చంద్రగిరిలో టీడీపీ గూండా రాజ్యం

2 Apr, 2019 05:44 IST|Sakshi
ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దౌర్జన్యానికి యత్నిస్తున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు

మా‘కమ్మ’కులం ఉన్న ఊర్లోకి ఇతరులను రానీయం

ముంగళిపట్టులో  వైఎస్సార్‌సీపీ ప్రచారాన్ని అడ్డుకున్న అధికార పార్టీ రౌడీలు

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దాడికి యత్నించిన టీడీపీ అభ్యర్థి నాని అనుచరులు

చంద్రగిరి(చిత్తూరు జిల్లా): సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ‘అధికార’ టీడీపీ నేతలను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో విచక్షణ కోల్పోయి ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు దిగి అరాచకాలు సృష్టిస్తున్నారు. వీరి ఆగడాలు రోజు రోజుకు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే, సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండల పరిధిలోని ముంగళిపట్టు గ్రామంలోకి ప్రవేశించారు. ముందే పక్కా స్కెచ్‌తో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచ రులు ఎమ్మెల్యే చెవిరెడ్డి కారును అడ్డుకున్నారు. ‘మా గ్రామంలోకి కేవలం ‘మా కమ్మ కులస్తులు, మా టీడీపీ వాళ్లు తప్ప వేరే ఎవరు వచ్చినా అంగీకరించం’ అంటూ దౌర్జన్యానికి దిగారు. గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు.

ఈ క్రమంలో పులివర్తి నాని అనుచరులు ఎమ్మెల్యే చెవిరెడ్డిని దుర్భాషలాడుతూ నానా బీభత్సం సృష్టించారు. దాడికి యత్నించారు. ఇంతలో ఎమ్మెల్యే గన్‌మ్యాన్లు జాగ్రత్త పడ్డారు. కారులోంచి కిందకు దిగిన చెవిరెడ్డి మాట్లాడు తూ ‘ఇది మంచి సాంప్రదాయం కాదు... మీ కులస్తులే ఈ ఊర్లో ఉన్నారని ప్రచారం కూడా చేయకూడదంటే ప్రజలు హర్షించరు’ అని చెప్పారు. మిగతా పల్లెల్లో ఇతర కులస్తులు టీడీపీ వాళ్లను అడ్డు కుంటే ఎలా ఉంటుందో తెలుసుకోమని హితవు పలికారు. గ్రామంలో ప్రచారం చేసే తిరిగి వెళ్తానని భీష్మించుకుని కూర్చున్నారు. అదే గ్రామంలోని దళితులు చెవిరెడ్డికి పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. వారు కూడా చెవిరెడ్డితోపాటు నిరసన దీక్షలో కూర్చున్నారు. 

దళితులపై దాడికి యత్నం
చెవిరెడ్డికి మద్దతుగా నిలిచిన దళితులు, దళిత మహిళలను పులివర్తి నాని అనుచరులు అసభ్య పదజాలంతో ధూషిస్తూ, దాడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు రక్షణ కల్పించారు. చెవిరెడ్డిని అడ్డుకుని, దళితులపై దాడికి యత్నించిన టీడీపీ నేతలపై ముంగళి పట్టు గ్రామానికి చెందిన దళిత మహిళలు తహసీ ల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని ఏఆర్‌వో, తహసీల్దార్‌ హరికుమార్‌ తెలిపారు. ఇలా దౌర్జన్యాలకు దిగడం మంచిది కాదన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  

ఉద్రిక్తంగా మారిన ముంగళిపట్టు
టీడీపీ నేతల దౌర్జన్యాలతో ఒక్కసారిగా ముంగళిపట్టులో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అడిషనల్‌ ఎస్పీ అనీల్‌బాబుతో పాటు డీఎస్పీలు, సీఐలు ఇతర అధికారులు భారీగా మోహరించారు.  

పులివర్తి నాని అనుచరుడి వీరంగం 
ప్రచారానికి గ్రామంలోకి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై పులివర్తి నాని అనుచరుడు పట్టాభినాయుడు, ప్రసాద్‌ దాడికి యత్నించారు. కారులో వస్తున్న చెవిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే చెవిరెడ్డిని కొట్టేందుకు సిద్ధంగా ఉంచుకున్న బెల్టును చేతిలో పెట్టుకుని, కారులో ముందు కూర్చున చెవిరెడ్డిని పట్టాభినాయుడు బలవంతంగా బయటకు లాగి దాడి  చేయబోతుండగా..అక్కడే ఉన్న గ్రామస్తులు, దళితులు అడ్డుకున్నారు. దీంతో దళితులతో పాటు చెవిరెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. పులివర్తి నాని, ఆయన అనుచరులు వందల సంఖ్యలో ముంగళిపట్టుకు చేరుకున్నారు. ఘటనా స్థలానికి కాస్త దూరంగా ఉన్న నాని పరోక్షంగా కార్యకర్తలను ఉసిగొల్పి చెవిరెడ్డిపై మరోసారి దాడికి యత్నించారు. 

పోలీసులపై నాని చిందులు
టీడీపీ నాయకులు అరాచకాలు, దౌర్జన్యాలను అడ్డుకోవడానికి యత్నించిన పోలీసులపై పులివర్తి నాని చిందులేశారు. తమ కార్యకర్తలను అడ్డుకునే హక్కును మీకెవరిచ్చారంటూ మండిపడ్డారు. చెవిరెడ్డి ప్రచారాన్ని విరమింపజేసుకోకుంటే ఏమైనా జరగవచ్చునని, పోలీసులు తమ కార్యకర్తలను అదుపు చేయాలని చూస్తే  వారి సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు.  

>
మరిన్ని వార్తలు