బిక్కుబిక్కుమంటున్న చంద్రబాబునాయుడు కాలనీ

9 Aug, 2018 11:03 IST|Sakshi
ఆధార్, రేషన్, టీడీపీ సభ్యత్వ కార్డులు చూపుతున్న ఎస్టీలు

తొట్టంబేడు: తొట్టంబేడు పంచాయతీలోని చంద్రబాబునాయుడు కాలనీ ఎస్టీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.  మంగళవారం టీడీపీ కార్యకర్తల నుంచి మళ్లీ ఎస్టీలకు బెదిరింపుల పర్వం మొదలైంది. డీఎస్పీ రామకృష్ణ, సీఐ బాలయ్య, ఎస్‌ఐ సుధాకర్‌ కాలనీకి వెళ్లి రక్షణగా ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చి వెళ్లారో లేదో కాసేటికే  పారిశ్రామికవేత్త అనుచరుడు ధర్మయ్య  ఖాళీచేయాలని, కేసు వాపస తీసుకోవాలని బెదిరించి వెళ్లడం గమనార్హం! గొడవ  జరిగి 48 గంటలు గడుస్తున్నా  ఇంతవరకు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయలేదని ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ లీలలతోనే సమస్యలు జటిలం
హౌసింగ్‌ అధికారులు 25మంది ఎస్టీలకు పక్కాగృహాలు నిర్మించారు. వీరందరికీ  రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు, ఎంజాయ్‌మెంట్, ఓటరు కార్డులు, నివాస, కుల ధ్రువీకరణపత్రాలు కూడా ఉన్నాయి. మౌలిక వసతులనూ కల్పించారు. పారిశ్రామికవేత్త గుడ్లూరి మల్లిఖార్జున నాయుడు పేరిట 2015లో అప్పటి తహసీల్దారు పట్టాలు పంపిణీ చేశారు. అయితే 1995లో ఎస్టీలకు పక్కా గృహాలు నిర్మించుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎంజాయ్‌మెంట్‌ ఇస్తే దానిపై మళ్లీ ఎలా రెవెన్యూ అధికారులు పారిశ్రామికవేత్తకు పట్టా ఎలా ఇస్తారని ఎస్టీలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆ పారిశ్రామికవేత్త అనుచరులు ఎస్టీలను ఖాళీ చేయాలని  నెల రోజులుగా చేస్తున్న దౌర్జన్యాలకు ఎస్టీలు ప్రాణభయంతో హడలిపోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కలెక్టర్‌ అయినా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

రికార్డులు పరిశీలిస్తున్నాం
చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీ సంబం ధించిన రికార్డులు పరిశీలిస్తున్నాం.  మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులకు చె ప్పాం. ఎస్టీలకు న్యాయం జరిగేలా చూస్తాం.
–యుగంధర్, తహసీల్దారు,తొట్టంబేడు మండలం

మరిన్ని వార్తలు