మా దోపిడీ.. మా ఇష్టం

7 Apr, 2018 11:15 IST|Sakshi

నిప్పో స్థల భూమార్పిడిలో టీడీపీ నేతలతీరు

విమర్శలు వస్తున్నా పట్టించుకోని వైనం

కౌన్సిల్‌ ఆమోదానికి రంగం సిద్ధం చేసిన కార్పొరేషన్‌ పెద్దలు

12న కౌన్సిల్‌ సమావేశం

మేయర్‌ నివాసంలో అర్ధరాత్రి   వరకు అధికారులతో చర్చలు

నెల్లూరు సిటీ: అధికారం మాది.. తా ము చెప్పిందే వేదం.. తాము చేసిందే చట్టం అన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. మూడేళ్లుగా నగరపాలక సంస్థ పాలకవర్గం నిప్పో స్థల భూ మార్పిడిపై తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు కొందరు టీడీపీ కార్పొరేటర్లు సైతం వ్యతిరేకించారు. ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నాయకులు కౌన్సిల్‌ సమావేశాల్లో అడ్డుకోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు రూ.1200 కోట్ల స్థల వ్యవహారం కావడంతో టీడీపీలో వ్యతిరేకించే కార్పొరేటర్లకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ముడుపులు పంపారు. దీంతో గత నెల 29న బడ్జెట్‌ సమావేశంతో పాటు సాధారణ సమావేశాన్ని నిర్వహించి ఆమోదించేందుకు అన్ని విధాలా రంగం సిద్ధం చేశారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గట్టిగా వ్యతిరేకించడంతో మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ తప్పని పరిస్థితుల్లో సాధారణ సమావేశాన్ని వాయిదా వేశారు. పదో తేదీన కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తామని అజీజ్‌ ప్రకటించారు. అయితే నిప్పో స్థలానికి సంబంధించి మరోసారి వాయిదా వేయకుండా ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలో ఈ నెల 12న కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించేందుకు పాలకవర్గం నిర్ణయించినట్లు సమాచారం.

రూ.300 కోట్లకు డీల్‌
వేదాయపాళెం ప్రధాన రోడ్డులో 13.02 ఎకరాలను భూ మార్పిడి కింద నిప్పో నిర్వాహకులకు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు సహకరిస్తున్నారు. ఈ స్థలం విలువ దాదాపు రూ.1200 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. మరోసారి ఎలాంటి ఆటంకాల్లేకుండా ఉండేందుకు ప్రైవేట్‌ వ్యక్తులు టీడీపీ నేతలు, అధికారులకు భారీగా ముడుపులు అందించినట్లు సమాచారం. మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సైతం భారీగా ముడుపులు అందాయని సొంత పార్టీలోని కొందరు నాయకులే బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్లకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు నగదును వారి ఇళ్లకే పంపించారని సమాచారం. అధికారులు, నాయకులు, కార్పొరేటర్లు, చోటా నాయకులకు వారి వారి స్థాయిల్లో డబ్బుల పంపకాలు జరిగాయి. ఇలా మొత్తం రాష్ట స్థాయి నాయకుల నుంచి కిందిస్థాయి నాయకుల వరకు రూ.300 కోట్ల మేర పంపకాలు జరిగినట్లు సమాచారం.

కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు ఆరాటం
నగరపాలక సంస్థ కౌన్సిల్‌ ఏర్పడి నాలుగేళ్లు దాటుతోంది. అయితే ఇప్పటి వరకు కౌన్సిల్‌ సమావేశాలను నాలుగు సార్లు మాత్రమే నిర్వహించిన ఘనత పాలకవర్గానిది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించాల్సిన పాలకవర్గం ఏడాదికి ఒక సమావేశాన్ని నిర్వహించడమే కష్టంగా మారింది. అయితే ఇప్పుడు కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించేందుకు ఆరాటపడటం వెనుక భారీ స్కెచ్‌ ఉందని ప్రజలకు కూడా అర్థమైంది. ప్రజలు వరదలు, అనా రోగ్యం, తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని పాలకవర్గం ఇప్పుడు కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతోంది.

అర్ధరాత్రి వరకు మంతనాలు
ఈ నెల 12న జరిగే కౌన్సిల్‌ సమావేశంలో నిప్పో అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేందుకు పాలకవర్గం పట్టుపట్టింది. ఈ క్రమంలో గురువారం రాత్రి 12 గంటల వరకు మేయర్‌ నివాసంలో కమిషనర్‌ అలీంబాషా, టౌన్‌ప్లానింగ్‌ డీసీపీ సూరజ్, ఇంజినీరింగ్‌ ఎస్‌ఈ రవికృష్ణంరాజుతో సమావేశమయ్యా రు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. నిప్పో అంశానికి సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటే ఏ విధమైన వ్యూహం తో పావులు కదపాలనే అంశంపై చర్చలు జరిపారు. మేయర్‌ నివాసానికి అధికారులను పిలిపించి చర్చలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు