బొబ్బిలి రాజుల భూ దాహం..!

14 Mar, 2018 08:47 IST|Sakshi

అధికారం అడ్డంపెట్టుకుని అమాయక గిరిజనులకు అన్యాయం

అధికారులతో కలిసి టీడీపీ మంత్రి కుతంత్రం

ఇప్పటికే ఎకరా స్థలాన్ని విక్రయించేసిన వైనం

రూ.కోట్ల విలువైన భూములు కొట్టేసే యత్నం

ఎప్పుడో ఇచ్చిన భూముల్లో ఇప్పుడు సాగు లేదని సాకులు

బొబ్బిలి రాజుల వద్ద పరిమితికి మించి ఉన్న భూమిని దశాబ్దాల కిందట ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానిని పేద గిరిజన రైతులకు పంచిపెట్టింది. ఇప్పుడు ఆ భూమి ధర కోట్ల రూపాయలు పలుకుతుండడంతో బొబ్బిలి రాజుల కన్నుపడింది.  అంతే.. అధికారం అడ్డం పెట్టుకుని, రాజరికపు విలువలను పక్కన పెట్టి పేదల భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎకరా భూమిని సొంతం చేసుకున్నారు. మిగిలిన భూమినీ లాక్కొనేందుకు ప్రయత్నిస్తుండడంతో గిరిజన రైతులు గగ్గోలు పెడుతున్నారు.   

సాక్షి ప్రతినిధి, విజయనగరం :  పేద గిరిజన రైతులకు దానం చేసిన  భూములు ఇప్పుడు కోట్ల రూపాయల ధర పలుకుతుండటంతో టీడీపీ మంత్రి కన్నుపడింది.  కుతంత్రాలు చేసి వాటిని తిరిగి లాక్కున్నారు. ఆరు నెలల కిందట చేసిన ఈ ప్రయత్నం వెలుగులోకి రావడంతో గిరిజనుల్లో పార్టీకి చెడ్డపేరు వస్తోందంటూ పార్టీ జిల్లా నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తను ఆ భూములను లాక్కోనని అప్పట్లో  మం త్రి బహిరంగ సభలోనే  వివరణ ఇచ్చుకున్నారు. తెరవెనుక ప్రయత్నాలు మాత్రం యథావిధిగానే సాగించారు. ఎకరా భూమి రూ.2 కోట్లు ధర పలి కే బొబ్బిలిలో ఎనిమిది ఎకరాలను ముందుగా ప్రభుత్వానికి స్వాధీనం చేయించి తర్వాత తన సొంతం చేసుకోవాలనే పన్నాగం రచించారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసేందుకు బేరాలు సాగిస్తూ, ఇప్పటికే ఎకరా విక్రయించేశారు.

ఇదీ పరిస్థితి...
విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాతంలో నాలుగు దశాబ్దాల కిందట భూ పరిమితి చట్టం ప్రకారం మంత్రి కుటుంబీకుల వద్ద అదనంగా ఉన్న 166.50 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే వాస్తవానికి తాము ఇవ్వాల్సింది 158.50 ఎకరాలు మాత్రమేనని, సర్వే నెం.45లో సింహాలతోట ఎదురుగా ఉన్న ఎనిమిది ఎకరాలు అదనంగా ఇచ్చేశామని వారు వాదిస్తున్నారు. కానీ తాము సక్రమ మార్గం లో,నిబంధనల ప్రకారమే 166.50 ఎకరాలు స్వా« దీనం చేసుకున్నామని ప్రభుత్వం చెబుతూ వ స్తోంది. ఈ వివాదం తేలకముందే ఆ భూముల్లో కొన్నిటిని గొల్లపల్లి, మల్లంపేట, పనుకుపేట, పె దభోగిల, రామన్న అగ్రహారం గ్రామాల గిరిజన రైతులు,పేదలకు డి పట్టాలతో సహా ప్రభుత్వం పంచి పెట్టింది. వారికి పాసు పుస్తకాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలు కూడా మం జూరు  చేసింది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొంతమంది పేదలకు ఈ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చారు.

ధర పెరగడంతో...
ఈ ప్రాంతంలో ఇప్పుడు భూమి విలువ ఎకరా సుమారు రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల  వరకూ పలుకుతోంది. దీంతో మంత్రికి ఆశపుట్టింది. వీటిని పేదల నుంచి లాక్కోవాలని  పావులు కదిపారు. 32 మంది గిరిజనులకు నోటీసులు జారీ చేశారు. డి–పట్టా పొందిన తర్వాత మూడేళ్ల లోపు ఎలాంటి పంట సాగు చేయని కారణంగా భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామం టూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, పట్టా పొందిన వెంటనే ఆ భూ ముల్లో పంటలు పం డించామని, కొంతకాలం తర్వాత రెండు పంటల సాగుకు సాగునీరు లేకపోవడంతో వర్షాధార పంటలైన కందులు, మినుములు సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.

రాజకీయ కుతంత్రం..
మంత్రి ప్రయత్నంపై విమర్శలు రావడంతో ప్రయత్నాన్ని విరమించినట్లు ప్రకటించినా  చాపకింద నీరులా తన పని చేసుకుపోయారు. పట్టా దారుల నుంచి సమాధానం వచ్చే వరకూ వేచి చూడకుండా కొంత భూమిని తమ పేరున రాయించేసుకున్నారు. 247–2ఏలో 1.7ఎకరాలు మంత్రి పేరిట ఉంది. భూ బదలాయింపు అన్నది నోటిఫికేషన్‌ ద్వారా జరగాలి. ఇక్కడ అలా జరగలేదు. ఇందులో 247–2లో ఎకరా స్థలాన్ని టీచర్స్‌ సిండికేట్‌గా వ్యవహరించే రియల్‌ ఎస్టేట్‌ దారులకు విక్రయించేసినట్టు సమాచారం. ఆ తరువాత భూమిని పూర్తిగా రాజుల పేరున నేరుగా రాయించేందుకు బొబ్బిలిలో తహసిల్దార్‌గా పనిచేసిన బి.సుదర్శన దొరను పార్వతీపురం ఆర్డీఓగా నియమించేందుకు రాజు లు కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. స్వాధీనం చేసుకున్న భూ అమ్మకానికి తెర తీసినట్టు బోగట్టా.

నాకు తెలియదు..
సర్వే నంబర్‌ 45లో 13 ఎకరాలు ప్రభుత్వం పేరిట ఉంది. ఇతర వివరాలేవీ నాకు తెలియదు. ఈ భూమిపై వివాదాలున్న విషయం కూడా ఎవరూ చెప్పలేదు. నేను ఈ మధ్యనే విధుల్లో చేరాను. ఇక్కడ పూర్తి స్థాయి తహసీల్లార్‌ లేరు.   – ఆర్‌.సాయికృష్ణ, ఇన్‌చార్జి తహసీల్దార్, బొబ్బిలి
 
కొండల్లోకి వెళ్తామా..
నాకు  అప్పట్లో భూమి ఇచ్చారు. ఆ భూమిని చదును చేసుకుంటున్నప్పుడు అధికారులు వచ్చి అడ్డగించారు. ఆ భూమిని ఇప్పుడు తీసేసుకుని వేరే భూమి ఇస్తారని విన్నాం. మాకు భూమి ఎక్కడుందో అక్కడే కావాలి. వేరే కొండల్లో భూమి ఇస్తామంటే వెళ్తామా? మాకు న్యాయం కావాలి.
– చల్ల సీతమ్మ, డీ–పట్టాదారు, పుల్లేరు వలస

 కొత్త తహసీల్దార్‌ వస్తే అప్పుడు చూద్దామన్నారు
మా భూమి లాక్కుంటున్నట్టు తెలిసి అడిగేందుకు వెళ్లాం. మాతో బేబీ నాయన మాట్లాడారు. ఇప్పుడు తహసీల్దార్‌ లేరు. కొత్త తహసీల్దార్‌ వస్తే అప్పుడు మీకు భూమి ఎక్కడిస్తామన్నదీ చెబుతామన్నారు. ఆ తరువాత మరో మధ్యవర్తిని పెట్టారు. ఆ మధ్యవర్తి వద్దకు మరోసారి వెళ్తే పదేపదే రాకండి. నాకు ఎప్పుడు వీలయితే అప్పుడు మాట్లాడతామని ఆయన హెచ్చరించారు. మా భూమిని వదులుకోం.   – ముంగి నర్సింహులు, డీ పట్టా యజమాని, పుల్లేరు వలస  

కోర్టు కెళ్తాం...
మా భూములు సాగుకు మేం యత్నిస్తే రాజుల భూము లంటూ అప్పట్లో వీఆర్వో మమ్మల్ని అడ్డుకున్నారు.  పాత తహసీల్దార్‌ సూర్యనారాయణ కూడా రాజుల భూమిగా చెప్పారు. దిబ్బగుడ్డివలçసకు చెందిన ఓ న్యాయవాది మా తరఫున మాట్లాడారు. కోటలోకి పిలిచి బేబీనాయన ( మంత్రి సుజయకృష్ణ రంగారావు సోదరుడు), ఆయన అనుచరులు ఏ భూమి? దేనికి వచ్చారు? అంటూ తెలియనట్టు మాట్లాడారు. మా భూములను మేం వదులుకోం. న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాం. – చల్లాగోపాలం, డీ పట్టా భూమి వారసుడు, పుల్లేరువలస, బొబ్బిలి

హైకోర్టులో పిల్‌ వేస్తాం..
డీ పట్టా దారులను వెళ్లగొట్టడం దారుణం. ఈ విషయాన్ని ఇప్పటికే సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశాం. ఇప్పుడు ఫైనల్‌గా హైకోర్టులో పిల్‌ వేస్తాం. భూ లగాన్‌లో మంత్రి కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై గిరిజనులకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం. – పోల అరుణ్‌కుమార్, న్యాయవాది, బొబ్బిలి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు