టీడీపీ నేతల వక్రబుద్ధి

27 Sep, 2019 12:13 IST|Sakshi

ఐదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు..

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను అసలే పట్టించుకోలేదు

ప్రస్తుతం ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలతో నవ్వులపాలవుతున్న వైనం

ఒకటి రెండు కాదు ఐదేళ్లు టీడీపీ నేతలు అధికారం చెలాయించారు. ఆ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయక.. ప్రజా సమస్యలు పట్టించుకోక ప్రజలను నిలువునా మోసం చేశారు. జిల్లా అభివృద్ధిని కాదని సొంత ప్రయోజనాలే పరమావధిగా పని చేశారు. ప్రగతితో ప్రజల మనసులు గెలవాల్సింది పోయి మోసపు ఫీట్లతో కొందరు.. ప్లేట్లు ఫిరాయించి మరికొందరు ఓట్ల వేటలో బోర్లా పడ్డారు. తాజాగా అభివృద్ధే ధ్యేయంగా జనరంజక పాలన సాగిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీపై విమర్శలు చేస్తూ ప్రజల్లో చులకనవుతున్నారు.

సాక్షి ప్రతినిధి కడప :అయిదేళ్లు అధికారంలో ఉండి జిల్లా అభివృద్ధిని పట్టించుకోని టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైందంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డితోపాటు మరికొందరు నేతలు విమర్శలు గుప్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతల తీరును వైఎస్సార్‌సీపీ శ్రేణులేకాక సాధారణ ప్రజలు సైతం ఎండగడుతున్నారు. టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని దూరం పెట్టారన్నది పరిశీలకుల అభిప్రాయం. ప్రజల ఛీత్కారంతో జిల్లాలోని కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలతోపాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలోకూడా టీడీపీ విజయం సాధించలేకపోయిందన్నది స్పష్టం. అవన్నీ మరిచి తక్కువ కాలంలోనే అన్నివర్గాల ప్రజల మన్ననలు పొందుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్‌ జగన్‌ పాలనను చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు  విమర్శిస్తున్నారు. 

ఐదేళ్లు ఏమయ్యారు..
రైతు రుణమాఫీని ఐదు విడతలుగా అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాలన కాలంలో మూడు కంతులు మాత్రమే చెల్లించి మిగిలిన రెండు కంతులను ఎగవేసింది. టీడీపీ ప్రభుత్వం  రుణమాఫీ డబ్బులు చెల్లించి ఉంటే  ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అవసరం లేకుండా ఉండేదికదా..? అని  వైఎస్సార్‌ సీపీ శ్రేణుల వాదన. ఐదేళ్లపాలనా కాలంలో రైతు రుణమాఫీని పూర్తిగా   ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని రైతులే ప్రశ్నిస్తున్నారు. ఇక డ్వాక్రా రుణమాఫీని చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించినా ఆ తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వం లక్షలాది మంది అక్కాచెల్లెమ్మలను వంచించింది. ఎన్నికల తర్వాత రుణమాఫీ చేయాలని మహిళలు అడిగినా  ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఈ విషయాలు  పాపం జిల్లా టీడీపీ అధ్యక్షుడికి తెలియంది కాదు. కడపలో స్టీల్‌ ప్లాంటు నిర్మాణం చేయాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. స్టీల్‌ ప్లాంటు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని ఈ ప్రాంత వాసులు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయినా బాబు  పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత స్టీలు ప్లాంటుకోసమంటూ ఏకంగా గడ్డం స్టంటుకు తెరతీశారు.  తీరా ఎన్నికల సమయంలో స్టీల్‌ప్లాంటును రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోసమే ఈ ఫీట్‌ అని  ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ విషయం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి కూడా  తెలియంది కాదన్నది  పరిశీలకుల అభిప్రాయం. ఒంటిమిట్ట, గండిక్షేత్రం, బ్రహ్మంగారిమఠం తదితర ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్‌  చేస్తామని ఇచ్చిన హామీని టీడీపీ  ప్రభుత్వం గంగలో కలిపింది. జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తామని పదేపదే చెప్పారు. ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి తప్పా ఆచరణలో అమలు కాలేదు. 

హామీలన్నీ తుంగలో తొక్కి..
2014 నుంచి 2018 వరకు జిల్లాలో రైతులకు రూ.155  కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ రావాల్సి ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2012 ఏడాది శనగరైతులకు బీమా ఇవ్వలేదు. కమలాపురం రైల్వే బ్రిడ్జి హామీ నెరవేరలేదు. గండికోటలో స్కైవాక్‌ అంటూ ప్రకటించినా.. దాని సంగతి దేవుడెరుగు పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా కూడా చేయలేదు. ఐజీ కార్ల్‌ను ఏపీ కార్ల్‌గా మార్చడం మినహా అభివృద్ది చేసింది లేదు. తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల పరిధిలో మిగిలి ఉన్న పనులను టీడీపీ సర్కార్‌ గాలికి వదిలింది. ఇలా ఒకటా రెండా ఎన్నో హామీలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. ఇక టీడీపీ జిల్లా అధ్యక్షుడితోపాటు మరికొందరు నేతలకు కాంట్రాక్ట్‌ పనులతో పాటు  సొంత ప్రయోజనాలు మినహా  ప్రజాసమస్యల పరిష్కారానికి ఏ రోజూ కృషి చేసింది లేదు. అందుకే ప్రజలు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని పరిశీలకుల అభిప్రాయం.

మూడు నెలల్లోనే..  
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా జనరంజక పథకాలతో ప్రజల మనసు దోచుకుంటోంది. ఇక ఎగువన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నీటితో నిండగానే గండికోట, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించారు. కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పి జిల్లాలోని నిరుద్యోగులకు వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రైతు భరోసాతో వ్యవసాయ రంగాన్ని  అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు.  వైఎస్‌ జగన్‌ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నది అన్ని వర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు.  అయినా టీడీపీ నేతలు ఓర్వలేక పనిగట్టుకుని విమర్శలు చేస్తుండడంతో జనం నవ్వుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తీరు మార్చుకోవాలని లేకుంటే మరింత చులకన అవుతారని  హితబోధ చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా