ఎమ్మెల్యే అనుచరుడా..  మజాకా!

20 Apr, 2018 08:41 IST|Sakshi
ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడుతున్న అధికార పార్టీ నాయకుడు

ప్రభుత్వ భూమి కనిపిస్తే... గోవిందా

రూ.2 కోట్ల భూమి కబ్జా చేసిన టీడీపీ నేత

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ నిర్మాణాలు

ఫిర్యాదులొస్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు

ఎమ్మెల్యే కనుసన్నల్లో కబ్జాలు... దందాలు

పినిశెట్టి కుమారి.. ముగ్గురు పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. దువ్వాడలో దయాళ్‌నగర్‌లో 133 గజాలు కొనుగోలు చేసింది. కొనుక్కున్న స్థలంలో 2017లో రేకుల షెడ్డు వేసింది. ఈ జాగాపై అధికార పార్టీకి చెందిన నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు కన్నేశాడు. మార్చి 29, 2018లో సుమారు 30 మందితో ఆమె ఇంట్లోలేని  సమయం చూసి తన అనుచరులతో కలిసి ఆ ఇంటిని నామరూపాల్లేకుండా కూల్చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు దువ్వాడ పోలీస్‌ స్టేషనుకు ఫిర్యాదు చేసింది. ఇలా అనేక రకాలు భూ కబ్జాలు, రాత్రికి రాత్రే నిర్మాణాలు వంటి అనేక ఫిర్యాదులు ఉన్నాయని స్వయంగా అధికార పార్టీ నాయకులే తలలు పట్టుకుని కూర్చుంటున్నారు.

సాక్షి, విశాఖపట్నం : తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల వృద్ధి రేటులో కూడా గాజువాక నెం.1. అంతేకాదు.. అధికార టీడీపీ నేతల దందాలు..భూకబ్జాల్లో కూడా అదే స్థానంలో నిలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఆయన అనుచరగణం జాగా కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే మీ అంతుచూస్తాం అంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. ఇక్కడ అధికారులు సైతం వీరి అడుగులకు మడుగులొత్తుతున్నారు. గాజువాకకు కూతవేటు దూరంలో 65వ వార్డు పరిధిలోని హరిజనజగ్గయ్యపాలెంలో ఉన్న మాజీ సైనికుల కాలనీలోని సర్వే నంబర్‌ 117/3లో సుమారు 15 సెంట్లకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. మార్కెట్‌లో రూ.2 కోట్లకు పైగా పలుకుతున్న ఈ ప్రభుత్వ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్నేశాడు.

ఎలాగైనా కాజేయాలని పక్కా స్కెచ్‌ వేసి దర్జాగా కబ్జా చేశాడు. పైగా తన బంధువైన ఓ అంగన్‌వాడీ కార్యకర్త పేరిట దొంగపత్రాలు సృష్టించాడు. టౌన్‌ప్లానింగ్‌ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టాడు. గతంలో ఈ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుపై పరిశీలించేందుకు వచ్చిన ఆర్‌ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడంతో అటువైపు చూసేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో ఇతగాడి భూకబ్జాలపై ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిసారి హడావిడి చేయడం.. కొద్దికాలం పాటు నిర్మాణాలు ఆపమని ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప అధికారులు ఏనాడు చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. 

డిప్యూటీ తహసీల్దార్‌ అండదండలతో...
ఇటీవల గాజువాక తహసీల్దార్‌  బదిలీ అయ్యారు. అప్పటికే ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌  పోస్టులో తన పీఏగా పని చేస్తున్న చేతన్‌కు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోస్టింగ్‌ ఇప్పించారు.   ఇన్‌చార్జి తహసీల్దార్‌ బాధ్యతలు కూడా ఆయనకే కట్టబెట్టేలా ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ఇక 65వ వార్డు నాయకుడికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.  

ప్లాన్‌ అప్రూవల్స్‌ అంటూ పొంతన లేని ఫ్లెక్సీలు
నిర్మాణం వద్ద ప్లాన్‌ అప్రూవల్స్‌తో పాటు ఇతర అనుమతులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ప్రదర్శించాలి. కానీ అందర్ని అయోమయానికి గురిచేసే విధంగా పొంతన లేని నోటీసులు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు క్రమబద్ధీకరించే అంశం సంబంధిత అధికారుల పరిధిలో ఉందంటూ కోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ ఆర్డర్, హౌసింVŠ  శాఖ రుణాలు మంజూరు చేసినట్టుగా మరొకటి పొంతన లేని నోటీసులను భారీ ఫ్లెక్సీగా ఏర్పాటు చేసి అందర్నీ అయోమయానికి గురి చేస్తున్నారు.   ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక వీఆర్వో నుంచి జోనల్‌ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్‌ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు.  స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి పరిశీలించింది. అంతే వారిపై వీరంగం సృష్టించటంతో అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు.  అధికారులు సదరు నాయకుడి అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని గ్రామానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని  స్థానికులు కోరుతున్నారు.

ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు 
ఈ వ్యవహారంపై డిప్యూటీ తహసీల్దార్‌ చేతన్‌ను వివరణ కోరగా అది పూర్తిగా ప్రభుత్వ స్థలమేనని, ఆ భూమి ఎవరికి కేటాయించలేదని, వాటిలో నిర్మాణాలకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, పైగా తమకు ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదని చెప్పుకొచ్చారు. అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా తమ దృష్టికే రాలేదంటూ దాటవేశారు.

ఆ నాయకుడి ఆగడాలకు అంతేలేదు
అధికారపార్టీ నాయకుడు అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి పక్కనే నా ఇల్లు జీవీఎంసీ అనుమతులతో ఉంది. నా ఇంటి  మరమ్మతు కోసం గోడను తొలగించాను. తిరిగి కట్టుకుందామని అనుకుంటే అధికారపార్టీ నాయకుడు జీవీఎంసీ అధికారులతో ఇంటిని కట్టకుండా నరకాన్ని చూపిస్తున్నాడు. బిల్డింగ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ నాయకుడు చెప్పినట్టు విని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.  
– పి.ఈశ్వరమ్మ, బాధితురాలు

అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు 
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే తిరిగి తమమీదే తప్పులు ఎత్తిచూపుతున్నారు. ఆ నాయకుడు అక్రమనిర్మాణం చేపట్టడమే కాకుండా అధికారులతో భయభ్రాంతులకు గురి చేయిస్తున్నాడు.          
– వై.శ్యామల, స్థానికురాలు

మరిన్ని వార్తలు