కోట్లాట..!

15 Jan, 2019 08:12 IST|Sakshi
ఏలూరు మండలం చొదిమెళ్లలో కత్తిదూసిన కోళ్లు

చేతులెత్తేసిన అధికార యంత్రాంగం కత్తులు దూసిన పందెంకోడి

జూదరుల ఇష్టారాజ్యం యథేచ్ఛగా పేకాట, గుండాట, కోతాట

జిల్లాలో 200లకు పైగా బరులు ఒక్కరోజే రూ.60కోట్ల పందేలు

రాజకీయ నేతల అండదండలు పుష్కలం

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: జిల్లాలో జూదరులు బరితెగించారు. బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. సంప్రదాయం ముసుగులో యథేచ్ఛగా పందేలు సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతోనే పందేలు జరుగుతున్నాయి. నిన్నటి వరకూ బరులను ధ్వంసం చేస్తూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ పందేలు జరగనీయబోమని భీష్మించిన అధికార యంత్రాంగం సోమవారం మధ్యాహ్నం నుంచి చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో సుమారు 200 బరులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. రాత్రుళ్లూవేసేందుకు వీలుగా ఫ్లడ్‌లైట్లను బరుల నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పోటీలను అందరూ తిలకించేందుకు  భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 200లకుపైగా బరుల్లో ఒక్కరోజే సుమారు రూ.60 కోట్ల మేర సొమ్ములు చేతులు మారినట్లు తెలుస్తోంది. అధికారపార్టీ నేతలు దగ్గరుండి మరీ పందేలు ఆడించారు.

మద్యం ఏరులే..
బరుల వద్ద మద్యం ఏరులై పారుతోంది. శిబిరాల వద్ద కోడిమాంసం పకోడి, బిర్యానీ దుకాణాలతోపాటు కూల్‌డ్రింక్‌ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ఆ ప్రాంతాలు తిరనాళ్లను తలపిస్తున్నాయి. 

బరులు ప్రారంభించిన ఎమ్మెల్యేలు
ఏలూరు మండలం గుడివాకలంక, జాలిపూడి, కొమడవోలు, శ్రీపర్రు గ్రా మాల్లో కోడిపందేలు జరిగాయి. దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని పందేలను ప్రారంభించారు.
కాళ్ళ మండలం సీసలిలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బరిలో నిలబడి పందేలను ప్రారంభించారు. తెలంగాణ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ భీమవరం ప్రాంతంలో పందేలు తిలకించారు. కొణితివాడ వద్ద  టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెలుగుచిత్ర దర్శకుడు సుధీర్‌వర్మ పందేలను తిలకించారు.  
భీమవరం మండలంలోని ఒక గ్రామంలో గుండాట నిర్వహణకు బరిని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు రూ. 72 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. దీనివల్ల పందేలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
భీమవరం పట్టణంలోని ఆశ్రం ఆస్పత్రి దగ్గరలోనూ, భీమవరం మండలంలోని పెదగరువు, దిరుసుమర్రు, బర్రెవానిపేట, లోసరి గ్రామాల్లోనూ వీరవాసరం మండలం కొణితివాడ, నవుడూరు, వీరవాసరం, నందమూరుగరువు తదితర గ్రామాల్లోనూ భారీస్థాయిలో పందేలు జరిగాయి.
పాలకొల్లు మండలం పూలపల్లిలో ఏఎంసీ చైర్మన్‌ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు నేతృత్వంలోనూ,  ఏఎంసీ మాజీ చైర్మన్‌ చెరుకూరి పండురాజు ఆధ్వర్యంలోనూ పందేలు జరిగాయి.
నరసాపురం నియోజకవర్గంలో కోడిపందేలతోపాటు గుండాట, పేకాట పెద్ద ఎత్తున జరిగాయి. నరసాపురం పట్టణంలో పీచుపాలెం పెద్ద మశీదు, పీచుపాలెం ఫ్యాక్టరీ వద్ద, రుస్తుంబాదలోనూ ఇళ్లు, మసీదులు, విద్యాసంస్థల మధ్యలోనే బరులు ఏర్పాటు చేశారు. లక్ష్యణేశ్వరం బరివద్ద యాంకర్‌ శ్రీముఖి, జబర్దస్త్‌ నటులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.  మొగల్తూరులో సాక్షాత్తు తహసీల్దార్‌ కార్యాలయం పక్కనే  బరి ఏర్పాటు చేశారు. కోడిపందేలు, గుండాట యథేచ్ఛగా సాగుతున్నాయి.
పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెం, టీ నర్సాపురం, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో పందేలు సాగుతున్నాయి.  
గోపాలపురం నియోజకవర్గంలో   మధ్యాహ్నం 12 గంటల నుంచి పందేలు మొదలయ్యాయి.  అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో  ఇవి జరుగుతున్నాయి.
జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, గుర్వాయిగూడెం, లక్కవరం, పంగిడిగూడెం గ్రామాల్లో చింతలపూడి మండలం చిన్నంపల్లిలో, కామవరపుకోట, లింగపాలెం మండలం ములగలంపాడు, కలరాయనగూడెం గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి.
ఆచంట నియోజకవర్గంలో ఆచంట, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలాలలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదం పెద్ద ఎత్తున జరగుతున్నాయి. తణుకు మండలంలో ఇరగవరం, అత్తిలి మండలాల్లో కోడిపందేలు, జూదం, కోతాట విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.
నిడదవోలు పట్టణంతో పాటు పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో  22 బరులు ఏర్పాటు చేశారు.
ఉండి నియోజకవర్గంలో ఐ.భీమవరం, దుంపగడప, కోళ్లపర్రు, చినకాపవరం, సిద్ధాపురం, కాళ్ల, ఉండి, పాలకోడేరుల్లో పందేలు జరిగాయి.
కొవ్వూరు పట్టణంలో రెండుచోట్ల,  సీతంపేట, తోగుమ్మి, పశివేదల, దొమ్మేరు, ఐ. పంగిడి, ఆరికిరేవుల, చాగల్లు, తాళ్ళపూడి గ్రామాల్లో పందేలు జోరుగా సాగాయి.
భీమడోలు మండలం గుండుగొలను, ఉంగుటూరు మండలం నారాయణపురం, నిడమర్రు మండలం పత్తేపురం, గణపరం లోనూ కోడిపందేల బరులు వెలిశాయి.  

భారీ బెట్టింగులు
జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. సోమవారం మధ్నాహ్నం వరకూ పోలీ సులు కఠినంగా వ్యవహరించినా సర్కారు ఆదేశాలతో పట్టుసడలించారనే అపవాదు వచ్చింది. ఇక బెట్టింగు రాజాలు చెలరేగిపోయారు. భారీగా పందేలు కాసినట్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు రూ. 50 నుంచి రూ.60 కోట్ల మేర పందాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక బరుల వద్ద మద్యం ఏరులైపారింది. బరుల వద్ద కోడిపందేలు వేసినా లేకున్నా మద్యం విక్రయాలు మాత్రం భారీగా సాగుతున్నాయి. ఎక్సైజ్‌ అధికారులు అక్రమ మద్యం వ్యాపారాలవైపు చూడకుండా నిర్వాహకులు ఒప్పం దాలు చేసుకున్నారు. పేకాట, గుండాట, కోతాట శిబిరాల నిర్వాహకులు భారీగా ఆదాయాన్ని సంపాదించారు.

మరిన్ని వార్తలు