ఎక్సైజ్ సిబ్బందిని అడ్డుకున్న టీడీపీ నాయకులు

17 Mar, 2016 00:57 IST|Sakshi

చాట్రాయి : కాపు సారా అమ్ముతున్నారన్న కారణంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బందిని స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్న సంఘటన. మండలంలోని పోలవరం గ్రామంలో బుధవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు కాపుసారా అమ్మకాలపై దాడులు నిర్వహించారు. గ్రామంలో ఇద్దరు మహిళలను వెంట బెట్టుకుని తమ్మిలేరు వాగువద్ద ఉన్న బెల్లం ఊట వద్దకు వెళ్లారు. ఈ ఊట మీదేనని మీ మీద కేసు నమోదు చేస్తామని చెప్పి విస్సన్నపేటకు జీపులో తీసుకొస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు వచ్చి సారా అమ్మకాలకు సంబంధంలేని వారిని ఎందుకు తీసుకెళుతున్నారని ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు, అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

తహసీల్దార్ షాకీరున్నీసా బేగం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయంలో ఇద్దరితో చర్చలు జరిపారు. గతంలో వీరు కాపు సారా అమ్మడం వలన ఒకరిని బైండోవరు చేస్తున్నామని తహసీల్దారు చెప్పారు. చర్చల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ ఖదీర్, ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనుబాబు, విస్సన్నపేట ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ, పోలవరం సర్పంచ్ ఈదర సత్యనారాయణరాజు, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, జిల్లా పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి మందపాటి బసవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు