నామినేషన్ల స్వీకరణపై వివాదం

14 Mar, 2020 12:23 IST|Sakshi
ఆర్‌ఓ ఉమాదేవిని వివరణ కోరుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

సమయం దాటిన తరువాత నామినేషన్లు

అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్‌ సీపీ నాయకులు

వాటిని తిరస్కరిస్తామని ఆర్‌ఓ వెల్లడి

మచిలీపట్నం:  మచిలీపట్నంలోని భాస్కరపురంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ స్వీకరణ కేంద్రంలో శుక్రవారం వివాదం చోటుచేసుకుంది. సమ యం దాటిన తరువాత కూడా నామినేషన్‌ పత్రాలను అభ్యర్థుల నుంచి తీసుకోవటంపై వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భాస్కర పురం పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నగర పాలక సంస్థ పరిధిలో 10,11,12 డివిజన్లుకు సంబంధించిన అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఆఖరి రోజు కావటంతో నామినేషన్‌ పత్రాలు దాఖలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు కేంద్రానికి వచ్చారు.  మధ్యా హ్నం 3 గంటలు వరకు వచ్చిన నామినేషన్లు మా త్రమే పరిగణలోకి తీసుకోవాలి. అయితే భాస్కర పురంలో కేంద్రంలో 3 గంటల తరువాత కూడా నామినేషన్లు తీసుకున్నారనే సమాచారం తెలుసుకున్న మున్సిపల్‌ కౌన్సిల్‌ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ  పట్టణ అధ్యక్షులు షేక్‌ సలార్‌దాదా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ షేక్‌ అచ్చెబా, నగర పాలక సంస్థ కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు కేంద్రానికి చేరుకొని, దీనిపై కేంద్రం రిటర్నింగ్‌ అధికారిని వివరణ కోరారు.

విషయం తెలుసుకున్న మచిలీపట్నం ఎస్‌ఐ రాజేష్‌ తమ సిబ్బందికి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేంద్రంలోకి ఎవ్వరనీ వెళ్లనీయకుండా బయటనే ఉంచారు. అయితే 3 గంటల తరువాత 11వ డివిజన్‌కు దేవబత్తిని నిర్మల, 12వ డివిజన్‌లో చిన్నం రజని, కాకి సునీత నామినేషన్లు అందాయని కేంద్రం రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ఉమాదేవి తెలిపారు.  నిబంధనల మేరకు వ్యవహరిస్తామని,  సమయం మించిన తరువాత ఆ ముగ్గురు అభ్యర్థుల «నామినేషన్‌ పత్రాలు వచ్చినందున వాటిని తిరస్కరిస్తామని వెల్లడించారు. అయితే ఇదే విషయాన్ని తమకు ధృవీకరించి ఇవ్వాలని నాయకులు పట్టుబట్టారు. చివరిలో వచ్చిన చాలా నామినేషన్‌ పత్రాల్లో సరైన పత్రాలు సమర్పించలేదనే అనుమానాలు మాకు ఉన్నాయని, వీటిని నివృత్తి చేయాలని షేక్‌ సలార్‌ దాదా కోరారు. ఈ విషయాన్ని నగర పాలక సంస్థ కమిషనర్‌ దృష్టికి అక్కడ నుంచే ఫోన్‌ద్వారా తెలియజేశారు. ఆర్‌ఓ సిఫార్స్‌ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని, నామినేషన్‌ పత్రాలు సవ్యంగా జతచేయని అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలనలో తొలగిస్తామని చెప్పారు. దీంతో అక్కడి నుంచి నాయకులు వెళ్లిపోయారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ  నాయకులు గూడవల్లి నాగరాజు, థామస్‌ నోబుల్, అస్గర్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు