టీడీపీలో ‘నామినేటెడ్‌’ లొల్లి

8 Jul, 2018 07:36 IST|Sakshi

పదవులు దక్కడం లేదని అధికార పార్టీలో అసంతృప్తి సెగలు

నాలుగేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయని ఆగ్రహం 

పదవులన్నీ ముఖ్యనేతల సన్నిహితులకేనా? 

పార్టీ జెండా మోస్తున్నా గుర్తింపు ఏది? 

పోస్టులకు రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు

సాక్షి, అమరావతి : నామినేటెడ్‌ çపదవుల పంపకం తీరుపై అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పైస్థాయిలో ముఖ్య నాయకులకు పదవులు కట్టబెడుతూ తమను మాత్రం పట్టించుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాను మోస్తున్న తమను టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదని, ఎదురుచూపులతోనే నాలుగేళ్ల కాలం గడచిపోయిందని వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వ పదవీ కాలం ఇంకా సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కింది స్థాయి నాయకులు కోరుతున్నారు. నామినేటెడ్‌ పదవుల కేటాయింపు కోసం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ దారుణంగా వ్యవహరిస్తోందని, పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడుతున్న తమను చిన్నచూపు చూస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవుల కేటాయింపును పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. 

సిఫార్సులున్నా పోస్టులు కష్టమే  
నామినేటెడ్‌ పదవులు కావాలంటే దరఖాస్తులు పెట్టుకోవాలని టీడీపీ అధిష్టానం కిందిస్థాయి నాయకులకు సూచించింది. దీంతో వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ పదవికైనా స్థానిక ఎమ్మెల్యే లేదా అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి సిఫార్సు లేఖ ఇవ్వాల్సిందే.జిల్లాలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలను కూడా తీసుకురావాలంటున్నారు. వారిలో ఎవరైనా లేఖ ఇవ్వకపోయినా, ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేసినా సదరు ఆశావహుడిని పక్కన పెట్టేస్తున్నారు. నానా తిప్పలు పడి అందరి లేఖలను సంపాదించినా పదవులు వస్తాయన్న నమ్మకం లేకుండా పోయిందని నాయకులు నిరాశకు లోనవుతున్నారు. 

ప్రతి పదవికీ రేటు 
ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ ౖచైర్మన్లు, దేవాలయాల పాలక మండళ్ల చైర్మన్‌ పోస్టులను గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలతో భర్తీ చేశారు. పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, దీపక్‌రెడ్డి, బీటెక్‌ రవి, వాకాటి నారాయణరెడ్డి, ఇతర పార్టీల నుంచి వచ్చిన జూపూడి ప్రభాకర్, డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టులను వర్ల రామయ్య, జేఆర్‌ పుష్పరాజ్, చల్లా రామకృష్ణారెడ్డికి కట్టబెట్టారు. కార్పొరేషన్లు, ఆలయ పాలకవర్గాల్లో డైరెక్టర్లు, సభ్యులుగా కిందిస్థాయిలో ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారిని నియమించారు. మార్కెట్‌ యార్డుల ఛైర్మన్, డైరెక్టర్‌ పదవులను ఎమ్మెల్యేల ఇష్ట్రపకారం భర్తీ చేశారు.

నామినేటెడ్‌ పదవులను ముఖ్య నాయకులకు సన్నిహితులైన వారికే కట్టబెట్టారని, తమను కనీసం పరిగణనలోకి తీసుకోలేదని కింది స్థాయి నాయకులు మండిపడుతున్నారు. గతంలో వెనుకబడిన తరగతుల(బీసీ)కు ఎక్కువ పదవులు లభించేవని, ప్రస్తుతం ఒకే సామాజికవర్గానికి పదవులన్నీ అప్పగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి పదవికీ ఒక ధర నిర్ణయించారని, పార్టీ కార్యాలయంలో ఆ మేరకు డబ్బులు చెల్లించినవారికే నామినేటెడ్‌ పోస్టులు దక్కుతున్నాయని నాయకులు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు