ఖాకీపై స్వారీ

16 Aug, 2018 14:19 IST|Sakshi

శ్రుతిమించిన అధికారపార్టీ నేతల ఆగడాలు

ఇసుక మాఫియా, మట్కా, బెట్టింగ్‌ కేసుల్లో జోక్యం  

‘అయినవాళ్ల’ కేసుల మాఫీకి ఒత్తిళ్లు.. కాదంటే బెదిరింపులు

కర్నూలు : ‘వాళ్లు నా అనుచరులు. నన్ను నమ్ముకుని పార్టీలో ఉన్నారు. వచ్చే మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే డబ్బు కావాలి. అందుకోసం మట్కా నిర్వహించుకుంటున్నారు. వాళ్లింటి వైపు వెళ్లొద్దు.’          –  ఇదీ కర్నూలులోని పోలీసులకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జారీ చేసిన ఆదేశం.

అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో వారు నిఘా ఏర్పాటు చేశారు. అయితే.. జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్య నాయకుని సోదరుడు ఓ పోలీసు అధికారికి ఫోన్‌ చేసి.. ‘వాళ్లు మావాళ్లే. వారి జోలికి వెళ్లొద్దు’ అంటూ ఆదేశాలు జారీ చేశారు.
పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యాన్ని ఓ వ్యాపారి రెండు లారీల్లో వేరే రాష్ట్రానికి తరలిస్తుండగా నగర శివారులోని తుంగభద్ర చెక్‌పోస్టు వద్ద గస్తీ పోలీసులు పట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు సదరు బియ్యం వ్యాపారి దగ్గరరూ.4 లక్షలు దండుకుని.. పోలీసు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేసి లారీలను విడిపించాడు. కేసు కూడా మాఫీ చేయించాడు.  

నందవరం మండలం పెద్దకొత్తిలి గ్రామ సర్పంచ్‌ ఇరుపాక్షిరెడ్డి  వైఎస్సార్‌సీపీలో ఉంటూ ప్రజల్లో మంచి పట్టు సాధించారు. స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి చేసి ఇరుపాక్షిరెడ్డికి సంబంధించిన ట్రాక్టర్లు, పొక్లెయిన్లు సీజ్‌ చేయించి అక్రమంగా కేసు పెట్టించారు. దాన్ని మాఫీ చేసేందుకు టీడీపీలోకి బలవంతంగా చేర్పించుకున్నారు.  

రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతి కోసం రెండు నెలల క్రితం కలెక్టర్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ భాస్కర్‌రెడ్డితో పాటు మరికొంతమందిపై అక్రమ కేసులు బనాయించారు. ఖాకీలపై అధికార పార్టీ నేతల పెత్తనం ఎక్కువయ్యిందనడానికి  ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.  

శాంతిభద్రతల పరిరక్షణ, పేదలకు భరోసా కల్పించడంలో పోలీసు శాఖ పాత్ర చాలా కీలకం. రాగద్వేషాలకు, కుల మతాలకు అతీతంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల విధి. ఆ దిశగా పనిచేస్తున్న కొంతమంది అధికారులపై అధికార పార్టీ నేతల పెత్తనం రోజురోజుకూ మితిమీరుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. అక్రమార్కులకు వంత పాడుతున్నారు. బాధితులకు న్యాయం జరగకూడదంటూ అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. అనుంగులు, అయినవాళ్ల లబ్ధి కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆరు నూరైనా తాము చెప్పినట్లే వినాలంటూ పోలీసులకు హుకుం జారీ చేస్తున్నారు. కాదంటే బదిలీపై వెళ్లాల్సి వస్తుందంటూ బాహాటంగానే బెదిరిస్తున్నారు.   

ఇదెక్కడి చోద్యం!
వివాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నప్పుడు బాధితులు స్టేషన్‌కు చేరడం, పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఇక్కడే నేతలు జోక్యం చేసుకుంటున్నారు. అన్యాయంగా వ్యవహరించిన తమ వారివైపే మొగ్గు చూపాలని నిబంధన విధిస్తున్నారు. వైరివర్గం తప్పు లేకున్నా వారిపై అక్రమ కేసులు బనాయించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. కర్నూలు నగరంలోని డీవీఆర్‌ హోటల్‌ వద్ద రెండు నెలల క్రితం ఎమ్మెల్యే అనుచరులు ఉమాకాంత్‌ అనే యువకుడిపై దాడి చేసి గాయపరిచారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పోలీసులపై ఒత్తిడి చేసి.. బాధితుడిపైనే సంబంధం లేని వ్యక్తితో ఎస్సీ కేసు నమోదు చేయించారు. అలాగే పార్టీ మారిన ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి కర్నూలు నగరానికి చెందిన ఇంద్రసేనారెడ్డి అనే యువకుడు ‘ఎవరి పుణ్యాన గెలిచి పార్టీ మారావు’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు ఆగ్రహించిన సదరు ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి పెంచి ఆ యువకునిపై కేసు నమోదు చేయించి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఆలూరు మండలం హత్తి బెళగల్‌లో ఇటీవల క్వారీలో భారీ పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. క్వారీని బంద్‌ చేయించాలని ఐదు నెలల క్రితమే గ్రామస్తులు ధర్నా చేశారు. అయితే.. అధికార పార్టీకి చెందిన క్వారీ యజమాని శ్రీనివాస చౌదరి పోలీసులపై ఒత్తిడి చేసి.. ఆందోళనకు దిగిన మల్లికార్జునతో పాటు మరో ఐదుగురిపై కేసు పెట్టించారు. అప్పటి ఎస్‌ఐ ధనుంజయతో వారిని తీవ్రంగా కొట్టించి జైలుకు కూడా పంపిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది.  

అసాంఘిక శక్తులకు నేతల అండ
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కూడా అధికార పార్టీ నేతలు అండదండలు అందిస్తున్నారు. నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చినప్పటి నుంచే ఫోన్ల పరంపర ఆరంభమవుతోంది. బెట్టింగ్, మట్కా, ఇసుక మాఫియా వంటి వాటిల్లో కూడా అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. పలు కేసుల్లోని నిందితులు ‘రాజకీయ’ ఆశ్రయం పొందడం, నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం పరిపాటైంది. ఆలూరుకు చెందిన ఐదుగురు యువకులు ఆదోని పట్టణంలోని బంగారు షాపులో పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడ్డారు. వారు ఆ నియోజకవర్గ నాయకుడిని ఆశ్రయించడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. బంగారు షాపు యజమానితో రాజీ కుదిర్చి పెట్టిన కేసు మాఫీ చేయించిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో మూడు మాసాల క్రితం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి పెంచి సంఘటనకు ఎలాంటి సంబంధం లేని మాజీ కార్పొరేటర్‌ అమృతరాజుపై హత్యాయత్నం కేసు పెట్టించారు.  

కాదంటే బదిలీ బహుమానం
తమ మాట వినని పోలీసులపై బదిలీ వేటు తప్పదంటూ నేతలు బాహాటంగానే ప్రకటిస్తుండటం గమనార్హం. ఏ శాఖలో అయినా బదిలీలు అనివార్యమే. అయితే.. పోలీసు శాఖలో ఇది కాస్తా ఎక్కువగా ఉంటోంది. దీన్నే అదునుగా ఎంచుకుని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఏటా బదిలీల సీజన్‌లో నేతల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అత్యున్నత స్థాయి అధికారుల దృష్టికి తమ జాబితాలు తీసుకెళ్లి పంతం నెగ్గించుకోవడం జిల్లాలో ఆనవాయితీగా మారింది. తన మాటకు విలువ ఇవ్వలేదన్న అక్కసుతో బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి.. డీఎస్పీ పి.ఎన్‌.బాబును పట్టుబట్టి బదిలీ చేయించి పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం యనగండ్లతో పాటు బనగానపల్లెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశానికి అనుమతించడంపై ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టించి డీఎస్పీపై బదిలీ వేటు వేయించడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది.

ఇదే తరహాలో కర్నూలు డీఎస్పీ ఖాదర్‌ బాషాను కూడా స్థానిక ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ బదిలీ చేయించారన్న ఆరోపణలున్నాయి. కేవలం తొమ్మిది మాసాలకే ఆయనపై బదిలీ వేటు పడటం ఇందుకు బలం చేకూర్చుతోంది. మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బాషాను ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేయించినట్లు విమర్శలున్నాయి. ఏడాది క్రితం డి.వి.రమణమూర్తి స్థానంలో ఐపీఎస్‌ అధికారి విశ్రాంతి పాటిల్‌ కర్నూలు డీఎస్పీగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టకముందే డైరెక్ట్‌ ఐపీఎస్‌ అధికారి తమకు వద్దని అడ్డుకున్నారు. మొత్తంగా పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించి కిందిస్థాయి యంత్రాంగానికి భరోసా కల్పించాల్సిన ఉన్నతాధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీల సందర్భంగా ఫలాన సర్కిల్‌ లేదా స్టేషన్‌కు పోస్టింగ్‌ కావాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నుంచి లేఖ తెచ్చుకోవాలని ఉన్నతాధికారులే స్వయంగా ఎస్‌ఐ, సీఐలకు సూచిస్తుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు