బరితెగించిన టీడీపీ

12 Apr, 2019 13:43 IST|Sakshi
ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలను హెచ్చరిస్తున్న పోలీసులు

ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు 

అహోబిలంలో మంత్రి భర్త, టీడీపీ వర్గీయుల దౌర్జన్యం  

డి. బెళగల్‌ మాజీ సర్పంచుపై టీడీపీ వర్గీయుల దాడి 

గొర్విమానుపల్లెలో వాహనం ధ్వంసం 

పి. కోటకొండలో ఎమ్మెల్యే గుమ్మనూరు సోదరుడిపై దాడికి యత్నం 

మల్లేపల్లిలో రాళ్ల దాడి ...  రామళ్లకోటలో గొడవ 

కర్నూలు(అర్బన్‌): అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది.   వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టం కడుతున్నారనే అక్కసుతో  గురువారం జరిగిన పోలింగ్‌లో  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ నేతలు  దాడులకు తెగబడ్డారు. ఉదయం  నుంచి ప్రజలు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనడంతో పాటు ఎక్కడ చూసినా ... వైఎస్‌ జగన్‌ ప్రభంజనం వినిపించడంతో తట్టుకోలేని టీడీపీ శ్రేణులు పలు చోట్ల వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసి గాయపర్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను కూడా లేకుండా చేసి ఏకపక్షంగా పోలింగ్‌ నిర్వహించుకోవాలని ప్రయత్నించారు. కుదరకపోవడంతో  కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు దిగారు. 

మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం దొడ్డి బెళగల్‌ గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై. బాలరాగిరెడ్డికి మద్దతుగా కూర్చున్న మాజీ సర్పంచు, పోలింగ్‌ ఏజెంట్‌ నరసన్నపై ప్రత్యర్థి టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నరసన్న తలకు బలమైన గాయం కావడంతో వెం టనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  తలకు 11 కుట్లు పడ్డాయి. అలాగే కౌతాళం మం డలం గోతులదొడ్డిలో వైఎస్సార్‌సీపీ  ఏజెంట్‌  హనుమేష్‌పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఉలిగయ్య, ఆయన అనుచరులు ఏజెంట్‌ ఇంటికి వెళ్లి దాడి చేశారు.

 ఆలూరు  నియోజకవర్గం పి. కోటకొండ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం బూత్‌ నెంబర్‌ 288, 289లను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ సోదరుడు శ్రీనివాసులుపై టీడీపీ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు.

 బనగానపల్లె నియోజకవర్గం గొర్విమానుపల్లెలో ఓట్లు వేసి ఇళ్లకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేత రామేశ్వరరెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేశారు.ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ వర్గీయులకు చెం దిన బోలేరో వాహనం అద్దాలు పగిలాయి. అలాగే కమ్మవారిపల్లెలో కూడా టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  

పత్తికొండ అసెంబ్లీ పరిధిలోని మల్లెపల్లె, రామళ్లకోట గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమనిగింది.  

కర్నూలు మండలం తులశాపురం, ఎదురూరు గ్రామాల్లో ఏజెంట్లను బయటకు పంపేందుకు     టీడీపీ యత్నించింది. ఈ కుట్రను వైఎస్సార్‌సీపీ   అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమనిగింది.   

మరిన్ని వార్తలు