రాస్కెల్‌.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత

27 Jul, 2018 08:47 IST|Sakshi
కర్ణాటక సీఎం కుమారస్వామి, తిరుమల రాక సందర్భంగా అధికారులను దుర్భాషలాడిన టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు

తహసీల్దార్, జేసీలపై టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని దుర్భాషలు

అంతు చూస్తానంటూ బెదిరింపు

రేణిగుంట విమానాశ్రయంలో ఘటన

రేణిగుంట/చిత్తూరు కలెక్టరేట్‌: చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గిరీషాగౌడ్, రేణిగుంట తహసీల్దార్‌ నరసింహులునాయుడులపై నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. రాస్కెల్‌.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నువ్వు నాకు చెప్పేవాడివా అంటూ తహసీల్దార్‌పై చిందులు తొక్కారు. నీ అంతు చూస్తానంటూ జాయింట్‌ కలెక్టర్‌ను హెచ్చరించారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రన్‌వే నుంచి వారు అరైవల్‌ ఎంట్రెన్స్‌ గుండా బయటకు వస్తారని ప్రొటోకాల్‌ అధికారులు వేచి ఉన్నారు.

ఆ సమయంలో వారికి స్వాగతం పలికేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే రామారావు అక్కడే వేచి ఉన్నారు. అయితే అతిథులు అనూహ్యంగా మెయిన్‌గేటు గుండా బయటకు వచ్చారు. ఎమ్మెల్యేను మెయిన్‌ గేటు వద్దకు తీసుకుని వెళ్లడానికి జేసీ వచ్చిన సమయంలో.. తనను అనసవరంగా అక్కడ కూర్చోబెట్టారంటూ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నీకు ప్రొటోకాల్‌ మర్యాదలు తెలియవా? నీ అంతు చూస్తా’’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న తహసీల్దార్‌ నరసింహులునాయుడు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయనపై తీవ్ర దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా హతాశులయ్యారు.

ఎమ్మెల్యేది అహంకార ప్రవర్తన
ఎమ్మెల్యే బొల్లినేని రామారావుది అహంకారపూరిత ప్రవర్తన అని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి నరసింహులునాయుడు, జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్‌వో సంఘనేత చెంగల్రాయులు అన్నారు.  ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి అధికారుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సహించరానిదన్నారు. ఘటనపై తాము సీఎంకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందే..
జాయింట్‌ కలెక్టర్‌ గిరీష, తహసీల్దార్‌ నరసింహులునాయుడులకు  శుక్రవారం ఉదయం 10 గంటలోపు ఎమ్మెల్యే రామారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ విజయసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులంతా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు