వైఎస్ జగన్ లక్ష్యంగా టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు

20 Dec, 2014 14:18 IST|Sakshi
వైఎస్ జగన్ లక్ష్యంగా టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అధికార పార్టీ సభ్యుడు కూన రవికుమార్‌ చేసిన వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తప్పుబట్టారు.  మిడిమిడి జ్ఞానంతో సభ్యుడు మాట్లాడుతున్నారని ఆయన శనివారం అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. హుద్హుద్ తుపాను చర్చలోనూ టీడీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల కాలంలో కరవుతో అల్లాడిపోయిన ప్రజలకు 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక కేంద్రం నుంచి బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ తీసుకొచ్చారని గుర్తు చేశారు.  

ఎప్పుడూలేని రీతిలో రైతులకు వడ్డీని మాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదని వైఎస్ జగన్ అన్నారు. రూ.1150 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తూ వైఎస్ఆర్ మొట్టమొదటి సంతకం చేశారన్నారు. విషయాలు తెలుసుకుని అధికార సభ్యులు మాట్లాడితే బాగుంటుందన్నారు. విషయాలను తెలుసుకోకుండా రాళ్లు, బండలు వేస్తున్నారని మండిపడ్డారు.

హుద్హుద్పై ఎమ్మెల్యేల ప్రసంగాలు ఆత్మస్తుతి - పరనింద మాదిరిగా సాగుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. టెక్నాలజీ గురించి పదేపదే ప్రభుత్వం చెప్తోంది కానీ 61మంది ఎందుకు చనిపోయారని ప్రశ్నించారు. అదే తుఫాను కారణంగా ఒడిశాలో మృతుల సంఖ్య 5-6కు మించి లేదని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం చెప్తున్న నష్టం అంచనాలో...పెట్టే ఖర్చు ఒక్క శాతం కూడా లేదన్నారు.

మరిన్ని వార్తలు