మా సీటు.. యమ స్వీటు.. 

30 Jul, 2019 09:38 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ‘చింత చచ్చినా పులుపు చావలేద’న్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన నామినేటెడ్‌ పదవులను ఏ స్థాయి నాయకుడైనా అనుభవించడం సర్వసాధారణం. కానీ అధికారం కోల్పోయినప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులను వదులుకోవడం ఒక సంప్రదాయం. ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులైనా ఎప్పుడైనా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇటువంటి సంప్రదాయాలు, నైతిక విలువలపై నమ్మకం లేకనో, లెక్కలేనితనమో తెలియదు కానీ.. కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం  పదవులను పట్టుకుని వేలాడుతున్నారు. పదవీ కాంక్షతో వాటిని వదల్లేక ఇంకా ఆ సీట్లను అంటిపెట్టుకునే ఉన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలే కావొచ్చు, ఆలయాల పాలకమండళ్లే కావచ్చు.. ఇలా టీడీపీ హయాంలో పలు నామినేటెడ్‌ పదవులు పొందిన ఆ పార్టీ నేతలు ఇంకా అక్కడే తిష్ట వేశారు.

మార్కెట్‌ కమిటీల్లో..
జిల్లాలో 20 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. ఒక్కో మార్కెట్‌ కమిటీకి చైర్మన్‌తో పాటు 18 మంది డైరెక్టర్లు ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఈ పదవుల్లో కొనసాగిన కొంతమంది.. ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిన తరువాత నైతిక బాధ్యతగా చైర్మన్‌గిరీల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోగా, మరికొందరు గడువు ముగియడంతో రాజీనామాలు చేశారు. కొంతమంది మాత్రం ఇంకా చైర్మన్‌ పీఠాలను విడిచిపెట్టడం లేదు. ఆగస్ట్‌ ఆరో తేదీ వరకూ పదవీ కాలం ఉందన్న పేరుతో కొత్తపేట ఏఎంసీ చైర్మన్‌ వేగేశ్న చంద్రరాజు రాజీనామా చేయలేదు. టీడీపీ అధికారం కోల్పోయినా ఆయన ఇంకా చైర్మన్‌గిరీని విడిచిపెట్టకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆక్షేపిస్తున్నారు.

అల్లవరం ఏఎంసీ చైర్మన్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఈ కమిటీకి మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సిఫారసుతో ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి (సూరిబాబు)ని నియమించారు. పార్టీ అధికారం కోల్పోయిందనే విషయం తెలియదో ఏమో కానీ సూరిబాబు మాత్రం ఇంకా చైర్మన్‌ పీఠాన్ని వదలలేకపోతున్నారు. అనపర్తి కమిటీ చైర్మన్‌ పాలిక శ్రీను తీరూ ఇలాగే ఉంది. ఇక్కడ నిన్నమొన్నటి వరకూ ఎమ్మెల్యేగా పని చేసి ఘోర ఓటమి చవిచూసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పే వరకూ రాజీనామా చేయరా ఏమిటని ఆయనను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు లేకపోవడమంటే ఇదేనంటూ వారి తీరును విమర్శిస్తున్నారు.

అంబాజీపేట, రామచంద్రపురం మార్కెట్‌ కమిటీల చైర్మన్లు మద్దాల సుబ్బారావు, కొమరిన వీర్రాజు కూడా ఇందుకు తీసిపోరనే చెప్పవచ్చు. నైతిక విలువల గురించి వేదికలపై ఉపన్యాసాలు చెప్పే వీరికి ఆ విలువలు వర్తించవా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఈ నెల 24తో ముగిసింది. చైర్మన్‌ తనకాల నాగేశ్వరరావు గడువు ముగిసినా రాజీనామా మాత్రం చేయలేదు. సత్కారం కూడా అందుకున్నా పదవిపై మాత్రం ఆయనకు వ్యామోహం పోవడం లేదు. చైర్మన్ల దారి ఒకటైతే డైరెక్టర్ల దారి మరొకటి ఎలా అవుతుంది? ఒక్కో మార్కెట్‌ కమిటీలో చైర్మన్‌ కాకుండా ఉన్న 18 మంది డైరెక్టర్లు కూడా రాజీనామా చేయకుండా పదవులను అంటిపెట్టుకునే కొనసాగుతున్నారు.

దేవదాయ శాఖలో..
దేవదాయ శాఖలో కూడా ఇలా చైర్మన్‌ పదవులు వదిలిపెట్టని వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగానే ఉంది. ఎన్నికల ముందు హడావుడిగా అప్పగించిన పదవులను ఇంత తక్కువ కాలంలో వారు వదులుకోలేకపోతున్నారు. రాజమహేంద్రవరం హితకారిణి సమాజం చైర్మన్‌ డాక్టర్‌ ప్రదీప్‌ సుకుమార్, జీవకారుణ్య సంఘ చైర్మన్‌గా కొనసాగుతున్న టీడీపీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీను, ఉమాకోటిలింగేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ అరిగెల బాబూ రాజేంద్రప్రసాద్, ఆర్యాపురం సత్యనారాయణస్వామి దేవాలయం చైర్మన్‌ మళ్ల వెంకట్రాజు, ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌ మజ్జి రాంబాబు, చందా సత్రం యున్నమూరి ప్రదీప్, పందిరి మహదేవుడి సత్రం చైర్మన్‌ రెడ్డి మణి కూడా తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. తామేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టుగా పాలక మండలి సభ్యులు కూడా రాజీనామాలకు ససేమిరా అంటున్నారు.

అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ కర్రి రామస్వామి (దత్తుడు), మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ దంతులూరి ప్రసాదవర్మ, తలుపులమ్మ దేవస్థానం చైర్మన్‌ గాడి రాజబాబు, కాకినాడ జగన్నాథపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ సూర్యారావు, కోటిపల్లి సోమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ పప్పుల మసేను వెంకన్న.. ఇలా చాలామంది టీడీపీ నేతలు చైర్మన్‌ పీఠాలను విడిచిపెట్టకుండా వేలాడుతున్నారు.నామినేటెడ్‌ పదవులను రద్దు చేస్తూ జీవో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనా తెలుగు తమ్ముళ్లు మాత్రం పదవులపై మమకారంతో విడిచిపెట్టలేకపోతున్నారు. పార్టీ అధికారం కోల్పోవడం, గడువు ముగిసిపోవడం వంటి కారణాలతో పదవులకు రాజీనామా చేసిన ఆలమూరు, తాళ్లరేవు, రాజోలు, ముమ్మిడివరం, పెద్దాపురం, సామర్లకోట వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లకు ఉన్న నైతికత ఇతర నేతలకు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు