వలసలు షురూ..

28 Sep, 2019 08:56 IST|Sakshi

వైఎస్సార్‌సీపీలో పెరగనున్న చేరికలు

నడిపించే నాథుడు లేక అల్లాడుతున్న టీడీపీ

భవిష్యత్‌పై ఆ పార్టీ సీనియర్లలో గుబులు

ఇప్పటికే తరిగిపోతున్న కార్యకర్తలు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి నాలుగు దిక్కులుగా ఉన్న విజయనగరం, సాలూరు, బొబ్బిలి, కురుపాం కంచుకోటలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్దలయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే నేలమట్టమయ్యాయనడం సముచితం. అంతలా ఆ పార్టీ కురు వృద్ధులు, సీనియర్‌ నేతలు, తిరుగులేని నాయకులను వైఎస్సార్‌సీపీ మట్టి కరిపించింది. రాజకీయాల్లో ఎన్నికలు రావడం... అందులో గెలుపు ఓటములు సర్వసాధారణం. ఒకసారి ఓడిన వారే మళ్లీ గెలిచే అవకాశాలుంటాయి. కానీ ఈ సారి పరిస్థితి దయనీయంగా మారడంతో ఇన్నాళ్లూ ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారి రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీలో గౌరవం, భవిష్యత్తు లేదని భావిస్తున్న కొందరు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

లైన్‌లో విజయనగర టీడీపీ అధ్యక్షుడు
తెలుగుదేశం పార్టీ విజయనగరం పట్టణాధ్యక్షుడు, జిల్లా కేంద్రాస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వి.ఎస్‌. ప్రసాద్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. నెల రోజుల క్రితమే ఆయన పార్టీ పట్టణాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో నామమాత్రంగా కొనసాగుతున్న ఆయన పూర్తిగా టీడీపీని వీడాలని భావించి తాజాగా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఆయన తనవంటి సీనియర్లకు టీడీపీలో ఏమాత్రం గౌరవం లేనందునే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఆయన మరోపార్టీలో చేరాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తన అనుచర గణానికి ప్రసాద్‌ సంక్షిప్త సందేశా>లు పంపిస్తున్నారు. తనకు సహకరించాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆచూకీ లేని జిల్లా టీడీపీ నేతలు
జిల్లాలో ఇప్పటికే చాలా మంది టీడీపీ సీనియర్లు అప్రకటిత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా చెప్పుకునే అశోక్‌ గజపతిరాజు ఎన్నికల తర్వాత పార్టీ కేడర్‌కు గానీ, ప్రజలకు గానీ అందుబాటులో ఉండటం లేదు. ఆయన తనయ అదితి గజపతి ఒకటి రెండుసార్లు పార్టీ తరఫున ప్రెస్‌మీట్లు పెట్టి మమ అనిపించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె కూడా ముఖం చాటేశారు. అటు శత్రుచర్ల విజయరామరాజు, ఇటు ఆర్‌పి భంజ్‌దేవ్, ఇంకోవైపు సుజయ్‌కృష్ణ రంగారావు వంటి ఉద్దండులు నిర్వీర్యం అయిపోయారు. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించడం మానేశారు. దీంతో జిల్లా పార్టీని నడిపించేవారే కరువయ్యారు.

ద్వితీయ శ్రేణి నాయకుల్లో గుబులు
జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానంలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయిన వారిని నమ్ముకుని ఇంకా పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం లేదని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన చూసి వారంతా వైఎస్‌ఆర్‌సీపీ వైపు ఆకర్షితులవుతున్నారు. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల పోస్టులను నిరుద్యోగులకు అం దించి ఎన్నో కుటుంబాలను ముఖ్యమంత్రి నిలబెట్టారు. సంక్షే మ పథకాలను నిర్ణీత సమయంలోగా అమలుపరుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వైఎస్సార్‌సీపీలో చేర గా అనేక మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ప్రశ్నార్థకంగా టీడీపీ భవిష్యత్‌ 
ఓటమి తర్వాత పార్టీని జిల్లాలో నడిపించేందుకు కూడా సాహసించని టీడీపీ జిల్లా పెద్దలకు తాజా పరిణామాలు స్థానిక సంస్థ ల ఎన్నికలకు పెను సవాలుగా మారనున్నాయి. కొద్ది నెలల్లోనే స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ నేతలు బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ పరిస్థితి చక్కదిద్దడానికి కూడా టీడీపీకి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీని ఎన్నికల్లోనే జిల్లా ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఆ పార్టీలో నేతలు కూడా వెళ్లిపోతున్నారు. ప్రజల ఆదరణలేక, నాయకుల అండలేక జిల్లాలో టీడీపీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు