అందుకే సీఎం జగన్‌ను కలిశా: మద్దాలి

30 Dec, 2019 18:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్టు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు తెలిపారు. గుంటూరు పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల గురించి అడగ్గా సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తన నియోజకవర్గ పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించగా, రూ. 25 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుపై చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరితో ఉన్నారని అన్నారు. 

చదవండి: సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌ కార్యదీక్షత, పట్టుదల చూసి చాలా సంతోషం వేసిందన్నారు. ఉగాది నాటికి పేదలు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్‌ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో రాష్ట్రం ఇండస్ట్రియల్‌ హబ్‌ అయిందని, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మళ్లీ అదే విప్లవం రాబోతోందన్నారు. బొల్లాపల్లి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.

రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు
రాజధాని గురించి మాట్లాడే పెద్దవాడిని కాదని, రాజధానిపై సీఎంకి స్పష్టత ఉందన్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో అభివృద్ధి జరగలేదని, రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా ఉంటుందని సీఎం జగన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని, అప్పటివరకు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఐదేళ్లలో రైతుల్ని ఇబ్బంది పెట్టింది ఎవరో అందరికి తెలుసునని అన్నారు. పార్టీ మారడం గురించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. తాను చంద్రబాబును విమర్శించడం లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలని మాత్రమే చెబుతున్నానని ఎమ్మెల్యే గిరిధర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు