మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం...జాగ్రత్త!

17 Apr, 2019 13:19 IST|Sakshi

పలు గ్రామాల్లో అమాయకులపై అధికార పార్టీ జులుం

వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశారని వేధింపులు

గుంటూరు, ఈపూరు(వినుకొండ): వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశారనే నెపంతో మండలంలోని పలు గ్రామాల్లో అమాయకులను టీడీపీ నాయకులు వేధిస్తున్నారు. అధికారం అండ  చూసుకుని చెలరేగిపోతున్నారు. వీరిని ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ‘‘మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. మీ పెన్షన్లు తీసివేస్తాం, రేషన్‌కార్డులను తొలగిస్తాం, ఉపాధి హామీ కార్డులను తీసివేస్తాం, ప్రభుత్వ పథకాలను కట్‌ చేయిస్తాం’’ అంటూ నానా రకాలుగా వేధిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు. 2019 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే కొందరు అభాగ్యులు అధికార బలానికి అన్యాయమైపోతున్నారు.

మండలంలో మొత్తం 17 పంచాయతీలు ఉండగా ఇప్పటివరకు నాలుగు  గ్రామాల్లో ఈ విధంగా వేధింపులు జరిగినట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా   వైఎస్సార్‌ సీపీకి  ఎందుకు ఓట్లు వేశారని తీవ్రమైన వేధింపులు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న గోపువారిపాలెం గ్రామంలో ఈ ఎన్నికలు పేద, బడుగు, బలహీన వర్గాలపై ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల్లో ఆ గ్రామంలో పావు వంతుకు పైగా వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేయడంతో ఆగ్రహించిన కొందరు పెద్దలు ఈ దఫా కూడా తామే అధికారంలోకి వస్తామని, మీ అంతు చూస్తామని, మీ పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఉపాధిహామీ కార్డులు మొత్తం రద్దు చేయిస్తామని, మీకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని వారిపై విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది.

బొగ్గరం గ్రామం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఎన్నికలు మధ్యాహ్నం వరకు ఈవీఎంల మొరాయింపుతో జరగలేదు. అయితే 3.30 గంటల సమయంలో ఎన్నికలు ప్రారంభమైనప్పటికీ మధ్యలో అనేకసార్లు మిషన్లు మొరాయించడంతో ఒక వ్యక్తి వైఎస్సార్‌ సీపీకి ఓటు వేయగానే మిషన్‌ ఆగిపోయింది. ఆ గ్రామానికి చెందిన టీడీపీవారు ఈవీఎం దగ్గరకు పోగానే వీవీ ప్యాట్‌లో ఫ్యాన్‌ గుర్తు కనిపించడంతో నీవు వైఎస్సార్‌సీపీకి ఓటు ఎందుకు ఓటు వేశావని వేధించడంతో అతను భరించలేక పురుగుల మందు తాగి నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఈపూరు మండల కేంద్రంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న ఒక వ్యక్తి భార్య పసుపు కుంకుమ చెక్కును ఆమెకు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. అదేమని ప్రశ్నిస్తే గత కొంతకాలంగా ఆమె గ్రూపునకు డబ్బులు చెల్లించకుండా తిప్పుతోందని, అందుచేత ఇప్పుడు ఆ చెక్కును ఆపుకొని డబ్బులు డ్రా చేయించుకొని తీసుకున్నామని సదరు గ్రూపు సభ్యులు చెబుతున్నారు. అయితే పసుపుకుంకుమ కింద మొదట వచ్చిన చెక్కును ఆపకుండా ఇప్పుడు ఆపడం ఏమిటని, ఇది ఎన్నికల సమస్య కాదా అని పలువురు విమర్శిస్తున్నారు. మండల కేంద్రమైన ఈపూరుకు సమీపంలో ఉన్న మరో గ్రామంలో భార్యాభర్తల మధ్య ఎన్నికలు చిచ్చు రగిల్చాయి. భార్యను భర్త నీవు దేనికి ఓటు వేశావని ప్రశ్నించగా తాను వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశానని చెప్పడంతో అందుకు ఆగ్రహించిన భర్త ఆమెను గత రెండు రోజుల నుంచి తీవ్రంగా కొట్టడం, నీవు నాకు తెలియకుండా వైఎస్సార్‌ సీపీకి ఎందుకు ఓటు వేశావు, నీవు నాకు వద్దంటూ గెంటివేయడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె తల్లిదండ్రులు కన్న మమకారం చంపుకోలేక పుట్టింటికి తీసుకువెళ్లారు. పెద్దలు రాజీ జరుపుతున్నట్లు తెలిసింది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు కూడా లేకుండా చేయడం తగదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

>
మరిన్ని వార్తలు