దేవుడా.. ఇదేం పెత్తనం.!

11 Jan, 2019 12:59 IST|Sakshi
గండి క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయం

దేవాలయాల సిబ్బందిపై తెలుగు తమ్ముళ్ల అజమాయిషీ

కమిటీల పదవీ కాలం ముగిసినా అంటిపెట్టుకుంటున్న వైనం

విసిగిపోతున్న దేవాదాయ శాఖ అధికారులు

వేంపల్లె(చక్రాయపేట) : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పలు ఆలయాల్లో తెలుగు తమ్ముళ్ల పెత్తనం బాగా పెరిగిపోయింది. పదవీ కాలం ముగిసినా టీడీపీ నాయకులు దేవాలయాల్లో తిష్టవేసి అధికారులపై అజమాయిషీ చేస్తున్నారు. ప్రతి పని తమకు చెప్పి చేయాలని ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేంపల్లె, చక్రాయపేట మండలాల్లోని పలు ఆలయాలకు ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం రెండేళ్లు మాత్రమే ఆలయ కమిటీ పదవీ కాలం ఉంటుంది. రెండు మండలాల్లో రెండు ప్రధాన ఆలయాలకు నాలుగు నెలల క్రితం పదవీ కాలం ముగిసింది. కానీ పలువురు కార్యవర్గ సభ్యులు నిత్యం ఆలయాలకు వచ్చే సిబ్బందికి పనులు అప్పగిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, తాము ఏమి చెబితే అది చేయాలని సిబ్బందిపై అజమాయిషీ చేస్తున్నారు.

తలలు పట్టుకుంటున్న ఈఓలు..
పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా అధికార పార్టీ నాయకులు ఏదో ఒక సాకుతో ఆలయాలకు వచ్చి పెత్తనం చెలాయిస్తుండటంతో సంబంధిత ఆలయాల ఈఓలు తలలు పట్టుకుంటున్నారు. వారు చెప్పిన పనులు చేయకుంటే స్థానిక ప్రజాప్రతి నిధితో ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో ఈఓలు గత్యం తరంలేక మాజీ ఆలయ కమిటీ సభ్యుల కనుసన్నల్లోనే పని చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

ప్రత్యేక దర్శనాలతో అవస్థలు..
పదవిలో ఉన్నంతసేపు తమ బంధువులకు ఉచిత దర్శనాలు, ప్రసాదాలు అందించిన ఆలయ కమిటీ సభ్యులు పదవీ ముగిసిన తర్వాత కూడా అదేవిధంగా కొనసాగించాలని ఫోన్లు చేసి తమ బంధువులను పంపిస్తున్నారు. ప్రత్యేక దర్శనాలు చేయించాలని ఒత్తిడి చేయడంతో ఆలయ సిబ్బందికి ఇబ్బందిగా మారింది.

మళ్లీ మేమే వస్తాం.. అప్పుడు చూస్తాం..
ఆలయ కమిటీ మాజీ సభ్యులు చెప్పిన ప్రకారం నడుచుకోకుంటే ఆలయ సిబ్బందిని బెదిరిస్తున్నారు. త్వరలోనే కొత్త కమిటీల నియామకం జరుగుతుందని.. వాటిలో తమ పేర్లు ఉన్నాయని.. అప్పుడు మీ సంగతి ఏమిటో తేలుస్తామని ఆలయ సిబ్బందిని బెదిరిస్తున్నారు.  వారి అజమాయిషీని తట్టుకోలేక పలువురు సిబ్బంది ఆలయ ఈఓలకు ఫిర్యాదు  చేస్తుండగా.. ఈఓలు ఓపిక పట్టాలని సూచిస్తున్నారు.

ఉత్సవ కమిటీ సభ్యుల పెత్తనం..
ఇటీవల వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో పేరొందిన ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు తాత్కాలికంగా నాలుగు శ్రావణ మాస శనివారాలకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కమిటీ ఉత్సవాలు ముగిసిన వెంటనే రద్దవుతుంది. ఉత్సవాలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా కమిటీ ఆలయంపై పెత్తనం చెలాయిస్తోంది.       – ఆర్‌.వేణు, స్థానికుడు, వేంపల్లె

మరిన్ని వార్తలు