సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

9 Dec, 2019 13:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారం పక్కాగా అందుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ... ‘ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని సమాచారాన్ని కూడా సీఎం జగన్‌ తెప్పించుకున్నారు. నాయకుడికి అలాంటి సమాచారం అవసరం’ అని పేర్కొన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సమాధానం ఇచ్చారు. పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం నిజానిజాలను పరిశీలన చేస్తోందన్నారు. కమిటీ నివేదిక రాగానే అన్ని విషయాలు బయటకు చెబుతామని తెలిపారు. పద్దతి ప్రకారం జరగాలంటే కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు. అదే విధంగా వివిధ అంశాలపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రతకై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకురానున్న చట్టం ఆవశ్యకతను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సభకు వివరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు