దళితుల మనోభావాలకు సమాధి..!

2 Nov, 2017 08:38 IST|Sakshi
శ్మశానాన్ని ఆక్రమించి వేస్తున్న రోడ్డు

సీఎం కోసం దళితుల సమాధుల తొలగింపు

శ్మశానాన్ని పూడ్చి రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం

పాత రోడ్డును టీడీపీ నాయకుడికి పట్టా చేసిన వైనం

మనోభావాలను పట్టించుకోని అధికారులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న దళితులు

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఓ గ్రామంలోని దళితులకు తీరని మనోవేదనను మిగుల్చుతోంది. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉన్న రోడ్డును అధికార పార్టీకి చెందిన నేతకు పట్టాగా రాసి ఇచ్చారు. సీఎం రాక కోసం రాత్రికి రాత్రే శ్మశానాన్ని ఆక్రమించి, శవాలను సైతం పెకలించి తారురోడ్డు వేస్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్న దళితులు ఈ నెల 4న సీఎం పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

తిరుపతి రూరల్‌:  తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పంచాయతీలో పట్టణ నిరుపేదల హౌసింగ్‌ పథకం కింద దాదాపు 1,724 ప్లాట్లను జీ+3 పద్ధతిలో నిర్మించారు. వీటిని ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనికి సర్వే నెం.363లోనే రోడ్డును చూపించారు. ఈ ప్లాట్లకే కాకుండా దళితుల పొలాలకు, పైన ఉన్న దాదాపు 50 ఎకరాల్లో వేసిన 10 వెంచర్లకు సైతం ఈ రోడ్డునే చూపించారు. మట్టిగా ఉన్న ఈ రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు పంచాయతీరాజ్‌ అధికారులు మంగళవారం ప్రయత్నించారు. అయితే ఈ రోడ్డును తిరుపతికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పట్టాగా మార్చుకున్నాడు. తమ పట్టా భూమిలో రోడ్డు ఎలా వేస్తారని అడ్డుకున్నారు. అందేంటి.. 60 ఏళ్లకు ముందు నుంచే రోడ్డుగా ఉంటే పట్టాగా ఎప్పుడు మార్చారు.. అంటూ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అధికార పార్టీ నేతలు హైదరాబాదు స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు వెనకడుగు వేసినట్లు సమాచారం.

దళితుల శ్మశానం ఆక్రమణ...
ఈ రోడ్డుకు అనుకునే సర్వే నెం.360లో దాదాపు 25 సెంట్లలో తనపల్లి దళితవాడకు శ్మశానం ఉంది. దాదాపు 100 ఏళ్లకు పైనుంచే ఎవరైనా చనిపోతే ఇక్కడే ఖననం చేసేవారు. పాత రోడ్డు స్థలానికి సంబంధించి టీడీపీ నాయకుడికి పట్టా ఉందని చెప్పడంతో, దళితుల శ్మశానం నుంచి రోడ్డు వేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దానిని తనపల్లి దళితులు అడ్డుకున్నారు. పోలీసులతో బెదిరించి, వారిని పక్కకు తప్పించి శ్మశానంలో మూడు అడుగుల మేర మట్టిని తీశారు. ఎముకలు, పుర్రెలు బయటపడ్డాయి. వాటిని తొలగించి రాత్రికి రాత్రే కొత్తగా తారురోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. దీంతో దళితుల శ్మశానం సగానికి పైగా కనుమరుగైంది.

మండిపడుతున్న దళిత సంఘాలు
శ్మశానాన్ని ఆక్రమించి తారురోడ్డు వేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కోసం దళితుల శవాలపై రోడ్డును వేస్తారా? అని తనపల్లి మాజీ సర్పంచ్‌ నాగరాజు నిలదీశారు. అధికార పార్టీ నేత కోసమే ఇలా ఎప్పటి నుంచో ఉన్న రోడ్డును పట్టాగా మార్చారని, దళితుల శ్మశానాన్ని ఆక్రమించి పూర్వీకుల జ్ఞాపకాలను సైతం చెరిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రినే నిలదీస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు