టీడీపీ నేతలు.. సాగించిన భూ దందా

12 Aug, 2019 11:14 IST|Sakshi
కబ్జాకు గురైన భూమి

బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి విలువ కోట్లలో..

రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు మాయం

గత ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌ చేసేందుకు టీడీపీ నేత యత్నం

సాక్షి, మార్టూరు: గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు సాగించిన భూ దందా అంతా ఇంతా కాదు. అధికారులను బెదిరించి, భయపెట్టి విలువైన ఎన్నో ప్రభుత్వ భూములను తమ హస్తగతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మార్టూరు జాతీయ రహదారికి పక్కన ఉన్న కూరగాయల మార్కెట్‌కు పోలీస్‌స్టేషన్‌కు మధ్యన సర్వే నంబర్‌ 640ఏలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా కోటి రూపాయల పైనే ఉంటుంది. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ భూమి ఒకటిన్నర దశాబ్దాలుగా నిరుపయోగంగా పడి ఉంది.

టీడీపీ నేత కన్ను..
ఈ భూమి తనదంటూ స్థానిక టీడీపీ నేత ఒకరు అధికారులు భూమి వైపు రాకుండా నయానో, భయానో ఒప్పించి ఇప్పటి వరకు అడ్డుకుంటూ వచ్చాడు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఈ భూమిని తమ కుటుంబం పేర రికార్డుల్లో ఎక్కించి ఆన్‌లైన్‌ చేసుకోవడం కోసం అప్పటి ప్రజాప్రతినిధి అండదండలతో తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే సదరు నాయకుడు ఈ భూమిని కబ్జా చేయడం నచ్చని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు రెవెన్యూ అధికారులపై పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడంతో తమకు ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ అధికారులు సహకరించలేదు. ప్రభుత్వం 2 ఎకరాలభూమిని ఎవరికైనా ఇవ్వాలంటే మిలటరీ పదవీ విరమణ చేసిన వారో, ఎస్సీ, ఎస్టీ కేటగిరికి చెంది భూమి లేని పేదలో అయి ఉండాలి. కానీ అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి 2 ఎకరాల విలువైన భూమి తనదంటూ చెబుతుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూడటం అనుమానాలకు తావిస్తోంది.

రెవెన్యూ అధికారుల పాత్ర పై అనుమానాలు..
ఎన్నికల ముందు బదిలీపై వెళ్లిన ఓ తహసీల్దార్‌ తన ఆరు నెలల హయాంలో ఇష్టారీతిన కొందరికి పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే సర్టిఫికెట్లపై సంతకాలు మాత్రం 2007లో ఇక్కడ విధులు నిర్వహించిన అప్పటి తహసీల్దార్‌ నాగేంద్రమ్మ పేరుతో ఉండటం గమనార్హాం. ఈ క్రమంలో ఈ 2 ఎకరాల భూమికి పూర్వపు తహసీల్దార్‌ నాగేంద్రమ్మ సంతకంతో కూడిన పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇప్పుడు వెలుగులోనికి రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ నెల 5 వతేదీ స్థానిక ప్రజాసంఘాల నాయకులు ప్రస్తుత తహసీల్దారు నాగమల్లేశ్వరరావుతో సమస్య గురించి ప్రస్తావించి ఆ భూమి పూర్వపరాలు పరిశీలించి పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. తాను ఎన్నికల నేపథ్యంలో వచ్చానని త్వరలో బదిలీపై వెళుతున్నందున ఈ భూమి వివరాలు తనకు తెలియవని తహసీల్దారు అన్నట్లు సమాచారం. దీనిపై తహశీల్దార్‌ ఆర్‌ నాగమల్లేశ్వరరావును వివరణ కోరగా.. 640 ఏ సర్వే నంబర్‌ భూమిపై ప్రజాసంఘాల నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. నేను కొత్తగా రావడంతో పూర్తి వివరాలు తెలియవని, రికార్డులు పరిశీలించి పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు