మన కమిటీ.. మన నివేదిక!

6 Jan, 2018 16:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదు అనే సామెత అక్షరాలా సరిపోతుంది దుర్గగుడి వ్యవహారంలో. వివాదం ఏదైనా కమిటీ వేసేది మనమే.. వచ్చే నివేదిక మనకు అనుకూలంగానే అన్న చందంగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. నిజనిర్థరణ కమిటీని వేసి విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇందుకోసం ముందుగానే తాంత్రిక పూజలు జరగలేదని నిజనిర్థారణ కమిటీతో చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తు‍న్నట్లు సమాచారం.

శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, కీలక నిందితుడు పార్థసారథితో పాటు అర్చకులు, దేవస్థానం ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్య, ఇతర అర్చకులను పిలిచి విచారణ చేశారు. ఈ విచారణలో కొంత మంది తాంత్రిక పూజలు జరిగాయని నిర్థారించి చెప్పగా, మరికొంత మంది అర్చకులు కూడా తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవేమని అభిప్రాయ పడ్డారు.

అయితే ఆలయ అధికారులు, అర్చకులు విచారణలో చెప్పిన మాటలను కమిటీ పరిగణలోకి తీసుకోకుండా నివేదిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల ఒత్తిడికి లోబడి నివేదిక రూపుదిద్దకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు, నివేదికను ఎలా రూపొందించాలి అనే విషయంపై నిజనిర్థారణ కమిటీతో పలుపార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా తాంత్రిక పూజలు జరగలేదనే విధంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. దేవస్థానంలోని విషయాలు బయటకు పొక్కడం వల్ల ఎవరూ నోరు ఎత్తవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.

నిజ నిర్ధారణ కమిటీ తీరుపై హిందూ ధర్మకర్తలు, పీఠాధిపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాలను వెల్లడించాల్సిన కమిటీ ప్రభుత్వం ఒత్తుడులకు లోబడి పనిచేసిందని విమర్శించారు. దుర్గాదేవి, మహిషాసురమర్దిని అవతారాలు ఒక్కటేనని మీరు ఎలా నిర్ణయిస్తారంటూ కమిటీ సభ్యులపై స్వామీజీలు మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు