ఎవరు నరరూప రాక్షసులు?

18 Aug, 2014 12:41 IST|Sakshi
ఎవరు నరరూప రాక్షసులు?

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మందిని దారుణంగా హతమార్చి, మరో 119 మంది మీద పాశవిక దాడులకు పాల్పడిన అంశాన్ని ప్రస్తావించేసరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎక్కడ లేని గుబులు పుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఈ అంశం మీద వాయిదా తీర్మానం ఇచ్చారు. దీంతో పెను దుమారమే రేగింది. కృష్ణాజిల్లాలో కేవలం టీడీపీకి ఓటేయలేదన్న దుగ్ధతో ఒక గ్రామ ఉపసర్పంచిని అత్యంత పాశవికంగా ఇంటినుంచి బయటకు లాక్కొచ్చి మరీ చంపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు, ఇలాగే దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల వాళ్లు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా చూశారు.

ఇదే విషయాన్ని ఆయన అసెంబ్లీలో వాయిదా తీర్మానం రూపంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద ఆయన వాయిదా తీర్మానం ఇచ్చారు. విషయం అత్యంత సున్నితమైనది కాబట్టి, ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దుచేసి దాని స్థానంలో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అది కుదరదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసనకు దిగారు. అప్పుడు సభ వాయిదా పడింది.

సరిగ్గా ఈ సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాలువ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు వైఎస్ కుటుంబంపై విషం కక్కారు. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగి, కోర్టు తీర్పులు కూడా వచ్చేసిన పరిటాల రవీంద్ర హత్య కేసును ప్రస్తావించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణలు గుప్పించారు. ఆయన తండ్రి, తాత.. అందరూ నేరచరితులేనని, నరరూప రాక్షసులని అన్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. పరిటాల రవీంద్ర హత్య కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మీద కూడా సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు అప్పట్లో డిమాండ్ చేయగా, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాంటి పక్షపాతం లేకుండా సీబీఐ విచారణ జరిపించారు. వారు ముగ్గురినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయినా ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని తెలుగుదేశం నాయకులు కేవలం ఎదురుదాడి చేయడం కోసమే అన్నట్లుగా విమర్శలు చేయడం వారి నీచత్వాన్ని చూపిస్తోందని నాయకులు, రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. వైశ్రాయ్ హోటల్ కుట్రతో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేసి, ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా దించేసి, మనస్తాపంతో మరణించడానికి కారకులైన టీడీపీ నాయకులే అసలైన నరరూప రాక్షసులని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు