ప్లీజ్‌.. మరొక్క చాన్స్‌

16 Jan, 2019 12:46 IST|Sakshi
సోమవారం రాజా కుటుంబీకుడు సర్వజ్ఞకుమార యాచేంద్రతో చర్చిస్తున్న పారిశ్రామికవేత్త గంగాప్రసాద్‌

టీడీపీ కోటకు బీటలు

అధికారపార్టీలో బుజ్జగింపులు షురూ..

అసంతృప్త నేతలతో జిల్లా మంత్రులు సెల్‌ కాన్ఫరెన్స్‌

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెంకటగిరి రాజకీయంవేడెక్కుతోంది.  టీడీపీలో ఇప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద పార్టీని వీడతారనే ప్రచారం, పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కీలకనేతలుగా ఉన్న వెంకటగిరి రాజా కుటుంబీకులు పార్టీ కార్యక్రమాలకు క్రమంగా దూరంగా ఉండటం తదితర పరిణామాలతో పాటు ప్రధాననాయకులందరూ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మొదలైన ఆసమ్మతి నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోసం మంత్రులు,ఇతర కీలక నేతలు రంగంలోకి దిగి మంతనాలు ప్రారంభించిఒక చాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌ అంటూ బుజ్జగింపుల పర్వానికితెరతీశారు.

సాక్షి ప్రతినిధి నెల్లూరు: ‘నేను ఈ ఒక్కసారికి పోటీచేయాలనుకుంటున్నా.. తర్వాత ఎవరైనా టికెట్‌ తెచ్చుకుంటే వారి గెలుపునకు కృషి చేస్తా... ఇప్పటి వరకూ జరిగింది మర్చిపోండి.. పనులు ఏమైనా కావాలంటే చేసుకోండి.. నా హ్యాట్రిక్‌ విజయానికి సహకరించండి.. చివరిగా అడుగుతున్నా ఒకే ఒక్క చాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌ ’ అంటూ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యనేతలను నిత్యం అడుగుతున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారిందనే ప్రచారం బలంగా సాగుతుంది. దీంతో ఎమ్మెల్యే కురుగొండ్ల రానున్న ఎన్నికల్లో టికెట్‌ తెచ్చుకోవటం కోసం ఇక క్యాడర్‌ను బుజ్జగించిడంతో పాటు తనతో సన్నిహితంగా ఉండే మంత్రులు, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర వద్ద తన పరిస్థితి చెప్పుకుని వారితో కూడా బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా తాను మాత్రం సంపాదించుకుంటే చాలు క్యాడర్‌తో పనిలేదన్న రీతిలో అడ్డగోలుగా దందాలు సాగించారు. ప్రతి పనిలో కమీషన్లు మొదలుకుని భారీ నజరానాల వరకు అన్నీ ఎమ్మెల్యే తన వ్యక్తిగత ఖాతాలోనేవేసుకున్నారు. దీనిపై క్యాడర్‌లో కొనేళ్లుగా అసంతృప్తి నెలకొంది.

దీంతో కొందరు ముఖ్య నేతలుగా ఉన్న గంగోటి నాగేశ్వరరావు, చెలికం శంకరరెడ్డి, పాపకన్ను మధురెడ్డి, చైర్‌పర్సన్‌ దొంతు శారద అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న క్రమంలో పార్టీ జిల్లా నేతలు సెల్‌కాన్ఫరెన్స్‌ పేరుతో బుజ్జగింపులు, తాయిలాల హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిని కాదు.. పార్టీని చూడండి. ఈ దఫా కూడా టీడీపీ విజయానికి సహకరించాలని కోరుతుండటంతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందనే చర్చ బలంగా సాగుతోంది.  అధికారపార్టీకి పెట్టని కోట వంటి వెంకటగిరి రాజా కుటుంబీకులతోపాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారదను సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానించటం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే సోమవారం  సీఎంకు సన్నిహితుడు, స్థానిక ఎమెల్యే కె.రామకృష్ణ వియ్యంకుడు అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్‌ ఎప్పుడూ లేని విధంగా వెంకటగిరి రాజాల నివాసానికి వెళ్లి రాజా కుటుంబీకుడు సర్వజ్ఞ కుమార యాచేంద్రతో ఏకాంతంగా చర్చించారు.

అందరి చూపు రాజాలవైపు..
నియోజకవర్గంలో వెంకటగిరి రాజా కుటుంబానికి మంచి పట్టు ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే కె.రామకృష్ణ రెండో దఫా ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత రాజా కుటుంబీకులను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించారనే ప్రచారం సాగుతుంది. రాజా కుటుంబానికి నియోజకవర్గంలోని సైదాపురం మండలం కలిచేడు వద్ద కళ్యాణరామ మైకామైన్‌ ఉంది. మైన్‌ ప్రాంతంలో మట్టి తరలించే విషయంలో రాజాలను ఎమ్మెల్యే ఇబ్బందుల పాల్జేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. ఇక పట్టణంలో గోషాస్పత్రి కోసం వెంకటగిరి రాజాలు దానం ఇచ్చిన రూ.కోట్ల విలువైన స్థలం విషయంలో రాజాలు, ఎమ్మెల్యే మధ్య దూరం మరింత పెరిగింది. కాశీపేట ప్రాంతంలో మనస్సాక్షి కూటమి నిర్వహించిన స్థలాన్ని రాజాలు చేనేత సొసైటీకి దానంగా ఇచ్చారు. అయితే ఆ స్థలాన్ని దేవాదాయశాఖకు అప్పగించి నామమాత్రపు లీజుతో అస్మదీయులకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే స్థాయిలో పావులు కదిపారు. అయితే దేవాదాయశాఖకు ఏ విధంగా ఆ స్థలం సంక్రమించిదో చూపాలంటూ చేనేతలు ఎదురు తిరగడంతో వివాదం కోర్టుకు ఎక్కింది. రాజాల ఉనికిని అస్థిత్వానికి గురిచేసే ఇటువంటి వరుస పరిణామాలతో వారు పార్టీ కార్యక్రమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం అధికారపార్టీ విజయావకాశాలకు గండిపడే ప్రమాదం ఉందనే భావన సర్వత్రా ఉంది. రాజాలను బుజ్జగించే పనిని ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుని ఇప్పటికే రెండు పర్యాయాలు రాజా కుటుంబీకుడు సర్వజ్ఞ కుమార యాచేంద్రతో ఫోన్‌లో మాట్లాడారు. అధికారపార్టీ టికెట్‌ను 2009లో సర్వజ్ఞకుమార యాచేంద్ర ఆశించారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే కె.రామకృష్ణకు అన్ని సర్వేల్లో వ్యతిరేకత ఉందని రావడంతో వెంకటగిరి సీటును టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు  రాజాలకు ఆఫర్‌ చేస్తారా ? సీఎం ఆఫర్‌ను రాజాలు అంగీకరిస్తారా ? అనే చర్చ సాగుతోంది. అయితే రాజాలు టికెట్‌ను కోరే అవకాశమే లేదనేది  రాజాల అనుచరుల వాదన. 

కొంపముంచిన కోటరీ
ఎమ్మెల్యే కె.రామకృష్ణ వ్యవహరశైలి కీలకనేతలను అధికారపార్టీకి దూరం చేయగా క్షేత్రస్థాయిలో కేడర్‌ను ఎమ్మెల్యే కోటరీగా వ్యవహరించిన జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు కేవికేప్రసాద్, వెంకటగిరి ఏఎంసీ చైర్మన్‌ పులుకొల్లు రాజేశ్వరరావు, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న శివ దూరం చేసినట్లు పార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. చైర్‌పర్సన్, కౌన్సిలర్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వంటి ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం లేకుండా పరిపాలన, అభివృద్ధి, ప్రభుత్వ పథకాల కేటాయింపులు, అన్ని శాఖల్లో   కేవికేప్రసాద్‌ మితిమీరిన జోక్యంతో ఆధిపత్యం చలాయించారు. దీనిపై జిల్లా మంత్రి పి.నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఇన్‌చార్జి మంత్రి అమర్‌నా«థ్‌రెడ్డిలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.

మరిన్ని వార్తలు