ఎల్‌ఎల్‌ఆర్‌ గాలం!

1 Aug, 2018 12:25 IST|Sakshi

ఆర్టీఏ అధికారుల అండతో మేళాలు

డ్రైవింగ్‌ లైసెన్స్‌లతో యువతను ఆకర్శిస్తున్న టీడీపీ నేతలు

ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహించాలని ఒత్తిడి

మెప్పు కోసం తలూపుతున్నఆర్టీఏ అధికారులు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. నాలుగు ఓట్లు రాలుతాయంటే ఎవరినైనా భయపెడుతున్నారు. ఏ పనైనా చేస్తామంటున్నారు. ఇటీవల కాలంలో ఆర్టీఏ     ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు కూడా అలాంటివే. మధ్యతరగతి యువతకు ఎల్‌ఎల్‌ఆర్‌ పేరుతో గాలం వేసి తమవైపు తిప్పుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. అందుకే  ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా కాస్త ఎన్నికల మేళాలను తలపిస్తున్నాయి.

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆర్టీఏ అధికారులను ఎన్నికల పావులుగా వాడుకుంటున్నారా? లెసెన్స్‌ పేరుతో ఓట్ల రాజకీయానికి తెరలేపారా? మధ్య తరగతి యువతను లక్ష్యం చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు? ఇటీవల నిర్వహిస్తున్న ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలను చూస్తే అవన్నీ నిజమేననిపిస్తోంది. కరువుకు చిరునామాగా మారిన జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక ఎక్కువ మంది యువత మోటారు ఫీల్డ్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఆటో, ట్యాక్సీ, కారు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. రోడ్డు నిబంధనల ప్రకారం వీరందరికీ లైసెన్స్‌ కావాలి. మరోవైపు ఇటీవల ద్విచక్రవాహనాల సంఖ్య పెరగడం.. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో లైసెన్స్‌ల ప్రాధాన్యం పెరిగింది. దీన్ని అందిపుచ్చుకున్న అధికారపార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మేళాలో అన్నీ తామై వ్యవహరించి యువత ఓట్లకు గాలం వేస్తున్నారు. రోజుకు ఆర్టీఏ కార్యాలయంలో 60 మందికి మాత్రమే ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌ నిర్వహించే ఆర్టీఏ అధికారులు కూడా ఎమ్మెల్యేల వద్ద మెప్పు పొందేందుకు మేళాలు నిర్వహిస్తూ వందల మందికి లెర్నింగ్‌ లైసెన్స్‌లు ఇచ్చేస్తున్నారు.

నిబంధనలకు భయపడి...
ప్రస్తుతం డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం సామాన్యులకు గగనంగా మారుతోంది. నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే సవాలక్ష నిబంధనలు చెబుతున్నారు. అన్నీ దాటుకుని ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌కు వెళ్లినా అక్కడ పాసవుతామన్న నమ్మకం లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు తమ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇలా గత నెలలో తాడిపత్రిలో 6 రోజులు ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా నిర్వహించి 3,400 మందికి, ఉరవకొండలో ఏకంగా 20 రోజులు నిర్వహించి 10 వేల మంది, ధర్మవరంలో 12 రోజుల పాటు మేళా నిర్వహించి 4వేల మందికి లెర్నింగ్‌ లైసెన్స్‌లు మంజూరు చేయించారు. ఇవన్నీ ఆర్టీఏ అధికారులు స్వతహాగా చేసినవి కావు. 

రాజకీయ ప్రయోజనాలకోసమే..
ఆర్టీఏ అధికారులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలో అధికారపార్టీ చోటా నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తమ నేత చెప్పారు కాబట్టే మేళా ఏర్పాటు చేశారనీ, ఆయన చెప్పినట్లు వింటే లైసెన్స్‌లు కూడా ఇప్పిస్తామంటూ అక్కడకొచ్చిన యువతకు చెబుతున్నారు. పరోక్షంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.  

ఆర్టీఏ అధికారుల వింత వైఖరి
ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే నెలన్నర తర్వాత స్లాట్‌ బుక్‌ అవుతోంది. అది కూడా రోజుకు పరిమిత సంఖ్యలో ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రోజుకు 60 మందికి మాత్రమే అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఫలితంగా వాహనదారుడు దరఖాస్తు చేసుకున్న నెలన్నర, రెండు నెలలకు అవకాశం వస్తోంది. ఆ సమయంలో అధికారులు ఫెయిల్‌ చేస్తే మరో రెండు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్న మేళాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడైతే ఇదే ఆర్టీఏ అధికారులు రోజులు వందల సంఖ్యలో లెర్నింగ్‌ లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నారు. నేరుగా కార్యాలయానికి వెళ్తే మాత్రం చుక్కలు చూపుతున్నారు. అందువల్లే ఈ మేళాలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. అందుకే నేతలంతా ఒకటికి రెండు సార్లు తమ నియోజకవర్గాల్లో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహించాలని ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.  

డిమాండ్‌ ఉన్న చోట నిర్వహిస్తున్నాం
అందరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఉండాలనే ఉద్దేశంతోనే మేళాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రజాప్రతినిధులు అడిగచోట్ల కూడా మేళాలు నిర్వహిస్తున్నాం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. ప్రజల నుంచే వ్యక్తిగతంగా చలానా మొత్తాలను స్వీకరిస్తున్నాం. ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహిస్తున్నాం.  – సుందర్‌వద్దీ, ఉపరవాణా కమిషనర్‌ 

మరిన్ని వార్తలు