ఇంత వేళాకోళ్లమా..!

18 Jan, 2019 07:40 IST|Sakshi

మూడురోజులూ జాడలేని అధికార యంత్రాంగం

అంతా ముగిశాక ఇప్పుడు హడావుడి బరుల వద్దకు పరుగులు

కేసులు మీరే చూపెట్టాలని నిర్వాహకులపై ఒత్తిళ్లు  

కోర్టు అడిగితే తప్పించుకునే యత్నం

పశ్చిమగోదావరి, తణుకు: సంక్రాంతి సంప్రదాయం పేరుతో అధికార పార్టీ నాయకులు బరులు ఏర్పాటు చేసి బహిరంగంగానే కోడి పందేలు నిర్వహించినా అధికారయంత్రాంగం పట్టించుకోలేదు. కోళ్లకు కత్తులు కట్టొద్దని న్యాయస్థానం స్పష్టం చేసినా.. బరుల నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. అటువైపు కనీసం కన్నెత్తికూడా చూడకుండా అధికారులు చట్టాలు, వ్యవస్థతో పరిహాసమాడారు. ఇప్పుడు అంతా ముగిశాక చట్టం కళ్లకు గంతలు కట్టి న్యాయస్థానం ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. సుప్రీం కోర్టు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించి పండగ మూడ్రోజుల పాటు సాగించిన రూ. వందల కోట్ల కోడిపందేల దందాను కప్పిపుచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆయా కోడి పందేల నిర్వాహకులకు లక్ష్యాలు విధిస్తూ తమకు ఇన్ని కేసులు కావాలని వారిపైనే ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తాపీగా తాము పందేలను అరికట్టేందుకు తీవ్రంగా శ్రమించామని నిరూపించుకునేందుకు మూడ్రోజుల పాటు 521 కేసులు నమోదు చేసి 1,499 మందిని అరెస్టు చేశామంటూ జిల్లా పోలీసులు లెక్కలు చెబుతున్నారు.

ప్రేక్షక పాత్ర...
సంక్రాంతి పండగ మూడ్రోజులపాటు కోర్టు తీర్పులు.. 144 సెక్షన్‌విధించామంటూ కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలు.. కోడి పందేలు అడ్డుకుని తీరతామంటూ జిల్లా ఎస్పీ చెప్పిన మాటలు... గాల్లో కలిపేసి ఇప్పుడు అధికారులు హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది.  పండగ రోజుల్లో అధికార పార్టీ నేతల సమక్షంలో.. వారి అండదండలతో కత్తులు కట్టి మరీ  రూ. వందల కోట్లలో కోడి పందేలు ఆడినా పోలీసులు కనీసం కిమ్మనలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కడికక్కడే కోడి పందేల బరులను ప్రారంభించినా.. మినీ స్టేడియాలను తలపించేలా ఒకేసారి వేలాది మంది కూర్చుని వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేసినా పోలీసులు గానీ రెవెన్యూ అధికారులు గానీ అడ్డుకోలేదు. ఇప్పుడు మాత్రం పండగ మూడ్రోజుల్లో జిల్లాలో 521 కేసులు నమోదు చేసి 1499 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 8,53,655 నగదు, 857 కోడిపుంజులు, 1131 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు అధికారులు ప్రకటనలు జారీ చేయడం గమనార్హం.  పేకాట ఆడుతున్న వారిపై 109 కేసులు నమోదు చేసి 371 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 2,08, 852 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. పండగ రోజుల్లో బరుల వద్ద బహిరంగంగా కోతాట, పేకాట నిర్వహించి ఓపెన్‌ బార్లు ఏర్పాటు చేసినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు కేసులంటూ నిర్వాహకుల వెంట పడడం విస్మయపరుస్తోంది.

డమ్మీలతోనే కనికట్టు...
అధికారయంత్రాంగం అందించిన సహాయానికి టీడీపీ నేతలు ఎక్కడికక్కడే పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్‌ యంత్రాంగాలను ‘సంతృప్తి’పరిచారు. ఒక్కో పోలీసు స్టేషన్, ఎక్సైజ్, తహసీల్దార్‌ పరిధిలోని బరుల నిర్వాహకులు భారీగానే కమీషన్లు ముట్టజెప్పారని తెలుస్తోంది. ఇదిలాఉంటే కోడిపందేల నిర్వహణపై ఎవరైనా ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దలను కాపాడేందుకు పోలీసులు డమ్మీల కనికట్టుకు తెరతీశారు.   తూతూమంత్రంగా టీడీపీ నేతల అనుచరుల్లో కొందరిపై కేసులు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌పై వదులుతారు. భవిష్యత్తులో న్యాయస్థానాలు ప్రశ్నిస్తే తాము బరులపై దాడులు చేశామని, నిర్వాహకులను సైతం అరెస్టు చేశామని చూపిస్తారు. గత ఏడాది  మీడియా ప్రతినిధులకూ నోటీసులు జారీ చేసినట్లుగానే ఈ సారీ పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు