కొండెక్కిన ‘కోడ్‌’

13 Mar, 2019 03:32 IST|Sakshi
నెల్లూరు నగరంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సైకిళ్లు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న అధికార పార్టీ నేతలు 

టీడీపీ కార్యాలయంగా మారిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం 

అక్కడే టీడీపీ కార్యకలాపాలు, చేరికలు, సమీక్షలు, రాజకీయ ప్రసంగాలు  

పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు 

సైకిళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా చిత్రాలు 

చీరలు, గేదెలు ఇస్తూ ఓటర్లపై ప్రలోభాల వల 

నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం 

సాక్షి, అమరావతి/ సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికార బలంతో ఎన్నికల నియమావళిని అపహాస్యం చేస్తోంది. ఎలక్షన్‌ కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. నిబంధనలంటే తమకు లెక్కలేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. మహిళలకు చీరలు పంచుతున్నారు. కొన్ని చోట్ల గేదెలను సైతం పంచేస్తుండడం గమనార్హం. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. 

సీఎం నివాసమా? టీడీపీ ఆఫీసా?  
సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సిన తన అధికారిక నివాసం, దాని పక్కనే ఉన్న ప్రజా వేదికను పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మార్చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం సీఎం, మంత్రులు తమ అధికారిక నివాసాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. టీడీపీ కార్యకర్తల సమావేశాలు, జిల్లా, నియోజకవర్గాల సమీక్షలు, చేరికలు వంటి అన్ని కార్యకలాపాలకు సీఎం అధికారిక నివాసం, ప్రజా వేదిక ప్రధాన స్థావరంగా మారిపోయాయి. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ప్రజావేదికలో సోమవారం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అదేరోజు చింతలపూడికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళిని అక్కడే టీడీపీలో చేర్చుకున్నారు.

ఎన్నారై టీడీపీ తయారు చేసిన పది ప్రచార రథాలను ప్రజావేదిక ప్రాంగణంలోనే ప్రారంభించారు. మంగళవారం నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు నేతలను ప్రజావేదికలో టీడీపీలో చేర్చుకున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశాలను సైతం ప్రజావేదికలోనే నిర్వహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రతిరోజూ తన నివాసం నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. ఇందుకు ప్రభుత్వ ఆధీనంలోని కమ్యూనికేషన్‌ వ్యవస్థను వాడుకుంటున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులను, ప్రభుత్వానికి సంబంధించిన పలు వ్యవస్థలను చంద్రబాబు తన పార్టీ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

‘బడికొస్తా’ ముసుగులో దిగజారుడు‘ప్రచారం’ 
సార్వత్రిక ఎన్నికల ముంగిట అందివచ్చిన ప్రతి అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు. ‘బడికొస్తా’ పథకం సైకిళ్లను ఇప్పుడు ఎన్నికల ముందు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ సైకిళ్ల పంపిణీ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గత రెండు రోజులుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఊపందుకుంది. పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్లకు లోగోను అమర్చుతున్నారు. ఈ లోగోపై సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఫోటోలను ముద్రించారు. లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో పసుపు రంగు వేయడం గమనార్హం.
 
సీఎం సొంత జిల్లాలో యథేచ్ఛగా సైకిళ్ల పంపిణీ 
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని శాంతిపురం మండలం పెద్దబొమ్మనపల్లి యూపీ స్కూల్‌లో సైకిల్‌ స్పేర్‌ పార్ట్‌లను అసెంబుల్‌ చేసి గుట్టుచప్పుడు కాకుండా పంపకాలు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో దర్జాగా సాగిన ఈ తంతంగంపై స్థానికులు ‘సాక్షి’కి సమాచారం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నానికే ఐదు ట్రాక్టర్లలో సైకిళ్లను వివిధ పాఠశాలలకు తరలించారు. ఇంకా అక్కడ ఉన్న మూడు వేలకుపైగా సైకిళ్ల విడిభాగాలను జార్ఖాండ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు అసెంబుల్‌ చేస్తున్నారు. పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు కిందకు రాదన్న ఎంఈవో మళ్లీ సాయంత్రం మాట మార్చారు. సైకిళ్లను ఆయా స్కూళ్లకు తరలించామే తప్ప పంపిణీ చేయలేదని అన్నారు. 

నెల్లూరులో టీడీపీ ప్రలోభాలు షురూ 
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అధికార పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. మంగళవారం నెల్లూరు నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్దకు మూడు ట్రక్కుల్లో సైకిళ్లను తీసుకువెళుతుండగా వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. ట్రక్‌లో ఉన్న 60 సైకిళ్లను, ట్రక్‌ను పోలీసులకు అప్పజెప్పారు. ట్రక్కును తీసుకువచ్చిన కాంట్రాక్టర్‌పై చిన్న బజారు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మిగిలిన రెండు ట్రక్కులపై పోలీసుల విచారణ జరుపుతున్నారని సమాచారం. ఈ ఘటన వెనుక మంత్రి నారాయణ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సైకిళ్లపై సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు బొమ్మలున్నాయి. 

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన స్పీకర్‌ 
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి, వెన్నాదేవి గ్రామాల్లో మంగళవారం స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. ఈ సందర్భంగా కొఠారు అలివేలు మంగమ్మ అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.62 లక్షల చెక్కును స్పీకర్‌ అందజేశారు. కోడ్‌ అమల్లో ఉన్నందున అధికారులే ఇలాంటి చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, స్పీకర్‌ పంపిణీ చేసి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పలువురు తప్పుపడుతున్నారు. 

టీడీపీ అభ్యర్థి తరలిస్తున్న చీరలు స్వాధీనం
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా చీరలు తరలిస్తున్న వాహనాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులు సీజ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని ఫొటో ఉన్న స్టిక్కర్‌ అతికించిన ఏపి03 బిపి 3777 అనే వాహనం మంగళవారం రాత్రి నెల్లూరు నుంచి చంద్రగిరి వెళుతుండగా శ్రీకాళహస్తిలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో రూ.2 లక్షల విలువైన చీరలు ఉన్నాయి. దీంతో ఆ వాహనాన్ని సీజ్‌ చేశారు. అందులోని చీరలను స్వాధీనం చేసుకున్నారు. 

దెందులూరులో సైకిళ్లు, గేదెలు పంపిణీ  
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు సైకిళ్లు, గేదెలు పంపిణీ చేయించారు. పెదపాడు మండలం కొక్కిరపాడు గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడి నేతృత్వంలో స్థానిక నేతలు దాదాపు 50 గేదెలు, 100 సైకిళ్లు పంపిణీ చేశారు. కొవ్వలిలో ఏడు గేదెలు పంపిణీ చేశారు. దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామంలో 26 గేదెలను పంపిణీ చేశారు. సైకిళ్లు, గేదెల పంపిణీపై దెందులూరు తహసీల్దార్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌–2కు అంబేడ్కర్‌కు వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు మంగళవారం ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు