ఇసుక దోపిడీ షురూ..!

18 Mar, 2016 00:55 IST|Sakshi

ప్రాంతాల వారీగా టీడీపీ నేతల ఇసుక పంపకాలు
దీనిపై రహస్య సమావేశం

 
తాడేపల్లి రూరల్ : ఉచిత ఇసుక దోపిడీకి కృష్ణానది పచ్చ చొక్కాల కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. ప్రాంతాల వారీగా ఇసుక రీచ్‌లను పంచుకుని వాటాలు వేసుకున్నారు. దళితులకు గోరంత కేటాయించి, తెలుగుదేశం నాయకులు మాత్రం కొండంత మింగేశారు. అధికారికంగా పెనుమాక క్వారీని గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏడు సార్లు ప్రజాప్రతినిధిగా గెలుపొందిన నాయకుడి అనుచరులు దోచుకుంటున్నారు. గుండిమెడ, ప్రాతూరు ఇసుక క్వారీలను జిల్లాకు చెందిన ఓ మంత్రి 50 పైసలు వాటా తీసుకుని స్థానిక నేతలకు 35 పైసలు ఇచ్చి, దళితులకు మాత్రం 15 పైసల వాటా కేటారుుంచారు. గురువారం రాత్రి తెలుగు తమ్ముళ్లు ఇసుక దందాపై రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇసుక దందాపై కార్యకర్తలు ప్రశ్నించడంతో ఎవరికి ఎంత వాటాలు వెళుతున్నాయో నాయకులు వివరించారు.

మండలంలో గ్రామాల వారీగా వాటాలు ఎంత ఇవ్వాలి అనే విషయం కూడా నిర్ణయించారు. అయితే  అనుమతులు లేని ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్ లోడు తీసుకుని వస్తుంటే ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 100, లారీలకు రూ. 200 వసూలు చేసే విధంగా ఈ సమావేశంలో నిర్ణరుుంచినట్లు సమాచారం. ఈ మేరకు కరకట్టపై రాత్రి సమయంలో తిరిగే వాహనాలకు ఒక్కో క్వారీ దగ్గర ముగ్గురు చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంత తంతు జరుగుతున్నా అధికారులకు మాత్రం తెలియకపోవడం శోచనీయం. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రేపో మాపో కృష్ణానదినీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాటాలు వేసుకుని పంచుకునే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు