49 కేసులున్న చింతమనేని అమాయకుడా?

7 Sep, 2019 11:00 IST|Sakshi

తప్పు చేసినా వెనకేసుకొస్తారా

దౌర్జన్యాలు చేసినా ఏం అనకూడదా!

తెలుగుదేశం నేతల తీరుపై జిల్లా ప్రజల విస్మయం  

సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఇప్పటి వరకూ నమోదైన కేసులు 49. అందులో ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నమోదయ్యాయి. అధికార బలంతో అప్పట్లో పలు కేసులను తప్పుడువని రిఫర్‌ చేయించుకుని ఆయన ఎత్తివేయించుకున్నాడు. ఆఖరికి పోలీసులపై దాడి చేసిన కేసులు కూడా తప్పుడు కేసులుగా అప్పటి పోలీసు అధికారులు ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా దాడులకు పాల్పడుతున్న చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయగానే అతనిపై అక్రమ కేసులు పెట్టారంటూ తెలుగుదేశం నేతలు కలెక్టర్‌ను కలిసి గగ్గోలు పెట్టడం విమర్శలకు దారితీస్తోంది. 1995లో గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌పై దౌర్జన్యం చేయడం ద్వారా చింతమనేని నేర చరిత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. 

రౌడీ షీటు కూడా ఉంది 
1995 నుంచి ఇప్పటి వరకూ 49 కేసులు చింతమనేనిపై నమోదు అయ్యాయి. ఏలూరు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనపై రౌడీషీటు కూడా ఉంది. ఎన్ని కేసులు ఉన్నా ఇప్పటివరకూ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు బాధితులు భయపడటంతో ఒక్క కేసు మినహాయిస్తే మిగిలిన వాటిలో శిక్షలు పడలేదు.  2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి చేయడంతోపాటు ఎంపీ కావూరి సాంబశివరావుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వట్టి వసంత్‌కుమార్‌ గన్‌మేన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

5 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేయగా విచారణ చేసిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో హైకోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకున్నారు. తాజాగా నమోదైన కేసులో కూడా పోలీసులే ఆయనకు ముందస్తుగా లీక్‌ ఇచ్చారని, పారిపోవాలని ఆయనకు సన్నిహితులైన పోలీసులు సంకేతాలు ఇచ్చారని నిర్ధారణైంది. ఒక ఎస్‌ఐ నిరంతరం ఆయనతో టచ్‌లో ఉన్నట్లు కాల్‌లిస్ట్‌ డేటాలో తేలింది. ఇతనిపైనా చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 

బాధితుల క్యూ
చింతమనేని పరారు కావడంతో ఆయన బాధితులు ఒక్కొక్కరుగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కార్యాలయానికి, జిల్లా ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గతంలో తాము పెట్టిన కేసులను పోలీసులు చింతమనేనికి భయపడి ఫాల్స్‌ కేసులుగా రిఫర్‌ చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో వీటిపై పునర్విచారణ చేయనున్నట్లు ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌ ప్రకటించారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డేలేకుండా..!
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం చింతమనేని ఆగడాలకు అడ్డం లేకుండా పోయింది.  దళితులను ఉద్దేశించి మీకెందుకురా రాజకీయాలు అంటూ హేళనగా చింతమనేని మాట్లాడారు. అయితే దీనిపై పలువురు ఫిర్యాదు చేసినా అప్పట్లో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన ఒక ఉన్నతాధికారి కేసు నమోదు కాకుండా  చూశారు. విజిలెన్స్‌ అధికారులను నిర్బంధించిన కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై  విచారణ జరిపిన అప్పటి ఎస్సై కాంతిప్రియపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు.

గత ఏడాది హమాలీ కార్మికుడు రాచేటి జాన్‌పై చింతమనేని దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించారు.  దానిపై ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అట్రాసిటీ కేసు  నమోదు చేయడానికి తీవ్ర జాప్యం చేశారు. కార్మికుల ఆందోళనతో ఎట్టకేలకు కేసు నమోదు చేసినా అరెస్టు చేయలేదు. ఇందులో ఒక ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు సమాచారం. చింతమనేని ఇన్ని అకృత్యాలు చేసినా తెలుగుదేశం పార్టీ వారికి అమాయకుడిలానే ఆయన కనపడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడేమో అడ్డగోలుగా వ్యవహరించిన చింతమనేనిని అధిష్టానం ఏనాడు నియంత్రించలేదు. చింతమనేనిని లక్ష్యంగా చేసుకుని ఆయనపై ఆక్రమ కేసులు బనాయించారంటూ ఇప్పుడు జిల్లా తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. టీడీపీ నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 

చింతమనేని అరాచకాల చిట్టా 

  • కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దౌర్జన్యం
  • ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి
  • ఐసీడీఎస్‌ అధికారులకు బెదిరింపులు 
  • ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోయారు. 
  • అంగన్‌వాడీ కార్యకర్తలను దుర్భాషలాడారు
  • పోలీస్‌ కానిస్టేబుల్‌ మధును చితక్కొట్టారు. 
  • అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపారు. 
  • కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్టే అంశంలో అప్పటి జిల్లా ఎస్పీపై నోరుపారేసుకున్నారు.
  • 2017 మేలో గుండుగొలను జంక్షన్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్‌ఐ, సీపీఓలపై దాడి చేశారు. దీంతో వారు దెందులూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ప్రభాకర్‌పై 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
  • హనుమాన్‌జంక్షన్‌లో బస్‌ డ్రైవర్‌పై దాడి
  • ఏలూరులో రాచేటి జాన్‌ అనే దళిత కార్మికునిపై దాడి
  • పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు మేడికొండ కృష్ణారావుపై దాడి
  • న్యాయం చేయాలని వెళ్లిన వికలాంగుడి కుటుంబంపై దాడి 
  • ఎన్నికల్లో ఓటమి తర్వాత జానంపేట వద్ద వేసిన పైపులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు.
  • తాజాగా గత నెల 29న దళితులను దూషించి దౌర్జన్యానికి దిగారు. ఆ కేసులోనే ఇప్పుడు పరారీలో ఉన్నారు.    
మరిన్ని వార్తలు