇక, సఖినేటిపల్లి బాడవ వద్ద అనధికారికంగా జరిగిన తవ్వకాలపై  వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనకు దిగితే కలెక్టర్‌ మౌఖిక ఆదేశాలతో ర్యాంపునకు అనుమతి ఇచ్చామని సమర్థించుకున్నారు.  లిఖితపూర్వకంగా రాసివ్వండని రెవెన్యూ అధికారులను అడిగితే ససేమిరా అన్నారు. తాజాగా వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు విషయంలో కూడా దాదాపు అదే సమాధానం వచ్చింది. అనుమతుల్లేవని విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించగా తహసీల్దార్‌ చంద్రశేఖరరావు మాట్లాడుతూ సబ్‌ కలెక్టర్‌ ఆదేశాలతో ర్యాంపును నిర్వహించామని చెప్పుకొచ్చారు. మొత్తానికి విజిలెన్స్‌ అధికారుల ఆదేశాలతో ర్యాంపును మూసివేయగా, విషయాన్ని  జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి జిల్లాలో మౌఖిక ఆదేశాల ముసుగులో ఇసుకను ఏకంగా తోడేస్తున్నారని రుజువైంది.
 

మరిన్ని వార్తలు