ఓటేసిన జనమే టీడీపీ ఎమ్మెల్యేని ఛీ కొట్టారు..

21 Jul, 2020 15:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఓటేసిన జనమే మాటమార్చిన నాయకుడిని ఛీ కొట్టిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. మూడుసార్లు గెలిపించినా ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా వ్యవహరించిన విశాఖ ఈస్ట్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని రామకృష్ణపురంలో మంగళవారం రోజున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి రామకృష్ణ బాబు వెళ్లారు. గతంలో మాదిరిగానే స్థానికులు వచ్చి పలకరిస్తారని ఎమ్మెల్యే భావించాడు. కానీ ఊహించని విధంగా స్థానికులతో పాటు సమీప కాలనీల ప్రజలు కూడా అక్కడకు చేరుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అధికారం మీకు లేదంటూ నినాదాలు చేశారు. వారికి రామకృష్ణబాబు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా జనం గొడవకు దిగారు. (ఉత్తరాంధ్ర ద్రోహులు చంద్రబాబు, రామోజీ)

దీంతో మీరు కూడా నాతో పాటు వచ్చి కొబ్బరికాయ కొట్టండి అని చెప్పడానికి మరో మారు ఎమ్మెల్యే ప్రయత్నించగా ఆ పప్పులు ఉడకవంటూ జనం తిరగబడ్డారు. అతని వెంట ఉన్న అనుచరులపై కూడా ఎప్పుడూ లేని విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహంపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే సీఎం నిర్ణయాన్ని వెలగపూడి వ్యతిరేకించడమే కారణమని తెలిసింది. కాగా ఇటీవల సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన చేయడంతో ఉత్తరాంధ్రకు చెందిన అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

కానీ విశాఖ కేంద్రంగా గెలుపొందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ అధినేత చంద్రబాబు నాయుడు బాటలో నడిచి విశాఖ జనం విశ్వాసం కోల్పోయారు. స్థానికేతరుడు అయినప్పటికీ విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వెలగపూడిని మూడుసార్లు ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలు గెలిపించారు. అయితే ఆయన మాత్రం విశాఖ ప్రజలు ప్రజానిర్ణయాన్ని కాదని అధినేత బాటలో నడవడంతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. (ప‌చ్చ ‌త‌మ్ముళ్లూ.. గూగుల్‌లో వెతకండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు