ఇసుకాసురులే రోడ్డెక్కారు..

17 Nov, 2019 05:26 IST|Sakshi
ఏర్పేడు ప్రధాన కూడలి వద్ద ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటూ ధర్నా చేస్తున్న ఇసుకాసురుల్లో ఇద్దరు ప్రముఖులు. వృత్తంలో నాగరాజునాయుడు, చిరంజీవులు నాయుడు.

నాడు నిందితులు.. నేడు బాధితులయ్యారా?

ఇసుక అక్రమ రవాణాలో సూత్రధారులు

16 మంది ప్రాణాలు పోయిన కేసులో ప్రధాన నిందితులు

నేడు ఇసుక లేదంటూ ధర్నా..

సాక్షి, తిరుపతి: దొంగే.. దొంగ దొంగ అన్న చందంగా టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను నడిపిన వ్యక్తులే నేడు ఇసుక కొరతంటూ ఆందోళనకు దిగటం చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమరవాణాను అరికట్టండి మహాప్రభో అంటూ ఇసుకాసురులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 16 మంది ప్రాణాలు పోవటానికి కారకులైన వ్యక్తులు నేడు ఇసుక సమస్యపై ధర్నా చేయటం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ నాయకులతో కలిసి శనివారం చిత్తూరు జిల్లా ఏర్పేడులో రోడ్డుపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఏర్పేడు మండలం గోవిందవరం–మునగళపాలెం స్వర్ణముఖి నది నుంచి ఇసుకను స్థానిక టీడీపీ నాయకులు మాజీ జడ్పీటీసీ ధనుంజయనాయుడు, నాగరాజునాయుడు, చిరంజీవులునాయుడు విచ్చలవిడిగా తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునేవారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానికులు పలుమార్లు అడ్డుకున్నారు. అయినా టీడీపీ నాయకులు లెక్కచెయ్యలేదు. దీంతో రెవిన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చెయ్యాలని మునగళపాలెం, గోవిందవరం పరిసర ప్రాంతాలకు చెందిన వారు మూకుమ్మడిగా 2017 ఏప్రిల్‌ 21న ట్రాక్టర్లలో ఏర్పేడుకు చేరుకున్నారు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్టేషన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఆ సమయంలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న లారీ వారిపై దూసుకెళ్లింది. 16 మంది మృతి చెందారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారి వల్లే ఇది జరగడంతో టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తర్వాత వారు బెయిల్‌పై వచ్చారు. 

ఇసుకాసురులే ధర్నా: టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ఇసుక కొరతపై ధర్నా చేపట్టారు. ఏర్పేడులో చేపట్టిన ధర్నాలో 16 మంది ప్రాణాలు కోల్పోవటానికి ప్రధాన కారకులైన మాజీ జడ్పీటీసీ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో నాగరాజు నాయుడు, చిరంజీవులు ముందు నిలబడ్డారు. అప్పట్లో ఇసుకను యధేచ్ఛగా తోడేసిన వారే ఈ ధర్నాలో పాల్గొనడంపై స్థానికులు విస్తుపోయారు.

మరిన్ని వార్తలు