అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు

6 Oct, 2019 18:59 IST|Sakshi

విజయనగరం : శృంగవరపుకోట శాసన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో గ్రూప్‌ రాజకీయాలు నడుస్తున్నాయంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు టీడీపీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం తనపై అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక ఇలాంటి పనులకు ఒడిగట్టడం సరికాదు. ప్రజా నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలోని నాయకులందరి సమన్వయంతోనే పారదర్శకంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు.

అవినీతి రహిత పాలనను ప్రజలకు అందిస్తున్నాం. గ్రామసచివాలయ ఉద్యోగ నియామకాలనే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ నియామకాలలో ప్రతిపక్షపార్టీల పిల్లలకు కూడా ఉద్యోగాలొచ్చాయి. అంతేగాక ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణలో మా నుంచి ఎటువంటి ఒత్తిడిలు ఉండవు. వారి విధులు సక్రమంగా నిర్వర్తించుకొనేందుకు, గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. అన్ని వర్గాలనుంచి మంచి స్పందన వస్తోంది. టీడీపీ నాయకులు గ్రూపు రాజకీయాలంటూ చేసే ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు.  

మరిన్ని వార్తలు