మట్టిని పిండి.. కోట్లు కొల్లగొట్టి..!

9 Feb, 2016 23:32 IST|Sakshi
మట్టిని పిండి.. కోట్లు కొల్లగొట్టి..!

జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధుల దోపిడీకి పంచ భూతాలూ సమిధలవుతున్నాయి. కొండలు కరిగించేస్తున్నారు. అక్రమ క్వారీలతో మట్టి నుంచి కోట్లు పిండుకుంటున్నారు.యలమంచిలి నియోజకవర్గంలో అధికా పార్టీ ప్రజాప్రతినిధి సాగిస్తున్న దందాతో ప్రభుత్వ భూముల్లో మట్టి మాయమైపో తోంది. రాంబిల్లి మండలంలో నేవల్ బేస్ ఫిల్లింగ్ పనుల కాంట్రాక్టును హైజాక్ చేసి భారీ దోపిడీ సాగిస్తున్నారు. డీపట్టా రైతు లను భయాందోళనలకు గురిచేసి ఏడా దిన్నర వ్యవధిలో రూ.17 కోట్ల విలువైన మట్టిని మింగేశారు.
 
విశాఖపట్నం
జిల్లాలోని రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో నెలకొల్పనున్న నేవల్ బేస్ కోసం నేవల్ అధికారులు భూమి ఫిల్లింగ్ పనులు చేపట్టారు. ఫిల్లింగ్ చేయాల్సిన భూముల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున రెండు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొదటి దశలో సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్లు, రెండో దశలో సుమారు 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరమవుతుందని అంచనా వేశారు. మొదటి దశ పనుల కాంట్రాక్టును ఏడాది క్రితం ఓ సంస్థకు అప్పగించారు. యూనిట్(3 క్యూబిక్ మీటర్లు)కు రూ.650 చొప్పున చెల్లించేందుకు    కాంట్రాక్టు కుదురింది. కాగా మట్టి సరఫరాకు డీ పట్టా భూములకు అనుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. తమ డీపట్టా భూముల నుంచి మట్టి సరఫరా చేస్తామని 47 రైతులు దరఖాస్తు చేశారు. వారిలో 24 మందికి రెవెన్యూ అధికారుల సిఫార్సు మేరకు గనుల శాఖ అనుమతిచ్చింది.  ఈ మేరకు ధర కూడా నిర్ణయించారు. ఒక యూనిట్‌కు (3 క్యూబిక్ మీటర్లు) రైతులకు సగటున రూ.250 చెల్లించేందుకు కాంట్రాక్టరు సమ్మతించారు. అంటే నేవీ నుంచి యూనిట్‌కు రూ.650 తీసుకుంటున్న కాంట్రాక్టు సంస్థ రైతులకు మాత్రం రూ.250 చెల్లిస్తోంది. అదైనా సక్రమంగా జరుగుతోందా అంటే అదీ లేదు. ఇక్కడే యలమంచిలి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు రంగ ప్రవేశం చేసి భారీ దోపిడీకి తెరతీశారు.

 అంతా నేనే చూసుకుంటానుఅధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి కన్ను ఈ కాంట్రాక్టుపై పడింది. ‘అంతా నేనే చేసుకుంటాను’ అని  కాంట్రాక్టరును తమదైన శైలిలో ప్రభావితం చేశారు. తమ అనుచరులు సరఫరా చేసే మట్టిని తీసుకోవాలని హుకుం జారీ చేశారు. అనంతరం తన అనుచరులను రంగంలోకి దింపారు.  నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన  డీపట్టా భూముల నుంచి రైతులే మట్టి తవ్వి సరఫరా చేయాలి. కానీ ప్రజాప్రతినిధి అనుచరులు డీపట్టా భూములను ఆనుకుని ఉన్న  ప్రభుత్వ భూములపై పడ్డారు. భారీ సంఖ్యలో వాహనాలను మోహరించి ఏడాదిన్నరగా భారీ మట్టి కుంభకోణానికి తెగించారు.

 కుంభకోణం విలువ రూ.17కోట్లు!
  మట్టే కదా.. అనుకోవద్దు. ఎందుకంటే అనుమతులు పొందిన రైతులను భయాందోళనకు గురిచేసి దాదాపు ఏడాదిన్నరగా ప్రజాప్రతినిధి నియమించిన బృందమే అక్రమంగా మట్టిని తవ్వి సరఫరా చేస్తోంది. రాంబల్లి మండలంలోని పెద్దకలవలపల్లి, వెలుచూరు, గోవిందపాలెం, హరిపురం తదితర గ్రామాల్లోని ప్రభుత్వ, కొండ పోరంబోకు భూముల్లో  యథేచ్ఛగా తవ్వేసి మట్టిని తరలించేశారు. దాని విలువ ఎంతో తెలుసా... దాదాపు రూ.17కోట్లు!... నమ్మశక్యంగా లేదా?.. అయితే ఈ లెక్క చూడండి..

 ప్రజాప్రతినిధి నియమించిన బృందం రోజుకు 200 ట్రిప్పుల మట్టిని అనధికారికంగా తవ్వేసి సరఫరా చేసినట్లు అంచనా. ఒక ట్రిప్పుకు 6 యూనిట్లు చొప్పున సరఫరా చేశారు. అంటే 200 ట్రిప్పుల ద్వారా 1,200 యూనిట్లు సరపరా చేశారన్నమాట. ఆ ప్రకారం రోజుకు రూ.3 లక్షల విలువైన మట్టిని కొల్లగొట్టారని స్పష్టమవుతోంది. దాదాపు 15 నెలలుగా ఈ దందా సాగుతోంది. అంటే సగటున రూ.రూ.17 కోట్లు అప్పనంగా దోచేశారు. అదండీ సంగతి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా