చెరువులపై పచ్చపడగ

16 Mar, 2019 10:43 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే ఆక్రమించాలని ప్రయత్నించిన ఓటేరు చెరువు

నియోజకవర్గంలో రూ.208 కోట్ల కబ్జాలు

ఆక్రమణల్లో పచ్చ నేతలదే పైచేయి

సాక్షి, తిరుపతి రూరల్‌:  చంద్రగిరి నియోజకవర్గంలో 567 చిన్న, పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఆయకట్టు కింద దాదాపు 15,200 ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో 146 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలకు గురైన చెరువుల విలువ దాదాపు రూ.208 కోట్లకు పైమాటేనని రెవెన్యూ సిబ్బందే ఆఫ్‌ ది రికార్డుగా చెపుతున్నారు. 
ఆక్రమణల్లో తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం టాప్‌. తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం మండలాల్లో చెరువుల ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి. రెండు మండలాల్లో 195 చెరువులు ఉంటే , అందులో 86కు పైగా చెరువులు ఇప్పటికే కబ్జాల పాలయ్యాయి. 

∙తిరుపతి రూరల్‌ మండలం ఓటేరులోని చెరువును సైతం కొందరు ఆక్రమించి చెరువును మట్టితో నింపారు. చెరువులో ఇంటి పట్టాలను సైతం సృష్టించారు. జాతీయ రహదారికి ఆనుకొని 19 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు విలువ దాదాపు రూ.80 కోట్లకు పైమాటే.

∙ఎర్రావారిపాళెం: మండలం కమళ్లయ్యగారిపల్లిలో 13.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న గంగినేని చెరువులో రూ.18 లక్షలు విలువ చేసే 6 ఎకరాలను టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు ముగ్గురు ఆక్రమించారు.
∙ఇదే మండలంలో 25.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న బడగానిపల్లి చెరువులో రూ.15 లక్షలు విలువ చేసే 10 ఎకరాలను బడంపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడు.
∙కమల్లయ్యగారిపల్లిలో రూ.10 లక్షల విలువైన చెరువుతో పాటు శ్మశానాన్ని సైతం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు.

∙తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చెరువులో రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇంటి పట్టాలు ఇప్పించారు. పచ్చనేతలు లక్షలు లక్షలు వసూలు చేసుకోని చెరువులో ఫ్లాట్లు వేసి అమ్మేశారు. పేదలు ఇళ్లు కట్టుకోని నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం కురిసిన వర్షాలకు చెరువు నిండిపోవడంతో దాదాపు 90 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.  

∙దుర్గసముద్రం–అడపారెడ్డిపల్లె గ్రామాల మధ్య ఉన్న చెరువును కొందరు రాజకీయ అండతో అక్రమించి మామిడి తోటలను పెంచుతున్నారు.  
∙రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లిలోని తాతిరెడ్డిచెరువులో రూ.1.20 కోట్ల విలువైన 10 ఎకరాలను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆక్రమించాడు. చెరువు తనదేనని యథేచ్ఛగా వ్యవసాయం మొదలు పెట్టాడు.

∙తమకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా 9.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనుప్పల్లి చెరువులో 4 ఎకరాలను రైతులు అక్రమించారు. అలాగే కుప్పంబాదూరు, అన్నసానిగండి చెరువు, పిళ్లారికోన, బొప్పరాజుపల్లి చెరువుల్లోనూ అక్రమణలు జరిగిపోయాయి.శెట్టిపల్లి పంచాయతీ పరిధిలో  పెద్ద చెరువును ఆక్రమించి జోరుగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.తిరుపతి రూరల్‌ మండలం కుంట్రపాకం చెరువును ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దాదాపు 22 ఎకరాల చెరువు భూమి ఆక్రమణకు గురైంది. 

 చెరువులను చెరపట్టారు 
చంద్రబాబు ప్రభుత్వంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ స్థలాలు, పోరంబోకులను మింగిన భూబ కాసురులు చెరువులను సైతం చెరబట్టారు. ప్రభుత్వ రికార్డుల్లో చెరువుగా ఉన్న రూ.100 కోట్ల విలువైన ఓటేరు చెరువును అధికార పార్టీ అండతో ఓ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ రికార్డులను మా ర్చేందుకు తెగబడ్డాడు. వారికి రెవెన్యూ అధి కారులు వత్తాసు పలకడంతో ఓ దశలో పట్టా భూమిగా మార్చారు. నిజాయితీపరుడైన తహసీల్దార్‌ వచ్చి న్యాయ పోరాటం చేయడంతో తిరిగి చెరువుగా నిలిచింది. – రమణ, ఓటేరు 

మరిన్ని వార్తలు