తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా

20 Dec, 2014 02:12 IST|Sakshi
తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా

కమీషన్ ఇవ్వాలని బెదిరింపులు
కమిటీల్లో తమ వారినే నియమించాలని హుకుం
కుదరదన్న కార్యదర్శిపై దౌర్జన్యం, సెలవుపై పంపేందుకు చర్యలు
అర్ధాంతరంగా అమ్మకాలు నిలిపేస్తున్నమహిళా సంఘాలు
 

 చిత్తూరు (అగ్రికల్చర్) :  అక్రమ రవాణా అరికట్టేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే ఇసుక అమ్మకాలు చేపట్టాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అరుుతే తెలుగు తమ్ముళ్లే అందుకు విరుద్ధంగా ఇసుక దందాలకు పాల్పడుతున్నారు. రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలంటే తమకు కమీషన్ ఇవ్వాలని, రీచ్‌ల వద్ద మహిళా కమిటీల్లో తాము చెప్పిన వారినే నియమించాలని, లేదంటే అంతు చూస్తామంటూ అధికారులపై దౌర్జన్యాలకు పూనుకుంటున్నారు. సెలవుపై వెళ్లాలని కూడా అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పలు చోట్ల ఇటు అధికారులు, అటు రీచ్ కమిటీల్లోని సంఘాల మహిళలు భయభ్రాంతులకు గురై ఇసుక అమ్మకాలను అర్ధాంతరంగా నిలిపేస్తున్నారు. జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక తరలింపును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో  డ్వాక్రా మహిళల చేత ఇసుక తరలింపును చేపట్టేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాపం్తంగా అనువుగా ఉన్న 39 ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించారు. అందులో 19 రీచ్‌లలో ఇసుక తరలింపునకు డ్వాక్రా సంఘాల్లోని మహిళలతో కమిటీలను  డీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటు చేశారు. ఇసుక తరలింపు పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ పనులు ప్రారంభించి వారాలు కూడా గడవకనే పలుచోట్ల ఇసుక రవాణా పనులను మహిళలు నిలిపేస్తున్నారు. ఇప్పటికే 5 ప్రదేశాల్లో నిలిపి వేయడంతో 14 రీచ్‌ల్లోనే ఇసుక అమ్మకాలు, రవాణా సాగుతున్నాయి.

తెలుగు తమ్ముళ్ల బెదిరింపులే కారణం

మహిళా సంఘాల ద్వారా ఇసుక తరలింపు అర్ధాంతరంగా నిలిచిపోవడానికి అధికార చెందిన తెలుగు తమ్ముళ్ల బెదిరింపులే కారణమనేది స్పష్టమవుతోంది. చిత్తూరు రూరల్ మండలం ఆనగల్లు వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌కు ఆ గ్రామానికి చెందిన కొందరి సొంత స్థలాల్లో ట్రాక్టర్లు వె ళ్లాలి. అందుకుగాను తెలుగు తమ్ముళ్లకు ప్రతి ట్రిప్పునకు రూ. 200 మేరకు కమీషన్ ఇవ్వాలి. వారు సూచించిన ట్రాక్టర్లకు మాత్రమే ఇసుక తరలింపునకు అవకాశం కల్పించాలి. ఇసుక తవ్వకంలో వాల్టాకు విరుద్ధంగా 3 మీటర్లలోతు వరకు తవ్వుకునేందుకు అవకాశం కల్పించాలని బెదిరించారు.

డీఆర్‌డీఏ అధికారులు రీచ్ వద్దకు వంకలోనే ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేసి ఇసుక తరలిస్తున్నారు. అయితే ప్రత్యేక దారిలో వెళ్లినా తమకు కమీషన్‌ను ఇవ్వాల్సిందేనని  బెదిరించారు. దీనిపై గ్రామ కార్యదర్శి సమ్మతించక పోవడంతో, అతనిపై తెలుగుతమ్ముళ్లు దౌర్జన్యాలకు దిగడమే కాకుండా, కార్యదర్శిని దీర్ఘకాల సెలవుపై పంపిచేందుకు ఎంపీడీవో ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక్కడ ఇసుక రవాణాను చేపట్టలేక నిలిపేశారు.

గంగాధరనెల్లూరు మండలం గారంపల్లి రీచ్ వద్ద ఇసుక తరలింపునకు మహిళా కమిటీల్లో తాము సూచించిన వారినే ఏర్పాటు చేయాలని ఆ గ్రామ తెలుగు తమ్ముళ్లు అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు అక్కడ కమిటీలను ఏర్పాటుచేయలేక ఇసుక రవాణాను చేపట్టలేక అర్ధాంతరంగా నిలిపేశారు.

వాల్మీకిపురం మండలంలో కూడా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని ట్రిప్పునకు రూ. 100 కమీషన్ వసూలు చేస్తుండడంతో అక్కడి రీచ్‌లకు చెందిన కమిటీల్లోని మహిళలు కూడా ఇసుక తరలింపు చేపట్టలేమని అధికారులకు తెలిపారు.  ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల రీచ్‌లలో నెలకొనడంతో డీఆర్‌డీఏ అధికారులు ఇసుక తరలింపునకు కమిటీలను కూడా వేయలేక తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు